బాలల వికాసమే మంచి సమాజ నిర్మాణానికి మూలం..!   

 


సమాజమైనా, దేశమైనా, ప్రపంచమైనా అభివృద్ధి చెందాలంటే  పూలమొక్కల్లాంటి పిల్లల్ని మనం చక్కగా కాపాడుతూ, వారిని విలువలవైపు నడిపిస్తూ, వారిలో అవకాశాలన్నీ అందిపుచ్చుకునే సామర్ధ్యం పెంచాలి. అప్పుడే ఈ లోకం అందమైన పూలతోటలా విస్తరిస్తుంది.  ఇదే నిజాన్ని పండిట్ జవహార్లాల్ నెహ్రూ నమ్మి, వారిని దేశ భవిష్యత్తుగా భావించి, వారి వికాసం కోసం కృషి చేశారు. అందుకే ఆయన జన్మదినమైన నవంబర్14 తేదీన, సమాజానికి బాలల ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తూ, వారి మౌలిక హక్కుల రక్షణకు ప్రతిజ్ఞ చేస్తూ జాతీయ బాలల దినోత్సవం జరుపుకుంటున్నాము. 

ఈ రోజు పిల్లల అభిరుచులు, అభివృద్ధి, వారి హక్కులు, అవసరాలను గుర్తు చేసుకోవడం మన బాధ్యత. జవహర్‌లాల్‌ నెహ్రూ దృష్టిలో పిల్లలు దేశ భవిష్యత్తు. అందుకే వారి విద్య, సురక్ష, ఆనందంపై మనం కృషి చేయాలి. ప్రతి చిన్నారి భయపడి కాకుండా తన కలల్ని నిజం చేసుకునే స్వేచ్ఛ కలిగి ఉండాలని ఆయన ఆశించారు. చిన్నారుల జీవితాలు ఆనందమయం కావడం మనందరి బాధ్యత. ఈ రోజు మన చిన్నారులకు ప్రేమ, అవగాహన, స్నేహం చూపించి వారి అభివృద్ధి కోసం కృషి చేయాలి. అలాగే సమాజంలో పిల్లలు ఎదుర్కునే సమస్యల గురించి కూడా అర్థం చేసుకోవాలి. 

చిన్నారులు ఎదుర్కొనే సవాళ్ళు..

బాలల దినోత్సవం పిల్లలు ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొనే సవాళ్లను కూడా ముందుకు తీసుకువస్తుంది, వీటిలో పేదరికం, విద్య, ఆరోగ్య సంరక్షణ కొరత, శిశు కార్మికత్వం వంటి సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా  తక్కువ ఆదాయ కుటుంబాల పిల్లలు, పాఠశాలకు వెళ్లాల్సింది పోయి చిన్న వయసులోనే పని చేయాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. బాలల దినోత్సవం  ఈ సవాళ్లను పరిష్కరించేందుకు అవగాహన పెంపొందించడమే కాకుండా, పిల్లల భవిష్యత్తును మెరుగుపరచడం కోసం అందరూ కలసి చేపట్టవలసిన చర్యలను ప్రోత్సహిస్తాయి.

బాలల ప్రాథమిక హక్కులు..

బాలల  దినోత్సవంలో  ప్రధానంగా  ఉన్నది  విద్యకున్న  ప్రాముఖ్యత  తెలియచేయటం.  పేదరికం  నుంచి బయటపడేందుకు, పిల్లలకు మంచి విద్య అందించడమే కీలకమైన మార్గం. పిల్లల నేపథ్యమేదైనా సరే, వారికి విద్య అనేది మౌలిక హక్కుగా పరిగణించబడుతోంది. పాఠశాలలు, చాలా సంస్థలు విద్యను సరదాగా నేర్చుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలను నిర్వహిస్తాయి.

విద్యతో పాటు, ఆట కూడా పిల్లల అభివృద్ధిలో విలువైన పాత్ర పోషిస్తుంది. వినోదాత్మక కార్యక్రమాలు, ఆటలు, సాంస్కృతిక ప్రదర్శనలు పిల్లల సృజనాత్మకతను, సామాజిక నైపుణ్యాలను వెలుగులోకి తెస్తాయి. ఈ సంఘటనలు పిల్లలకు  అభివృద్ధి అనుభవాన్ని కలిగిస్తాయి.

పిల్లల ప్రతిభ..

బాలల   దినోత్సవం   పిల్లల  ప్రతిభను గుర్తించి  ప్రశంసించే గొప్ప అవకాశం. పాఠశాలలు, వివిధ సంస్థలు తరచుగా టాలెంట్ షో,  కళా ప్రదర్శనలు  వంటి   కార్యక్రమాలను   నిర్వహిస్తాయి. ఈ   గుర్తింపు   పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచి, తమ అభిరుచులు, ఆసక్తులను  అనుసరించేలా  ప్రోత్సహిస్తుంది.

డిజిటల్ భూతంతోజాగ్రత్త..

ప్రస్తుతం డిజిటల్ యుగంలో పిల్లలు ఆన్‌లైన్ భద్రత కలిగి ఉండాలని నేటి బాలల దినోత్సవం నొక్కి వక్కాణిస్తోంది.  పిల్లలు ఎక్కువగా డిజిటల్  ప్లాట్‌ఫారమ్‌లతో  గడుపుతున్నారు.  స్మార్ట్ ఫోన్, టాబ్లెట్, సిస్టమ్ వంటివి పిల్లలకు ఆటవస్తువులు అయిపోయాయి. అయితే వీటి వల్ల  కలిగే ప్రమాదాలు, ప్రయోజనాలపై వారికి అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యం. 

చివరిగా పెద్దలుగా మనం చేయాల్సిన పనేంటంటే, పిల్లల అభిరుచులు, ఆసక్తులు,  వారి భవిష్యత్తు నిర్మాణం మన కర్తవ్యంగా భావించి, ఆ దిశగా అడుగులు వేయాలి. అప్పుడే దేశం ప్రగతిపథంవైపు వెళ్తుంది.


                             *రూపశ్రీ