మానవత్వం నిలబడాలంటే.. దయ చూపించడానికి మించిన గొప్ప మార్గం ఉందా?

 

 ఈ సమాజం ప్రశాతంగా ఉండాలంటే ప్రతి మనిషికి కొన్ని గుణాలు అవసరం అవుతాయి. అలాంటి వాటిలో ప్రేమ, క్షమ, దయ, జాలి అనేవి చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ కలిగి ఉన్నవారినే మానవత్వం కలిగిన మనుషులు అని కూడా అంటారు.  సమాజంలోని ప్రతి వ్యక్తిలో  దయ, మంచితనాన్ని ప్రోత్సహించడానికి, ఇతరుల పట్ల సానుభూతిని పెంపొందించడానికి, తద్వారా సమాజంలో మంచి  మార్పును తీసుకురావటానికి ఒక ప్రత్యేక రోజును కేటాయించారు.  నవంబర్ 13వ తేదీన వరల్డ్ కైండ్నెస్ డే గా జరుపుకుంటారు.


దయ అనే గుణం ప్రతి మనిషిలో ఉన్న ప్రత్యేకమైన  లక్షణం. ఈ గుణం మనలో అభివృద్ధి చెందినంతగా  ఏ జీవిలోనూ వృద్ధి చెందకపోవచ్చు.  అందుకే ఇది మనల్ని  భూమి మీద ఉన్న ఇతర జీవులలో ప్రత్యేకంగా నిలుపుతుంది. ఆ సమాజంలో అనుకరణ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది.  పిల్లలు తల్లిదండ్రులను చూసి కొన్ని ఎలాగైతే అనుకరిస్తారో.. సమాజంలో కొందరి ప్రవర్తన చూసి మరికొందరు కూడా అనుకరిస్తారు.  ఈ విధంగా ఒకరి నుండి మరొకరికి వ్యాపించే గుణాలలో దయ గుణం కూడా ఉండాలన్నది వరల్ట్ కైండ్నెస్ డే ముఖ్య ఉద్దేశం.   దీని ఫలితంగా ప్రజల మధ్య ప్రేమ, అనురాగం పెరుగుతాయి.  ఇతరుల పట్ల దయతో ఉండమని పిల్లలకి చిన్నప్పటినుంచే చెప్తూ ఉంటే, వారిలో ఇది బలంగా మారి మంచి సమాజ నిర్మాణానికి పునాది అవుతుంది.


ఒక వైద్యుడు తన రోగుల పట్ల, ఒక అధికారి తన సిబ్బంది పట్ల, ఒక కుటుంబ పెద్ద తనపై ఆధారపడి ఉన్నవారి పట్ల  దయ చూపకపోతే పరిస్థితులు ఎలా  ఉంటాయో ఒక సారి ఊహిస్తే జీవితంలో ఇలాంటి పరిస్థితులు వద్దే వద్దు అనే భావన కలుగుతుంది. మనిషికి మరొక మనిషి మీద ఈ జీవకోటి మీద  దయ లేకపోవడం వల్ల కుటుంబం, వ్యవస్థ, సమాజం మీద చాలా చెడు ప్రభావం పడుతుంది. అదే మన చుట్టూ ఉన్నవారిపై దయతో ఉండటం, ఇతరుల పట్ల నిస్వార్థంగా దయను చూపించడం వల్ల సమాజంలో సామరస్యం పెరుగుతుంది.


చిన్న సాయం కూడా ఒక పెద్ద మార్పును తీసుకురావచ్చు. ఉదాహరణకు ఒక చిన్న  చిరునవ్వు కూడా ఎదుటి  వ్యక్తికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా వారికి కాస్త ధైర్యం పోగవుతుంది.  ఒకరు సహాయం చేసినప్పుడు, ఇతరులు సైతం దానిని ప్రేరణగా తీసుకుని మరిన్ని మంచిపనులు చేయాలని కోరుకుంటారు.
ఈ దయాగుణం పెరగటం వల్ల మనుషులు కుల, మత, ప్రాంత, లింగ భేధాలతో ఒకరికొకరు వేరుపడకుండా..   వారిలో ‘నేను’, ‘మేము’ అనే భావాలు తొలగి, ‘మనం’ అనే విశాల భావం కలుగుతుంది. అప్పుడు ఈ  సమాజంలో అందరూ ఒకరికొకరు సాయంగా ఉంటూ  కష్టాల్లో ఒకరికొకరు తోడుగా నిలుస్తూ, ఈ భూమి మీద మనకెంత హక్కు ఉందో, మిగతా ప్రాణులకీ అంతే ఉందని గుర్తించి గౌరవిస్తారు. దాంతో  ఈ    ప్రపంచం మరింత అందంగా మారుతుంది.


ఏ పరిస్థితుల్లోనైనా దయ చూపించడానికి మించిన  గొప్ప మార్గం మరొకటి లేదని మర్చిపోకూడదు. చేసే సాయం  చిన్నదైనా , పెద్దదైనా దాని ప్రభావం కచ్చితంగా సమాజం మీద పడుతుంది. ప్రేమ, సహనం, సోదరభావం, పరస్పర గౌరవం, సహకారంతో కూడిన సౌమ్య వాతావరణాన్ని కల్పించడానికి మన రోజువారీ జీవితంలో ఇతరుల పట్ల, ఇబ్బందులలో ఉన్నవారి పట్ల,  జీవకోటి పట్ల దయ చూపించడాన్ని భాగం చేసుకోవాలి.  ఈ ప్రపంచంలో కూడా  బ్రతకడానికి పోరాటం చేస్తూ సహాయం కోసం ఆశతో ఎదురు చూస్తున్న వారు కోట్లాది మంది ఉన్నారు.  ఇలాంటి వారికి ఎల్లప్పుడూ ఓ అపన్న హస్తం కావాలి.  కేవలం దయా గుణం ఉన్నప్పుడే అపన్న హస్తం అందివ్వడం సాధ్యం అవుతుంది.  అందుకే  తల్లిదండ్రులు,  ఉపాధ్యాయులు,  ఇరుగు పొరుగు,   ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ తాము దయా గుణాన్ని పలు సందర్భాలలో వ్యక్తం చేస్తూ పిల్లలకు కూడా దీన్ని అలవాటు చెయ్యాలి. అప్పుడే ఈ ప్రపంచం మానవత్వం కలిగిన మనుషులతో బలపడుతుంది.

                           *రూపశ్రీ.