కఠిన చర్యలు తీసుకోకపొతే పరిస్థితి దారుణంగా మారే అవకాశం.. డబ్ల్యూహెచ్ఓ 

ఇప్పటికే ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తీవ్రతతో వణికిపోతోంది. దీనికి తోడు అమెరికా, బ్రెజిల్ లో కేసులు తగ్గకపోగా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయా దేశాలు కనుక కఠినమైన ఆరోగ్యపరమైన చర్యలు తీసుకోకపోతే పరిస్థితులు దారుణంగా మారతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. ఇప్పటికీ చాలా దేశాలు తప్పుడు మార్గంలో వెళ్తున్నాయని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెండ్రోస్ అన్నారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తానికి ఈ వైరస్సే ప్రధాన శత్రువు అవుతుందని అయన అన్నారు. ఆయా దేశాల ప్రభుత్వాలు కనీస చర్యలైనా పాటించకపోతే కరోనా సమస్య ఎలా తొలగి పోతుందని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1.3 కోట్ల పాజిటివ్ కేసులున్నాయి. 5 లక్షల మందికి పైగా ఇప్పటికే చనిపోయారని తెలిపారు. మళ్ళీ కొంత కాలం ఇదివరకటి రోజులు రాకపోవచ్చన్న టెండ్రోస్... వైరస్‌ని కంట్రోల్ చేయడమే మానవాళి ముందున్న కర్తవ్యం అని అన్నారు.

ఐతే టెండ్రోస్ పై ఒంటికాలి పై లేస్తున్న ట్రంప్ పాలనలో ఉన్న అమెరికాలో నిన్న ఒక్క రోజే 60 వేలకు పైగా పాజిటివ్ కేసులొచ్చాయి. ఆదివారం ప్రపంచం మొత్తం కలిపి 2.3 లక్షల కొత్త కేసులు నమోదు కాగా వాటిలో దాదాపు 80 శాతం కేవలం 10 దేశాల్లోనే వచ్చాయనీ, అంతే కాకుండా 50 శాతం కేసులు అమెరికా, బ్రెజిల్ దేశాల్లోనే వచ్చాయని ఆయన అన్నారు. కరోనా తీవ్రతకు తీవ్రంగా దెబ్బతిన్నది కూడా ఈ రెండు దేశాలు కావడం గమనార్హం.

అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా విపరీతంగా పెరుగుతోందని, కనీసం అటువంటి ప్రాంతాల్లో లాక్‌‌డౌన్ అమలు చెయ్యాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఎమర్జెన్సీస్ హెడ్ మైక్ ర్యాన్ విజ్ఞప్తి చేసారు. అంతే కాకుండా వైరస్ ముప్పు తొలగిపోయిన తర్వాతే విద్యాసంస్థలు తెరవడం పై ఆలోచన చేయడం మంచిదని అయన సూచించారు. ఈ విపత్కర సమయంలో రాజకీయ విమర్శలు, ఎత్తుగడలు ఎంత మాత్రం మంచిది కాదన్నారు. ఐతే అమెరికాలో కరోనా వచ్చిన 6 నెలల తర్వాత తొలిసారి అధ్యక్షుడు ట్రంప్ మాస్క్ పెట్టుకొని ప్రజల్లోకి వస్తున్నారు. ఇక కరోనా వైరస్ ఎలా పుట్టిందో తేల్చేందుకు తమ పరిశోధకులు చైనాకు వెళ్లి తేలుస్తారని టెడ్రోస్ తెలిపారు.