పార్టీ ఫిరాయింపులు..తిలా పాపం తలో పిడికెడు

 

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఒక దుస్సంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నారని ప్రతిపక్షనేత జానారెడ్డి విమర్శించారు. అందుకు తెరాస సభ్యులు కూడా కాంగ్రెస్, తెదేపాలు ఎప్పుడెప్పుడు ఎవరెవరిని ఏవిధంగా పార్టీ ఫిరాయింపులకి ప్రోత్సహించిందీ పేర్లు, గణాంకాలతో సహా వివరించి ఇదేమీ తాము కొత్తగా మొదలుపెట్టిన ప్రక్రియ కాదని సమర్ధించుకొన్నారు. తెరాస వాదనలో నూటికి నూరు శాతం నిజమని ఒప్పుకోక తప్పదు.

 

గతంలో రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను ఇదేవిధంగా బలహీనపరిచారు. ఆ తరువాత ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి కూడా తను తలుచుకొంటే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కొనసాగుతున్న తన విధేయులను బయటకు రప్పించి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రభుత్వాన్ని కూలదోయగాలనని గర్వంగా చెప్పుకోవడమే కాక కాంగ్రెస్, తెదేపా సభ్యులను పార్టీ ఫిరాయింపజేశారు కూడా. అయితే ఆయన ఊహించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోలేదు. అదివేరే సంగతి. రాష్ట్ర విభజన తరువాత, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు కప్పలు దూకినట్లు ఏవిధంగా వైకాపా, తెదేపాలలోకి దూకేరో అందరూ చూసారు.

 

ఆ తరువాత నుండి నేటి వరకు కూడా అధికార పార్టీలయిన తెరాస, తెదేపాలలోకి ఇతర పార్టీల యం.యల్యే.లు వచ్చి చేరుతూనే ఉన్నారు. ఇదొక నిరంతర ప్రక్రియ. అందుకు ఎవరినీ ఎవరూ నిందించుకొనవసరం లేదు. పార్టీలన్నీ సిద్దాంతాలకు, విలువలకు తిలోదకాలు ఇచ్చినప్పుడే ఇక న్యాయం, ధర్మం గురించి మాట్లాడే అర్హత కోల్పోయాయి. అందువలన తాము స్వయంగా తయారుచేసుకొన్న ఈ వికృత రాజకీయ వ్యవస్థను చూసి ఇప్పుడు అవి భయపడటం, ఇతరులను నిందించడం చాలా హాస్యాస్పదం.