డబ్బులున్నాయా లేవా అనేది కాదు ప్రశ్న
posted on Feb 9, 2015 8:55AM

కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీలో భాగంగా క్రిందటి వారం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 850 కోట్లు నిధులు విడుదల చేసింది. కానీ దాని వలన రెండు రాష్ట్రాల నుండి కూడా విమర్శలు మూటగట్టుకోవలసి వచ్చింది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి అంత భారీగా నిధులు ఇచ్చిన కేంద్రం తెలంగాణా రాష్ట్రానికి మాత్రం చిల్లి గవ్వ విదిలించకుండా మళ్ళీ సవతి తల్లి ప్రేమ చూపించిందని తెలంగాణా ప్రజలు భావిస్తుంటే, ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.16, 000 కోట్ల లోటు బడ్జెట్ ఉంటే కేవలం రూ.500 కోట్లు మాత్రమే విడుదల చేసినందుకు సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అసంతృప్తి వ్యక్తం చేసారు. అదే విషయాన్ని కుండబ్రద్దలు కొట్టినట్లు ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీతో చెప్పారు కూడా.
పార్లమెంటు సాక్షిగా అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ తదితరులు ఇచ్చిన అన్ని హామీలను, విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను కేంద్రం వీలయినంత త్వరగా అమలుచేయాలని ఆయన గట్టిగా కోరారు. కేంద్రానికి ఆర్ధిక సమస్యలుంటే ఉండవచ్చును. అయినా కూడా కేంద్రం తన హామీలను నిలబెట్టుకోవలసిందేనని ఆయన అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు తగ్గిన కారణంగా కేంద్రానికి రూ.45,000 కోట్ల ఆదాయం సమకూరిందని కనుక రాష్ట్రానికి నిధుల మంజూరు విషయంలో వెనకాడటం సరికాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసారు. ఆ కారణంగానే ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ మీడియా ముందుకు వచ్చి రాష్ట్రానికి ఇచ్చిన అన్నిహామీలను అమలుచేస్తామని ప్రకటించారు.
ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు అనేకసార్లు డిల్లీ వెళ్లి ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని, ప్రధాని మోడీని కలిసి నిధుల విడుదల కోసం పదేపదే అభ్యర్ధించారు. కానీ ఏనాడూ కూడా ఇంత కటువుగా మాట్లాడలేదు. కానీ మార్చి 31తో ఆర్ధిక సంవత్సరం ముగిసే సమయంలోగా కేంద్రం నుండి నిధులు రాబట్టుకోలేకపోతే ఆ ప్రభావం రాష్ట్ర బడ్జెట్ పై కూడా తీవ్రంగా ఉంటుంది. అదీగాక ప్రతిపక్షాలు కూడా ఈ అంశాన్ని అందిపుచ్చుకొని ఆయనను ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుండటంతో ఇంత కటువుగా మాట్లాడవలసి వచ్చిందని చెప్పవచ్చును. కానీ గత కాంగ్రెస్ ప్రభుత్వంలా కాకుండా మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన అన్ని హామీలను అమలుచేసేందుకు కట్టుబడి ఉందని, నిధులు ఇస్తామని గట్టిగా హామీ ఇస్తోందని కనుక అప్పుడే తొందరపడి అపోహలు పెంచుకోవడం మంచిది కాదని చంద్రబాబు నాయుడు అన్నారు.