డిప్రెషన్ కు భలే చక్కని మందు.. వాకింగ్..!
posted on Dec 20, 2024 9:30AM
నేటి బిజీ లైఫ్‌లో డిప్రెషన్ అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. చాలా మంది ప్రజలు ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. డిప్రెషన్ కు ఒక నిర్ణీత ఔషధం అంటూ ఏమీ లేకపోవడం చాలామంది దీన్నుండి బయటపడక పోవడానికి కారణం అవుతోంది. డిప్రెషన్ రావడం ఎంత సులువో దాన్నుండి బయట పడటం అంత కష్టం అనే విషయం చాలామందికి తెలుసు. అయితే డిప్రెషన్ లక్షణాలను తగ్గించడానికి ఒక సులభమైన మరియు ప్రభావవంతమైన మార్గాన్ని వైద్యులు సిఫారసు చేస్తున్నారు. ఒక పరిశోధనలో బయటపడిన ఈ విషయం రోజువారీ వాకింగ్ డిప్రెషన్ చక్కని ఔషధంలా పనిచేస్తుందట. రోజూ వాకింగ్ చేయడం వల్ల డిప్రెషన్ (వాకింగ్ హెల్త్ బెనిఫిట్స్) తగ్గించడంలో చాలా సహాయపడుతుందని ఈ అధ్యయనం వెల్లడించింది. దీని గురించి మరింత లోతుగా తెలుసుకుంటే..
ప్రతిరోజూ వాకింగ్ చేస్తున్నప్పుడు స్టెప్ కౌంట్ ను క్రమంగా కొద్ది మొత్తంలో పెంచడం వల్ల డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో చాలా వరకు సహాయపడుతుంది. రోజువారీ నడక మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నడిచినప్పుడు స్ట్రెస్ హార్మోన్ చాలా వరకు తగ్గుతుంది. శరీరం చురుకుగా ఉంటుంది. వాకింగ్ చెయ్యాలి అనుకునే వారు దాన్నొక భారంగా కాకుండా చక్కని ఔషధం తీసుకుంటున్నాం అనే ఆలోచనతో మొదలుపెడితే డిప్రెషన్ ను అధిగమించడం చాలా సులువని అధ్యయనాలు చెబుతున్నాయి.
రోజుకు ఎన్ని అడుగులు..
సాధారణంగా వాకింగ్ గోల్ పెట్టుకునే వారు రోజుకు ఇన్ని అడుగుల చెప్పున నడుస్తుంటారు. కొందరు కిలోమీటర్ల చెప్పున కౌంట్ వేసుకుంటారు. ఇప్పట్లో అందుబాటులో ఉన్న సాంకేతికత ఆధారంగా ఈ స్టెప్ కౌంట్ అనేది ప్రతి ఫోన్ లో ట్రాక్ చేయవచ్చు. దీని వల్ల ఆరోగ్యానికి చాలా బెనిఫిట్ కూడా. రోజుకు ఆరువేల అడుగులతో మొదలు పెట్టి క్రమంగా స్టెప్ కౌంట్ ను పెంచుతూ వెళ్లాలి. గూగుల్ ఫిట్ వంటి హెల్త్ ట్రాకింగ్ యాప్స్ లో వాకింగ్ చేసే వ్యవథి.. వేగాన్ని బట్టి హార్ట్ పాయింట్స్ కూడా వస్తాయి. ఇవి గుండె ఆరోగ్య పరిరక్షణకు సహాయపడతాయి.
స్టెప్ కౌంట్ ను మొదలుపెట్టిన తరువాత క్రమంగా పెంచుకుంటూ 10 వేల అడుగులకు చేరుకోవాలి. ఇది డిప్రెషన్ స్థాయిని క్రమంగా తగ్గిస్తుంది. వాకింగ్ వల్ల డిప్రెషన్ తగ్గుతుందని మరీ ఎక్కువగా నడవడం అయితే మంచిది కాదు.. 10వేల అడుగులకు మించి వాకింగ్ చేసినా మరీ అంత ప్రయోజనం ఏమీ ఉండదు. ఎందుకంటే ఈ దశలో శరీరం చాలా అలసిపోతుంది. కేవలం వాకింగ్ మాత్రమే కాకుండా యోగా, వెయిట్ ట్రైనింగ్, ఏరోబిక్స్, స్విమ్మింగ్ మొదలైనవి కూడా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, డిప్రెషన్ స్థాయిలను తగ్గించడానికి ఎంతగానో తోడ్పడతాయి.
*రూపశ్రీ.