జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తే జీవితం నాశనమే..!
posted on Nov 12, 2024 9:30AM
మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించే వ్యక్తుల్లో సాధారణంగా తల్లిదండ్రులు ఉంటారు. తర్వాత జీవిత భాగస్వామి కూడా అంతే ప్రభావం చూపిస్తారు., వాస్తవానికి ఇంకా ఎక్కువనే చెప్పాలి. మూడొంతుల మీ జీవితం ఎలా ఉండబోతుందనేది జీవిత భాగస్వామి మీదనే ఆధారపడి ఉంటుంది. మీ తల్లిదండ్రులు ఎవరనేది నిర్ణయించుకునే అవకాశం మీకుండదు, కానీ మీ జీవిత భాగస్వామి ఎవరనే నిర్ణయం తీసుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ నిర్ణయం జీవితంలో ఎవరికయినా చాలా ముఖ్యమైనదే అవుతుంది. అందులో ఏమాత్రం పొరపాటు జరిగినా జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అందుకే బాగా ఆలోచించి మరీ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది తమ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు కొన్ని తప్పులు చేసి, తర్వాత జీవితాంతం బాధపడుతుంటారు. జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో పొరపాటున కూడా చేయకూడని కొన్ని తప్పులేంటంటే
కుటుంబ సభ్యుల ఒత్తిడి..
సాధారణంగా పెద్దవాళ్ళు జీవితాంతం తోడుండే మన భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో సహాయపడతారు. కానీ ఒక్కోసారి ఆ పెద్దవాళ్ళ ఒత్తిడివలనే ఒక అమ్మాయైనా లేక అబ్బాయైనా తమకి ఇష్టంలేని వ్యక్తిని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. తర్వాత జీవితాంతం ఇబ్బందిపడుతూ ఉంటారు.
తొందరపడి నిర్ణయం తీసుకోవటం..
ఏ మనిషి గురించైనా అర్ధం కావాలంటే సమయం పడుతుంది. ఎందుకంటే ఒక్కసారి కలిసి మాట్లాడినంత మాత్రాన ఎవరి గురించి ఎవరికీ పూర్తిగా అర్ధం కాదు. కాబట్టి సమయం తీసుకుని ఆ వ్యక్తి మనకి సరిపోతారా? లేదా? అని నిర్ణయించుకోవాలి తప్ప తొందరపడకూడదు.
వేర్వేరు సంస్కృతులు కావటం..
వివాహం చేసుకునే అమ్మాయి, అబ్బాయిల సంస్కృతుల మధ్య పూర్తి బేధం ఉంటే, వారి వివాహం అయ్యాక చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే సంస్కృతి కేవలం వ్యక్తులతో కాకుండా సమాజంతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఆ సమాజంవలనే ఇరువురూ కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దాని ప్రభావం వివాహ బంధం మీద కూడా పడుతుంది. ముఖ్యంగా ప్రేమ వివాహాలలో ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి.
భౌతిక ఆకర్షణ లేకపోవటం..
ఈ సృష్టి గమనానికి ఆడ, మగ మధ్య ఆకర్షణ ఎంత ముఖ్యమో, వివాహ బంధం మరింత బలపడి ముందుకి వెళ్ళటానికి కూడా భౌతిక ఆకర్షణ ఉండటం కూడా చాలా ముఖ్యం. భార్యాభర్తలిద్దరికీ ఒకరి పట్ల ఒకరికి భౌతిక ఆకర్షణ లేకపోతే ఆ ఆకర్షణ వేరేవైపుకి మళ్లి, జీవితాలు నాశనమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కేవలం ఆర్థిక అవసరాల కోసం, పనులు చేసిపెట్టే మనిషి కావాలనే ఉద్దేశంతో పెళ్ళిళ్ళు చేసుకునే వారి జీవితంలో ఇలాంటివి కనిపిస్తాయి.
నమ్మకం లేకపోవటం..
సమాజంలో ఏ ఇద్దరి వ్యక్తుల మధ్య బంధం నిలబడాలన్నా నమ్మకం ఉండాలి. అదే భార్యాభర్తల మధ్యైతే ఈ నమ్మకం ఇంకాస్త ఎక్కువే ఉండాలి. జీవిత భాగస్వామి మీద నమ్మకం లేకపోతే ఆ వివాహబంధంలో ఎవరూ, ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. ఒకరంటే ఒకరికి నమ్మకం ఉండకపోతే ఆ వివాహ బంధం ఎక్కువ కాలం నిలబడదు.
*రూపశ్రీ