బీజేపీ బుద్ధి తెచ్చుకోవాల్సిన ఓటమి....
posted on Feb 10, 2015 12:49PM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దేశంలో అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీ ఘోరంగా ఓడిపోయింది. మూడు సీట్లతో సరిపెట్టుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ సంగతి సరేసరి.. సర్వనాశనం అయిపోయింది. ఆ పార్టీకి ఏం జరిగి తీరాలో అదే జరిగింది. ‘మోడీ హవా’ అంటూ గెలుపు మీద పూర్తి నమ్మకంతో ఉన్న బీజేపీకి అయితే ఈ ఓటమి బుద్ధి తెచ్చుకోవాల్సిన ఓటమిగా మిగిలిపోయింది. ప్రజలు ఒక్కసారి ఫిక్సయితే ఎవరి మాటా వినరనేదానికి ఉదాహరణగా ఈ ఎన్నికలు నిలిచాయి. ప్రజలు ఎవరికి ఓటు వేయాలో ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత బీజేపీ నాయకులు ఎన్ని సుదీర్ఘ ఉపన్యాసాలు చెప్పినా, ఎదుటి పార్టీలో ఉన్న నాయకులను తమ పార్టీలోకి చేర్చుకున్నా. ఎన్ని రాజకీయ వ్యూహాలు పన్నినా, దేశంలోని రాజకీయ శక్తులను, కార్పొరేట్ శక్తులను ఢిల్లీలోనే కేంద్రీకరించేలా చేసినా ఓటరు మాత్రం తాను అనుకున్నట్టుగానే తీర్పు ఇచ్చాడు. ప్రజలకు దూరమైతే ఫలితాలు ఎలా వుంటాయో బీజేపీకి తెలిసి వచ్చేలా, ఈ ఓటమిని చూసి బీజేపీ బుద్ధి తెచ్చుకునేలా తీర్పు ఇచ్చాడు.
దేశంలో అధికారం చెలాయిస్తున్న పార్టీగా బీజేపీ ఎన్ని రాజకీయ ఎత్తులు, పైఎత్తులు వేసినా, టీవీ ఛానళ్ళను తనవైపు తిప్పుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి సోషల్ మీడియాను తన ప్రచారానికి విజయవంతంగా ఉపయోగించుకుంది. మొన్నటి వరకూ టీవీ ఛానళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేసినప్పటికీ ఆ పార్టీ సోషల్ మీడియానే నమ్ముకుంది. సోషల్ మీడియా ద్వారా తన మీద ఢిల్లీ ప్రజలకు నమ్మకం పెరిగేలా చేసుకోగలిగింది. ఎన్నికల ప్రచారం కోసం పెద్దగా ఖర్చేమీ పెట్టకపోయినా ఢిల్లీ గల్లీ గల్లీలోకి వెళ్ళగలిగింది.
తాను అద్భుతంగా పరిపాలిస్తున్నానని బీజేపీ అనుకోవడం ఇప్పటికైనా మానుకోవాలి. అధికారంలో మునిగి తేలుతూ ప్రజలకు దూరమైతే ప్రజలు ఏ క్షణంలో అయినా తిరగబడతారని గ్రహించాలి. మొన్నటి వరకూ ఢిల్లీలో హాట్ ఫేవరెట్‌గా వున్న బీజేపీ ఇప్పుడు మట్టికరిచి పోవడానికి, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ చరిత్రలో లేనంతటి విజయాన్ని నమోదు చేయడానికి కూడా ఈ తిరుగుబాటే కారణం. ఒక విధంగా చెప్పాలంటే, గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రకంగా ఓటర్లు కాంగ్రెస్ పార్టీని అడ్రస్ లేకుండా చేశారో.. ఇప్పుడు బీజేపీని ఢిల్లీలో అలా చేశారు. అప్పట్లో ఏపీలో చంద్రబాబుకు ఒక మోస్తరుగా మద్దతు చూపిస్తున్న ప్రజలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద కసితో చంద్రబాబుకు మరింత దగ్గరయ్యారు. మధ్యలో అధికారం కోసం అల్లాడుతున్న జగన్ని కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు ఢిల్లీ ప్రజలు కూడా బీజేపీ విషయంలో అలాంటి ‘కసి’నే ప్రదర్శించారు.
ఢిల్లీ ఫలితాలను చూసి బీజేపీతోపాటు ఇతర రాజకీయ పార్టీలు కూడా బుద్ధి తెచ్చుకోవాల్సిన విషయం ఒకటి స్పష్టమవుతోంది. ప్రజల మనసులకు నచ్చని పనులు చేసిన ఏ పార్టీని ప్రజలు క్షమించరు. గతంలో బ్రహ్మరథం పట్టినవారే క్షణాల్లో మట్టి కరిపిస్తారు. మేం అధికారంలోకి వచ్చాం కాబట్టి మేం ఏమి చేసినా నడుస్తుందని అనుకునే ధోరణిని నాయకులు ఇప్పటికైనా వదులుకోవాలనే గుణపాఠాన్ని ఓటర్లు మరోసారి నేర్పించారు.