మైండ్ డైట్‌తో మానసిక సమస్యలన్నీ మాయమవుతాయి!

మైండ్ అనే పేరు కలిగి ఉండటం వల్ల ఇది పక్కాగా మెదడుకు మేలు చేసే డైట్ అని ఇట్టే తెలిసిపోతుంది. అయితే ఈ మైండ్ డైట్ అనేది కేవలం మెదడుకు ఆరోగ్యాన్ని చేకూర్చడమే కాకుండా శరీర ఆరోగ్యాన్ని కూడా సంరక్షిస్తుంది. ఈ మైండ్ డైట్ న్యూరోడెజెనరేటివ్ సమస్యల ప్రభావాన్ని తగ్గించడంలో, మెదడు సంబంధిత వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది.  ఈ మైండ్ డైట్ ను మెడిటరేనియన్ -డాష్ డైట్ అని పిలుస్తారు. అసలీ డైట్ లో ఏమి తినాల్సి ఉంటుంది? ఇది ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుంది?  పూర్తీగా తెలుసుకుంటే..

మైండ్ డైట్ లో తినేవేంటంటే..

మైండ్ డైట్ లో సాధారణంగా తృణధాన్యాలు, ఆకుకూరలు, ఇతర కూరగాయలు, బెర్రీలు, చిక్కుళ్లు, గింజలు, చేపలు, ఆలివ్ నూనె.. మొదలైనవి వినియోగిస్తుంటారు.

మైండ్ డైట్ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుందంటే..

రోజూ తీసుకునే ఆహారంలో మైండ్ డైట్ చేర్చుకోవడం వల్ల మెదడు సంబంధ సమస్యల నుండి సులువుగా బయటపడవచ్చు. న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. మైండ్ డైట్ వల్ల అన్నింటికంటే ముఖ్యంగా మతిమరుపుకు మరొక భయంకరమైన స్టేజ్ అయిన అల్జీమర్స్ ప్రమాదాన్ని 53శాతం తగ్గించుకోవచ్చు. ఈ డైట్ లో తీసుకునే బెర్రీలు, ఆకుకూరలు, తృణధాన్యాలు, గిండలలో యాంటీఆక్సిడెంట్ లు అధికంగా ఉంటాయి. ఇవి ప్రీరాడికల్స్ నుండి మెదడు కణాలను రక్షించడంలో సహాయపడతాయి.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తప్పనిసరి..

సాల్మన్ వంటి చేపలలో ఉండే కొవ్వులో ఒమేగా-3 పుష్కలంగా ఉంటుంది. మైండ్ డైట్ లో ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ప్రముఖమైంది. ఇది మెదడు ఆరోగ్యాన్ని,అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది మాత్రమే కాకుండా మెదడు కణాల వాపు తగ్గించడంలోనూ ఈ మైండ్ డైట్ సమర్థవంతంగా పనిచేస్తుంది.

పోషకాలే ప్రధానం..

మైండ్ డైట్ లో మెదడు ఆరోగ్యాన్ని ప్రోత్సహించే విటమిన్-ఈ, ఫోలేట్, బి-విటమిన్లు వంటి పోషకాలు సమృద్దిగా ఉంటాయి. ఇవి మనిషి మెదడు మీద ప్రభావం చూపిస్తాయి. అభిజ్ఞా పనితీరుకు తోడ్పడతాయి. వివిధ రకాల మెదడు సంబంధ, నాడీ సంబంధ వ్యాదుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. తృణధాన్యాలు, డార్క్ చాక్లెట్ వంటివి కూడా ఈ డైట్ లో భాగంగా ఉంటాయి. ఇవి మెదడుకు రక్తప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. కాబట్టి శాఖాహారులు మైండ్ డైట్ లో వీటిని తీసుకుని ఫలితాలు పొందవచ్చు.

                                                             *నిశ్శబ్ద.