జీవితం బాగుండాలంటే..  ఈ 8 రకాల వ్యక్తులను అస్సలు నమ్మకండి.. !

 

“నమ్మకం”  మూడక్షరాల ఈ మాట మన జీవితంలో చాలా విలువైనది. మన జీవితంలో ఏ బంధమైనా నిలబడాలంటే దానికి పునాది నమ్మకమే. మన ఇంట్లోవారయినా, స్నేహితులైనా, బంధువులైనా ఎవరితోనయినా మన ప్రయాణం సాఫీగా సాగాలంటే వారికీ, మనకీ మధ్య నమ్మకమనే గట్టి దారం కలపబడి ఉండాలి.  నమ్మకమనేది  సంపాదించుకోవాలి తప్ప బలవంతం మీద పొందలేము.  మనం జీవితంలో  ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలిసుండటం చాలా ముఖ్యం. అలా సైకాలజీ ప్రకారం మనం నమ్మకూడని 8 రకాల వ్యక్తులున్నారట.  వీరిని అసలు నమ్మకూడదని మానసిక విశ్లేషకులు అంటున్నారు. ఇంతకీ వీళ్ళేవరంటే..

స్వార్థపరులు:

ఈ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ‘నేను, నేను మాత్రమే’ అనే మనస్తత్వం  కలిగి ఉంటారు. వీళ్ళను నార్సిస్టులు అని అంటారు.  ఇతరుల భావాలు, అవసరాలు గురించి వీళ్లకు పట్టదు. వాళ్ళ అహాన్ని సంతృప్తిపరుచుకోవటం కోసం అవతలి వాళ్ళ మీద నింద వేయటానికి కూడా వెనుకాడరు.  

అబద్ధాలు చెప్పేవారు:

అబద్ధాలు చెప్పడం  కొందరికి అలవాటుగా ఉంటుంది. ప్రతివిషయనికి అబద్దం చెప్పి సింపుల్ గా విషయాన్ని దాటవేయడం, తప్పించుకోవడం చేస్తారు. ఇలాంటి వ్యక్తులకు  బంధానికి అవసరమైన నిజాయితీ, సమగ్రతలు ఉండవు.  తమ వ్యక్తిగత లాభాల కోసం ఇతరులని తరచూ తప్పుదోవ పట్టించటానికి అబద్ధాలు చెప్తుంటారు.  వీళ్లకు దూరం ఉంటే మేలు..
 
అధికార ధోరణి:

తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇతరులు చేసే పనులని, నిర్ణయాలని నియంత్రించి వారికి అనుకూలంగా మార్చుకునే  నైపుణ్యం కలిగి ఉంటారు. వీరిని మానిప్యులేటర్లు అని చెప్పవచ్చు. ఇలాంటి మోసపూరిత వ్యక్తులని ఎలాగైనా తప్పించుకోవాలి.

బాధితుల్లా ప్రవర్తించేవారు:

ఎల్లప్పుడూ తమని తాము బాధితులుగా చూపించుకోవాలనుకునే వ్యక్తులు వారివల్ల ఏదైనా తప్పు జరిగినప్పుడు కూడా  వారు చేసిన పనులకి, వారన్న మాటలకి జవాబుదారీతనం తీసుకోరు. ఎప్పుడు సింపతీ పొందడానికి కథలు అల్లేస్తారు..  వీరి స్వార్ధం వల్ల ఇతరులు ఇబ్బందిపడతారు.

అసూయపడేవారు:

ప్రతిదానికీ ఇతరుల్ని చూసి అసూయపడే వ్యక్తులు నమ్మదగినవారు కాదు. వారు ఇతరుల విజయాలకి,  సంతోషానికి మనస్ఫూర్తిగా మద్ధతునివ్వరు, అభినందనలు చెప్పరు. వారిలో ఉన్న అసూయ వల్ల ఇతరులకి హాని కలిగించవచ్చు.

నిబద్ధత లేని వ్యక్తులు:

జీవితంలో ఎలాంటి కట్టుబాట్లు, పద్ధతులు లేకుండా ఉండే వ్యక్తులకి   బంధాల పరంగానైనా, పని విషయంలోనైనా  నిబద్ధత ఉండదు. వీరికి స్థిరత్వం, జవాబుదారీతనం ఉండదు. ఇలాంటి వాళ్ళను నమ్మితే నట్టేట మునిగినట్టే..

సానుభూతి లేని వ్యక్తులు:

సానుభూతి చూపించడం  ఇతరుల కష్టాన్ని, బాధను తగ్గించడంలో సహాయపడుతుంది.  మనం మనుషులమనే సమైక్య భావాన్ని కలిగిస్తుంది. కష్టాలను, బాధలను, ఇబ్బందికర పరిస్థితులలో ఉన్న మనుషులను చూసి కూడా సానుభూతి  చూపలేని వ్యక్తులు చాలా స్వార్ధపరులని అర్థం.  వీరు తమ,పర భేధాలు చూపిస్తారు.

ఆకర్షణ చూపించే వ్యక్తులు:

అధికంగా ఆకర్షించాలని ప్రయత్నించే వ్యక్తులు తరచూ వాస్తవం బయటపడకుండా,  అసలు ఉద్దేశాన్ని లోపల కప్పి ఉంచుతారు. అలాంటి వ్యక్తులు తాము  కోరుకున్నది అవ్వటం కోసం ఇతరులతో మృదువుగా మాట్లాడటం, వారిని మెప్పించే పనులు చేస్తూ ఉంటారు. ఇలాంటి వారిని కూడా నమ్మకూడదు.

                         *రూపశ్రీ.