కారు జోరందుకుంటుందా? సంకేతమిదేనా?

గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత బీఆర్ఎస్ లో ఒక విధమైన స్తబ్దత నెలకొంది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావులు గళమెత్తుతున్నా, ఆందోళనలకు పిలుపు నిస్తున్నా ఎక్కడా పార్టీ క్యాడర్ లో ఉత్సాహం కనిపించడం లేదు. అందుకు ప్రధాన కారణం ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పొలిటికల్ గా యాక్టివ్ గా లేకపోవడమే. అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత, లోక్ సభ ఎన్నికల సమయంలో ఆయన ప్రచారం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.

లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ కనీసం ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేక జీరో రిజల్ట్ తో సరిపెట్టుకుంది. ఇక ఆ తరువాత నుంచీ కేసీఆర్ పూర్తిగా మౌనమునిలా మారిపోయారు. పూర్తిగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులలో ఉత్సాహం కొరవడింది. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలపై కూడా బీఆర్ఎస్ ఆశలు వదిలేసుకున్నట్లు పరిశీలకులు సైతం విశ్లేషణలు చేశారు. అయితే కేసీఆర్ వచ్చే ఏడాది జనవరి నుంచి మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అవుతారని కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో కొలువుదీరిన రేవంత్ సర్కార్ కు ఏడాది సమయం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ మౌనం వహించారనీ, ఇక రేవంత్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలపై కేసీఆర్ గళమెత్తుతారని కేటీఆర్ చెప్పారు. అయితే ప్రజలే కాదు, పార్టీ శ్రేణులు కూడా కేటీఆర్ మాటలను పెద్దగా పట్టించుకోలేదు.

సరిగ్గా ఈ సమయంలోనే కేసీఆర్ తాను మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ రోల్ ప్లే చేస్తానని సంకేతాలు ఇచ్చారు. ఇటీవల ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో స్వయంగా కారు నడిపారు. దీని ద్వారా ఆయన మళ్లీ పార్టీలో క్రియాశీలంగా వ్యవహరించనునన్నట్లు చాటారు. బీఆర్ఎస్ పార్టీ చిహ్నమైన కారు షెడ్డుకి వెళ్లలేదనీ, సర్వీసింగ్ చేయించుకుని జోరుగా తెలంగాణ రాజకీయాలలో పరుగులు పెట్టేందుకు రెడీ అయ్యిందన్న సంకేతాలను పార్టీ శ్రేణులకు ఇచ్చారు.