మరీ ఇంత ఓవర్ కాన్ఫిడెన్సా.. ఇలా అయితే కష్టమే!
posted on Nov 28, 2024 11:44AM
రాష్ట్రంలో బీజేపీ వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్‌తో విసిగిపోయారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఎదుర్కొన్న ఇబ్బందులు, కష్టాల చేదు జ్ణాపకాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ప్రజలు బీజేపీవైపు ఎంతో ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారు.. తెలంగాణలో రాబోయేది బీజేపీ పాలనే. ఇది ప్రజల అభిప్రాయం ఔనా కాదా అన్నది పక్కన పెడితే.. ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా పేర్కొన్న మాట మాత్రం నిజం. ఆయన తెలంగాణలో బీజేపీ వేగంగా విస్తరిస్తోందంటూ సామాజిక మాధ్యమంలో పోస్టు చేయడానికి ముందు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. అర్ధగంట పాటు జరిగిన ఈ భేటీలో, తెలంగాణలో అధికారంలోకి వచ్చేది మనమే అంటూ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రధాని వద్ద పదేపదే ప్రస్తావించారు. దీంతో ప్రధాని సైతం ఇంకేముంది అందరూ కలిసికట్టుగా పార్టీ బలోపేతంకు కృషి చేస్తున్నారన్న నిర్ణయానికి వచ్చేశారు. తనను కలిసిన తెలంగాణ నేతలను శభాష్ అంటూ భుజం తట్టి అభినందించారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఆయనలో ఓ ధీమా ఏర్పడిపోయింది. దాని ఫలితమే సోషల్ మీడియాలో ఆ పోస్టు.
అయితే వాస్తవంగా రాష్ట్ర బీజేపీలో మాత్రం పరిస్థితి ఆల్ ఈజ్ వెల్ అన్నట్లుగా ఎవ్రీ ధింగ్ ఈజ్ నాట్ వెల్ అన్నట్లుగా ఉంది. రాష్ట్ర పార్టీలోని వర్గవిబేధాలు ఆ పార్టీకి శాపంగా మారుతున్నాయి. ఎవరికి వారు పార్టీ అధినేతలం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఎంపీలుగా విజయం సాధించిన వారిలో కొందరు అధిష్టానం నిర్ణయానికి విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. ఆ విషయాన్ని పార్టీ శ్రేణులే బాహాటంగా చెబుతున్నాయి. కొందరు ఎంపీలు కేవలం మీడియాలో హైలెట్ కావడానికే ప్రాధాన్యతనిస్తున్నారు తప్ప క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టిసారించడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి.
తెలంగాణలో బీజేపీ బలోపేతం అవుతోందని ఆ పార్టీ నేతలు ఎంత గట్టిగా చెప్పుకుంటున్నా, వర్గ పోరు కారణంగా రాష్ట్రంలో బీజేపీ పురోగతి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగానే తయారైంది. నేతల మధ్య వర్గవిబేధాల నేపథ్యంలో అధిష్ఠానం రాష్ట్రంలో పార్టీ పటిష్ఠత అనే విషయాన్నే గాలికి వదిలేసినట్లు కనిపిస్తోంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయం వరకు బీజేపీ నేతల మధ్య ఐక్యతారాగం కనిపించింది. బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ నేతలు ఆత్మ విశ్వాసంతో ఉన్నారు. అయితే ఎన్నికల సమయంలో బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంలో పార్టీ పరిస్థితి మూడోస్థానానికి పడిపోయింది. కాదు కాదు దిగజారిపోయింది. అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు అప్పటి వరకూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను తప్పించడంతో పార్టీ శ్రేణులు డీలా పడ్డాయి. మరోవైపు ఎన్నికల్లో తెలుగుదేశంతో కలిసి పోటీచేసే విషయంలో రాష్ట్ర పార్టీ నేతలు కొందరు వ్యతిరేకించారు. అయితే ఎన్నికల తరువాత తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోకపోవడం తప్పని రుజువైంది. అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఒకింత మెరుగైన ఫలితాలు సాధించినప్పటికీ.. ఆ ఘనత పూర్తిగా మోడీ ఖాతాలో పడింది. ఆ విజయంలో పార్టీ రాష్ట్రనాయకత్వం ఘనత ఏమీ లేదని పరిశీలకులు విశ్లేషించారు.
పార్లమెంట్ ఎన్నికల తరువాత రాష్ట్ర బీజేపీలో నేతల మధ్య వర్గవిబేధాలు తీవ్రరూపం దాల్చాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొందరు బీజేపీ నేతలు వ్యతిరేకించగా.. మరికొందరు ప్రశంసించారు. దీంతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను విమర్శించాలా.. ప్రశంసించాలా అనే అంశంపై పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన విషయంలో బీజేపీ రాష్ట్ర నేతలు రెండు వర్గాలు విడిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు, అనుకూలంగా కొందరు మాట్లాడుతూ వచ్చారు. తాజాగా, రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నేతలు రాత్రి నిద్ర కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం సైతం పార్టీకి ఆశించిన మైలేజ్ ను ఇవ్వలేదు. మరోవైపు రైతు రుణమాఫీ విషయంలోనూ ప్రభుత్వంపై గట్టిగా పోరాడటంలో బీజేపీ నేతలు విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. రైతుల పక్షాన నిలబడి పోరాడుతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంపై బీజేపీ రాష్ట్రనాయకత్వం ఏమాత్రం దృష్టిసారించలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో బీజేపీ బలహీనంగా ఉంది. రైతు రుణమాఫీ అమలు విషయంలో ప్రభుత్వంపై రైతుల్లో నెలకొన్న వ్యతిరేకతను సద్వినియోగం చేసుకొనేందుకు బీజేపీ నేతలు ఏమాత్రం ప్రయత్నించక పోవటం పట్ల ఆ పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. అయితే డిసెంబర్ నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు బీజేపీ నేతలు కార్యాచరణ రూపొందించారు. ఈ కార్యక్రమాన్ని అయినా సమర్ధవంతంగా నిర్వహిస్తే కాస్తయిన ప్రజాదరణ లభించే అవకాశం ఉంటుంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్పుచేసే యోచనలో కేంద్ర పార్టీ అధిష్టానం నిమగ్నమైంది. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రిగానూ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియమించడంపై అధిష్టానం దృష్టిసారించింది. ఈ క్రమంలో పలువురు నేతలు అధ్యక్ష స్థానం కోసం పోటీపడుతున్నారు. అయితే అందరికీ ఆమోదయోగ్యమైన నేతను ఎంపిక చేయడంలో పార్టీ పెద్దలు విఫలమవుతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఈటల రాజేందర్ ఉన్నా.. ఆయనకు ఆ పదవి వచ్చే అవకాశం లేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈటల రాజేందర్ కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించడాన్ని బీజేపీలోని ఓ వర్గం నేతలతోపాటు. బీజేపీలోని కోర్ హిందూ వాదులు, ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. మొదటి నుంచి బీజేపీలో ఉంటూ.. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల్లో పనిచేసిన నేతకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలని పార్టీలోని మెజార్టీ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే మొత్తానికి రాష్ట్ర అధ్యక్ష పదవిని దక్కించుకునే క్రమంలో నేతలు వర్గాల వారిగా విడిపోవడంతో.. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తీవ్ర స్థాయికి చేరాయని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర బీజేపీలో ఇన్ని సమస్యలతో సతమతమౌతున్నా, వాటి పరిష్కారంపై దృష్టి పెట్టడం మానేసి రాబోయే కాలంలో తెలంగాణలో బీజేపీ అధికారం అని బీజేపీ ప్రతినిధులతోపాటు ప్రధాని నరేంద్ర మోదీసైతం పేర్కొనడం ఆత్మ విశ్వాసం కాదనీ, అతి విశ్వాసమనీ పార్టీ శ్రేణులు అంటున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ అధికారంలోకి వచ్చేంత స్థాయిలో బలపడాలంటే ముందు పార్టీలో నెలకొన్న వర్గ విబేధాలకు స్వస్తి చెప్పాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అది మానేసి మాదే అధికారం అన్న అతిశయంతో, అతి విశ్వాసంతో వ్యవహరిస్తే అధికారం మాట అటుంచి, రాష్ట్రంలో పార్టీ ఉనికి కూడా కష్టమేనని చెబుతున్నారు.