కష్టనష్టాలు చూసి దిగులుపడుతున్నారా?

జీవితం అనేది సుఖదుఃఖాల కలయిక. మనం సుఖాన్ని ఎలా అనుభవిస్తామో, దుఃఖాన్ని కూడా సహించగలిగి ఉండాలి. జీవితాన్ని అన్ని కోణాలలో పరిశీలిస్తే జీవన సంబంధాల విలువ, ప్రాముఖ్యత మనకు అర్ధమవుతుంది. కానీ ఈ విషయం అర్ధం చేసుకోకుండా చాలామంది సంతోషాలు, సుఖాలు మాత్రమే కావాలని అనుకుంటారు. అది చాలా పొరపాటు అనే విషయం అందరూ అర్థం చేసుకోవాలి. 

మనిషి జీవితంలో కష్టాలు, సుఖాలు అనేవి చీకటి వెలుగులులాంటివి. చీకటి తరువాత వెలుగు, వెలుగు తరువాత చీకటి ఇలా ఒకదాని తరువాత ఒకటి ఎలాగ వస్తూ పోతూ ఉంటాయో అలాగే మనిషి జీవితంలో కష్టాలు, సుఖాలు అనేవి కూడా ఒకదాని తరువాత ఒకటి వస్తూపోతూ ఉంటాయి. వాటి గురించి మనం ఆలోచించ కూడదు. కష్టం వచ్చినప్పుడు బాధపడి, సుఖం వచ్చినప్పుడు ఆనందించకూడదు. కష్టసుఖాలను సమానంగా అనుభవించే గుణాన్ని కలిగి ఉండాలి. ఇలా కష్టసుఖాలను సమానంగా చూసే స్వభావం ఉన్నవారు అన్ని పరిస్థితులను తట్టుకుని నిలబడగలరు. 

ముఖ్యంగా ఓటమికి వెనకడుగు వేయడం, కష్టాలు వచ్చినప్పుడు భయపడటం వంటి స్వభావం తగ్గిపోతుంది. రెండింటిని సమానంగా చూడటం నేర్చుకుంటే. అప్పుడే మనిషి తన జీవితంలో ఎదగగలడు. ప్రస్తుత సమాజంలో అందరూ కూడా అశాశ్వతమైన విషయాలపై మోజు పెంచుకొని జీవన సమరంలో అలసిపోతున్నారు. నిరంతరం అశాంతి, ఆందోళనలు, అలజడుల మధ్య మనిషి జీవితం కొనసాగుతుంది.

మనిషికి జీవితంలో ఏదీ శాశ్వతం కాదు అయినా సరే వాటికోసమే పోరాటం సాగించి జీవితంలో ఆనందాన్ని కోల్పోతున్నాడు. జీవితంలో పోరాటం అనేది ఉండాలి. ఎందుకంటే జీవితమంటేనే పోరాటం, పోరాటంలోనే ఉంటుంది జయం అన్నారు. అంతేకానీ జీవితాన్నే పోరాటంగా చేసుకోకూడదు. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో సంఘటనలు, జ్ఞాపకాలు, అనుభూతులు, సామాజిక బంధాలు జీవితంలో పెనవేసుకు పోతాయి. విజయవంతమైన, ఫలప్రదమైన జీవితం గడపటానికి ఈ బంధాలు, వాటి మధ్య పటిష్టత చాలా అవసరం. ప్రస్తుత సమాజంలో జీవితం వేగవంతం కావటం,  తీరికలేని పరిస్థితి, పట్టణాలలో స్థిరపడటం, ప్రవాస జీవితం మొదలైన కారణాల వల్ల మనుషుల మధ్య బంధాలు బలహీనంగా ఉన్నాయని చెప్పవచ్చు. 

పూర్వకాలంలో పండుగలు, పుణ్యకార్యక్రమాలకు కుటుంబ సభ్యులు అందరూ సమావేశమయ్యేవారు. కష్టసుఖాల గురించి చర్చించుకొనేవారు. ఇలాంటి పరిస్థితులు ప్రస్తుత కాలంలో తగ్గిపోతున్నాయి. ఫోనులలో పలకరించటం, తమకు తీరికలేదని చెప్పటం ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ రకంగా అనుబంధాలలో స్వచ్ఛత లోపించటం కనిపిస్తుంది.

జీవితం అనేది చాలా విలువైనది. మన విలువైన జీవితాన్ని అంతం చేసుకోవటం అనేది సమర్ధనీయం కాదు. ఎందుకంటే చాలామంది యువకులు, గృహస్తులు తాత్కాలిక భావోద్వేగాలకు లోనయి జీవితాన్ని అంతం చేసుకుంటున్నారు. ఇది సమంజసం కాదు. జీవితం విలువ తెలుసుకున్నవారు మాత్రమే జీవితాన్ని అర్ధం చేసుకుంటారు. ఆర్ధిక బాధలు, ప్రేమ విషయాలలో విఫలం కావటం, అవమానం, మానసిక ఒత్తిడి, తీవ్ర అనారోగ్యం, అనుకున్నవి జరగలేదనే తీవ్ర ఆవేదన, డిప్రెషన్లతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇది ఇటీవల కాలంలో ఎక్కువ అయింది. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే జీవితానుభవం ఉన్నవారు ఇతరులకు మార్గదర్శకులుగా ఉండాలి.

                                        ◆నిశ్శబ్ద.