ఆహారమే కాదు.. ఎసిడిటీకి ఇవి కూడా కారణాలేనట..!

 

ఎసిడిటీ అనేది చాలా సాధారణమైన సమస్య. ప్రతి ఒక్కరూ   ఎప్పుడో ఒకప్పుడు ఎసిడిటీ సమస్యను అనుభవించి ఉంటారు. కొన్ని కారణాల వల్ల కడుపులో యాసిడ్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల ఈ సమస్య వస్తుంది. అసిడిటీ కారణంగా అజీర్ణం, జీర్ణ సమస్యలు, గ్యాస్ ఏర్పడటం వంటి సమస్యలు వస్తుంటాయి. ఎసిడిటీని ప్రధానంగా ఈటింగ్ డిజార్డర్స్ వల్ల వచ్చే సమస్యగా పరిగణిస్తారు. అయితే దీనికి  ఇతర  కారణాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? కడుపులో యాసిడ్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల వచ్చే సమస్య ఎసిడిటీ అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆహారం వల్ల ఎసిడిటీ సమస్య ఏర్పడినప్పుడు యాసిడ్ ఆహార నాళంలోకి  తిరిగి వస్తుంది.  దీని కారణంగా ఛాతీ దిగువ భాగంలో నొప్పి లేదా మంట వస్తాయి. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఏ వయసు వారికైనా ఎసిడిటీ రావచ్చు.


అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఎసిడిటీకి ప్రధాన కారణమని వైద్యులు, పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది కాకుండా, ఎసిడిటీని కలిగించే కొన్ని పరిస్థితులు ఉన్నాయి. అసలు ఎసిడిటీ లక్షణాలు ఎలా ఉంటాయి? ఎసిడిటీ రావడానికి ఆహారం మాత్రమే కాకుండా వేరే ఇతర కారణాలు ఏమున్నాయి?


 కడుపులో ఉండే యాసిడ్ (గ్యాస్ట్రిక్ జ్యూస్) అధిక మొత్తంలో ఉత్పత్తి కావడం వల్ల ఎసిడిటీ ఏర్పడుతుంది. ఈ కడుపు ఆమ్లం ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. అయితే యాసిడ్ అధికంగా ఉత్పత్తి కావడం లేదా కడుపు గోడలలో విచ్చలవిడిగా  వ్యాపించడం జరిగినప్పుడు అది కడుపులో మంట, నొప్పి,  ఇతర సమస్యలకు దారితీస్తుంది.

అసిడిటీ లక్షణాలు వివిధ రకాలుగా ఉంటాయి.  ఇవి కూడా  తేలికపాటి నుండి తీవ్రమైన లక్షణాల  వరకు ఉంటాయి.

తిన్న వెంటనే లేదా ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు కడుపు మండే అనుభూతి కలిగి ఉంటుంది.


త్రేనుపులు బాగా వస్తాయి ముఖ్యంగా పుల్లని త్రేనుపులు ఎక్కువ ఉంటాయి.

తరచుగా నోటిలో పుల్లని రుచి ఉంటుంది.

కడుపులో భారం, నొప్పి,  కడుపు ఉబ్బరం వంటి  సమస్యలు ఎప్పుడూ అనిపిస్తుంటాయి.

గొంతులోకి యాసిడ్ చేరడం వల్ల మంట,  పొడి దగ్గు.

వికారం,  వాంతులు లేదా తరచుగా రెగ్యురిటేషన్


ఆహారమే కారణమా?

ఆహార సంబంధిత అలవాట్లు చాలా ముఖ్యమైనవి. మితిమీరిన కారంగా,  వేయించిన ఆహారాన్ని తినడం, టీ, కాఫీ లేదా కార్బోనేటేడ్ డ్రింక్స్ అధికంగా తీసుకోవడం ఎసిడిటీకి ప్రధాన కారణాలు. తిన్న వెంటనే పడుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం లేదా ఎక్కువ సేపు ఆకలితో ఉండడం, ఫ్యాటీ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల కూడా ఎసిడిటీ రావచ్చు.


ఇవి కూడా  కారణాలే..

తినే అలవాట్లతో  పాటు అనేక జీవనశైలి సంబంధిత కారణాల వల్ల కూడా  ఎసిడిటీ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ధూమపానం,  మద్యం సేవించే వ్యక్తులకు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.  ఇది కాకుండా అధిక ఒత్తిడి,  ఆందోళనలో ఉన్నా.. తగినంత నిద్ర లేకున్నా..  లేదా ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ,  ఉన్నా ఎసిడిటీకి గురవుతారు.

                                          *రూపశ్రీ.