బీజేపీకి ఢిల్లీ తెలుగు ఓటర్ల చావుదెబ్బ

 

ఢిల్లీలో ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టారు. కేంద్రంలో అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీని చావుదెబ్బ కొట్టారు. ఒక్క బీజేపీని మాత్రమే కాదు.. కాంగ్రెస్ పార్టీ కూడా అడ్రస్ లేకుండా పోయింది కదా అనే సందేహం రావొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ చచ్చిపోయి, సమాధిలో వున్న పార్టీ. ఆ పార్టీని చావుదెబ్బ కొట్టాల్సిన అవసరం లేదు. ఓటర్లు ఇప్పుడు చావుదెబ్బ కొట్టింది కేవలం భారతీయ జనతా పార్టీనే. ఢిల్లీలోని ఇతర ఓటర్లతోపాటు తెలుగు ఓటర్లు కూడా భారతీయ జనతా పార్టీ మీద తమకున్న కసిని ఈ ఎన్నికలలో తీర్చుకున్నట్టు తెలుస్తోంది. ‘తెలుగువన్’ ఢిల్లీ బ్యూరో అందించిన సమాచారం ప్రకారం, ఢిల్లీలోని తెలుగువారు ఆమ్ ఆద్మీ పార్టీకే ఓటు వేశారు. అటూ ఇటూ ఎటూ చూడకుండా చీపురు గుర్తు మీద ఓటేశారు. ఢిల్లీలో బీజేపీని దెబ్బతీయాలన్న ఉద్యమం సోషల్ మీడియాలో వ్యాపించింది. ఢిల్లీలో నివసించే చాలామంది తెలుగువారు తాము ఈసారి బీజేపీని చావుదెబ్బ తీయడానికే నిర్ణయించుకున్నామని సోషల్ మీడియాలో స్పష్టంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో వున్న తెలుగువారు ఢిల్లీలో నివసించే బంధుమిత్రులకు ఫోన్లు చేసి మరీ బీజేపీకి ఓటు వేయొద్దని చెప్పారంటే ఆంధ్రప్రదేశ్‌లో, తెలుగువారిలో బీజేపీ మీద ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడ్డగోలు విభజనకు గురి కావడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ. బీజేపీ కూడా విభజనకు తనవంతు ఆజ్యం పోసింది. అయితే పార్లమెంటులో విభజన బిల్లు ఆమోదం పొందిన సమయంలో వెంకయ్య నాయుడు ఒక్కరే ఏదో కాస్తంత కష్టపడ్డారన్న సానుభూతితోపాటు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గౌరవించే తెలుగుదేశం పార్టీతో స్నేహం చేస్తున్నారు కదా అన్న సాఫ్ట్ కార్నర్‌తో ఏపీ ప్రజలు బీజేపీని కొన్ని స్థానాల్లో ఆదరించారు. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ మీద తమ మనసులో వున్న కసిని, ప్రతీకారాన్ని తీర్చుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్న విషయాన్ని తమ తీర్పుతో స్పష్టం చేశారు. ఇప్పుడు ఢిల్లీలో బీజేపీని ఓడించే విషయంలో కూడా తెలుగువారు అదే తరహా ప్రతీకారాన్ని ప్రదర్శించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 

ఢిల్లీలోని తెలుగువారు బీజేపీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి గల కారణాలను పరిశీలిస్తే, అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి చేస్తున్న అన్యాయమే కారణమని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలోగానీ, అవసరమైన నిధులు అందించే విషయంలో గానీ, విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందాల్సిన హక్కుల విషయంలోగానీ, నిధులు, నీళ్ళ విషయంలోగానీ కేంద్ర ప్రభుత్వం పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఈ ఆగ్రహమే ఢిల్లీలో వున్న తెలుగువారికీ సరఫరా అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి ఇప్పుడిప్పుడే వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది. ఆ వ్యతిరేకతే ఇప్పుడు ఢిల్లీలో ప్రతిఫలించింది. ఈ నేపథ్యంలో బీజేపీ తనకు జనంలో పెరుగుతున్న వ్యతిరేకతను అర్థం చేసుకోవాల్సిన అవసరం వుంది. ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీ తన వ్యవహార శైలిని మార్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. తెలుగు ప్రజల గుండెలు మండిపోయేలా చేసిన కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పరిస్థితి వచ్చిందో అలాంటి పరిస్థితే బీజేపీకీ రాకుండా వుండేలా బీజేపీ జాగ్రత్తపడాలి. తెలుగువారికి ఇచ్చిన హామీలను నెరవేర్చే బాటలో నడిచి తన పొరపాటును దిద్దుకునే ప్రయత్నం చేయాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu