నాన్నంటే నీలాకాశం..
posted on Jun 17, 2023 10:00AM
ప్రతి వైకాఠి జీవితంలో తల్లిదండ్రుల పాత్ర అనిర్వచనీయమైనది. తాము తినకపోయినా పిల్లల కడుపు నింపడానికి ఎన్నో ఇబ్బందులు పడే తల్లిందండ్రులు ఎందరో ఉన్నారు. తల్లి నవమాసాలు మోసి కంటే, తండ్రి జీవితాన్ని ఇస్తాడు. తన జీవితం ముగిసేవరకు నేలమీద తిరగాడుతున్న బిడ్డకు ఆకాశమంత గొడుగై ధైర్యాన్ని, భరోసాను ఇస్తూ కాపాడుకుంటాడు. కానీ గుర్తింపు విషయంలో నాన్నలు ఎందుకో వెనకబడుతారు..
భార్య కడుపులో నలుసు పడింది మొదలు బిడ్డకోసం ఆరాటపడే మగాళ్లు తండ్రులయ్యాక తమను తాము కోల్పోతారు. భర్తగా, తండ్రిగా ఆ రెండు పాత్రల్లోనే జీవితాన్ని లాగిస్తారు. భార్య, పిల్లల కోరికల్ని నెరవేర్చడానికి ఎంత కష్టాన్ని అయినా సంతోషంగా అనుభవిస్తారు.
పిల్లల ప్రపంచం..
ప్రతి తండ్రికి తన పిల్లలంటే వల్లమాలిన ప్రేమ. భార్య కంటే కూడా పిల్లల మీద తండ్రికి ప్రేమ ఉంటుంది. ప్రతి తండ్రి మనసులో తన కొడుకు ఓ రాజకుమారుడు, కూతురు ఓ రాజకుమారిలా మెదులుతారు. చిట్టి చిట్టి పాదాలతో తండ్రి గుండెల మీద పిల్లలు తంతున్నా వారికేమీ బాధ ఉండదు. కానీ పిల్లలే పెద్దయ్యాక తండ్రుల నమ్మకం మీద, తండ్రి గుండెల మీదా తన్నేసి పోతుంటారు. పాపం మగాళ్లకు ఏడవడం కూడా ఇబ్బందే.. కానీ తండ్రులు అయితే బిడ్డల్ని తలచుకుని మనసులోనే ఏడుస్తారు.
నాన్నంటే భరోసా..
చిన్నప్పుడు ఎవరైనా కొడితే మా నాన్నకు చెబుతా అని ధైర్యంగా చెప్పుకోవడం నుండి.. పిల్లలు పెరిగి పెద్దయ్యాక నాన్నకు చెప్పి తీరాలా?? అని ఎన్నో వెర్రి పనులు చేసి తీరా సమస్యల్ని నెత్తికి తెచ్చుకున్నాకా అదే నాన్న పంచన చేరి తన బాధను చెప్పుకునే కుర్రాళ్ళలు లెక్కే లేదు ఈకాలంలో.
చందమామ కావాలని మారం చేసిన బాలరాముడికి నీళ్లలో చందమామను చూపించి ఏమార్చిన దశరథుడి లాంటి మనసు ప్రతి తండ్రిలోనూ ఉంటుంది. దశరథుడి వల్ల రాముడికి కీర్తి దక్కిందా?? రాముడి వల్ల దశరథుడి పేరు కీర్తికెక్కిందా అని తరచి చూస్తే.. పితృవాక్య పాలకుడైన రాముడి వలన దశరథుడికి దక్కిన కీర్తి, గౌరవం గొప్పదని చెప్పవచ్చు.
ఓడి గెలిచే నాన్న..
పిల్లల దగ్గర ఓడిపోవడానికి తండ్రి ఏమాత్రం బాధపడడు. తనకు తలకు మించిన పనులలో అయినా ప్రత్యక్షంగా పిల్లల్ని వారించినా, వ్యతిరేకత వెలిబుచ్చినా, చివరికి పిల్లల కోరికను తీర్చడంలో నాన్న ఎప్పుడూ ముందుంటాడు. అందుకే తను ఓడిపోయినా గెలుస్తాడు నాన్న. ప్రతి తండ్రి ఓ నీలాకాశం లాంటి వాడు. ఉరుముతాడు, మెరుస్తాడు, మండుతాడు, రాత్రివేళ నిశ్శబ్దంలో ఒంటరిగా జీవితాన్ని నెమరు వేసుకుంటాడు. ఆ ఆకాశానికి చల్లని వెన్నెల జత చేయాల్సింది పిల్లలే..
◆నిశ్శబ్ద.