జగన్ భజన ఏడిసినట్టుంది...
posted on Feb 11, 2015 4:31PM

వైసీపీ అధినేత జగన్ మొన్నామధ్య ఎలక్షన్స్ జరిగినప్పటి నుంచి ఒక ఆన్‌లైన్ టీమ్‌ని సెట్ చేశాడు. ఆ టీమ్ పనులు ఏమిటంటే, ప్రతిరోజూ సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడిని తిట్టడం, జగన్ భజన చేయడం. ఏ అవకాశం దొరికినా ఈ రెండు పనులు ఆ టీమ్ తప్పకుండా చేస్తూ వుంటుంది. ఒకవేళ అవకాశం దొరక్కపోయినా సరే అవకాశం దొరకపుచ్చుకుని మరీ చంద్రబాబు మీద నింద, జగన్ భజన చేస్తూ వుంటుంది. పాపం ఆ భజన బృందం జగన్‌కి ఎంత భజన చేసినా ఎలక్షన్లో వర్కవుట్ కాలేదు. సార్ ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. అయినప్పటికీ జగన్ ఆన్‌లైన్ భజన బృందం తన వర్క్‌లో బిజీగా వుంది. ఇప్పుడు జగన్ భజన చేయడానికి దొరికిన ఒక అవకాశాన్ని ఈ బృందం అందిపుచ్చుకుంది. ఆ అవకాశం... ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాలు సాధించి ఘన విజయం సాధించడం. ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాలు సాధించగానే జగన్ భజన బృందం మైండ్స్‌లో ఒక ఫ్లాష్ వెలిగింది. వెంటనే దాన్ని అమల్లో పెట్టేశారు. అదేంటంటే, మొన్నటి ఎన్నికలలో జగన్‌కి 67 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్‌కీ ఢిల్లీలో 67 స్థానాలు వచ్చాయి. ఆయన, ఈయనా ఇద్దరూ గొప్ప నాయకులేనని వాళ్ళు ప్రచారం మొదలెట్టేశారు. అరవింద్ కేజ్రీవాల్ చేతులు కట్టుకుని నిల్చున్న ఫొటోని, జగన్ చేతులు కట్టుకుని నిల్చున్న ఫొటోని పక్కపక్కనే పెట్టి డిజైన్ తయారు చేశారు. ఇద్దరూ 67 స్థానాలు గెలిచారని పేర్కొన్నారు. కాకపోతే కేజ్రీవాల్ ఎన్నికలలో గెలిచారట. జగన్ మాత్రం ‘నైతికంగా’ గెలిచాడట. ఈ డిజైన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కనిపిస్తోంది. పాపం జగన్‌కి కేజ్రీవాల్‌తో పోల్చుకుని ఆత్మానందం పొందడం మాత్రమే మిగిలింది.