చలికాలంలో అల్లం టీ.. లాభాలే కాదు ఈ నష్టాలు కూడా..!
posted on Dec 19, 2024 9:30AM
చలికాలం శరీరానికి పరీక్ష కాలం. చాలామంది శరీరం వెచ్చగా ఉండటం కోసం ఆహారంలో చాలా మార్పులు చేసుకుంటారు. అల్లం, వెల్లుల్లి వంటి వంటింటి ఔషద మూలికలు కూడా చాలా ఎక్కువగా వాడుతుంటారు. వీటి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని, సీజన్ సమస్యలు తగ్గించడంలో బాగా సహాయపడుతుందని అంటారు. చలి నుండి ఊరట పొందడానికి చాలామంది టీ, కాఫీలు బాగా తాగుతారు. ముఖ్యంగా చలికాలంలో అల్లం టీ తాగడానికి చాలమంది ఇష్టపడతారు. అయితే అల్లం టీ వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. నష్టాలు కూడా ఉంటాయట.
అల్లం టీ తాగడం చాలా రిలీఫ్ గా అనిపించినప్పటికీ ఇది కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది. రోజులో ఒకటి లేదా రెండు సార్లకు మించి అల్లం టీ తాగితే యాసిడ్ చాలా ఎక్కువ పెరిగి ఎసిడిటీ సమస్య విజృంభిస్తుంది. ఇప్పటికే ఎసిడిటీ సమస్యతో ఇబ్బంది పడేవారు అల్లం టీ ఒకటి లేదా రెండు సార్లకు మించి తాగితే అది సమస్యను తీవ్రం చేస్తుంది.
అల్లంలో రక్తపోటు సమస్యకు మంచి ఔషధం. అధిక రక్తపోటును నియంత్రించడంలో, తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. కానీ ఇప్పటికే రక్తపోటు తక్కువ వారు అల్లం టీని పదే పదే తాగుతుంటే అది శరీరంలో రక్తపోటు తగ్గిపోయి లో బీపీ, మైకం వంటి సమస్యలు కలుగజేస్తుంది.
రక్తం శరీరంలో చాలా కీలకమైన ద్రవ పదార్థం. అయితే అల్లంలో రక్తాన్ని పలుచన చేసే గుణాలు ఉంటాయి. ఇప్పటికే రక్తం పలుచన కావడం కోసం మందులు వాడుతున్న వారు అల్లం టీ తాగితే చాలా సమస్య ఏర్పడుతుంది.
గర్భవతులకు వికారం, వాంతి వచ్చినట్టు అనిపించడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అజీర్ణం కూడా చేస్తుంటుంది. అయితే అల్లం టీ తాగితే ఈ సమస్య చాలా వరకు సద్దుమణుగుతుంది. కానీ ఇది మేలు చేస్తుంది కదా అని పదే పదే అల్లం టీని తాగితే గర్భవతులకు మేలు కంటే ఎక్కువ కీడు జరిగే అవకాశం ఉంది.
అల్లం టీ తాగితే జీర్ణక్రియ సక్రమంగా పని చేస్తుంది. కానీ దీన్ని ఎక్కువగా తాగితే విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంటుంది. కడుపులో వికారం కలిగించి అతిసారం సమస్య సృష్టిస్తుంది.
అల్లంలో టానిన్ లు ఉంటాయి. అలాగే అల్లంటీలో కెఫీన్ కూడా ఉంటుంది. దీన్ని ఎక్కువగా తాగితే తీసుకునే ఆహారం నుండి ఐరన్ ను శరీరం గ్రహించకుండా చేస్తుంది. దీని వల్ల ఐరన్ లోపం ఏర్పడి రక్తహీనత సమస్య వస్తుంది.
*రూపశ్రీ.