హైదరాబాద్ లో మరింత పటిష్టమయిన నిఘా వ్యవస్థ అవసరం

 

అరబిందో ఫార్మా వైస్ ప్రెసిడెంట్ నిత్యానంద రెడ్డిపై ఈరోజు ఉదయం హత్యా ప్రయత్నం జరిగింది. కానీ అదృష్టవశాత్తు ఆయన త్రుటిలో తప్పించుకోగలిగారు. ఆయనపై కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరు? ఆయనను ఎందుకు హత్య చేయాలనుకొన్నాడు? హత్య చేయదలిస్తే చేతిలో ఏ.కె.47వంటి అత్యధునికమయిన ఆయుధం ఉంచుకొని, దూరం నుండి కాల్చే బదులు కారులో ప్రవేశించి కాల్చాలని ఎందుకు ప్రయత్నించాడు. అంటే అతను నిజంగా ప్రొఫెషనల్ కిల్లర్ కాడా? కానప్పుడు అతను ఏ.కె.47వంటి అత్యధునికమయిన ఆయుధం ఏవిధంగా సంపాదించాడు? అతను నిజంగానే నిత్యానంద రెడ్డిని హత్య చేయాలను కొన్నాడా లేకపోతే కేవలం ఆయనను భయపెట్టేందుకే ఆ విధంగా చేసాడా? పారిపోతున్నపుడు తనను పోలీసులకి పట్టివ్వగల సాక్ష్యాలుగా పనికి వచ్చే ఏ.కె.47, బ్యాగుని కారులో ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు? బ్యాగులో ఏమున్నాయి? అనే అనేక ప్రశ్నలు ఎవరికయినా కలుగక మానవు. వాటన్నిటికీ పోలీసులే సమాధానాలు కనుగొనాల్సి ఉంటుంది.

 

ఇక ఈ సంఘటన హైదరాబాద్ లో ప్రజల ప్రాణాలకు ఎంత భద్రత ఉందో అద్దం పట్టేదిగా ఉంది. ఒక వ్యక్తి పట్టపగలు జనసందోహం బాగా ఉన్నప్రాంతంలో అందరి కళ్ళ ఎదుటే ఏ.కె.47వంటి అత్యధునికమయిన ఆయుధంతో హత్యాప్రయత్నం చేయడం, తప్పించుకొని పారిపోగలగడం వంటివి నిఘా వ్యవస్థ మరింత పటిష్టం కావలసిన అవసరం ఉందని స్పష్టం చేస్తోంది. ఈరోజు నిత్యానంద రెడ్డిపై జరిగిన హత్యా ప్రయత్నాన్ని ఒక మామూలు హత్య కేసుగా పరిగణించలేము. ఎందుకంటే ఆ వ్యక్తి చేతిలో ఉన్నది సైనికులు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు మాత్రమే ఉపయోగించ గలిగే ఏ.కె.47వంటి అత్యధునికమయిన ఆయుధం. అదే అయుధాన్ని ఆ వ్యక్తి పార్క్ కు వచ్చిన ప్రజలపై గురిపెట్టి ఉండి ఉంటే ఎంత అనర్ధం జరిగి ఉండేదో ఎవరయినా తేలికగానే ఊహించగలరు. గన్ సంస్క్రతికి బాగా అలవాటుపడిన అమెరికా దేశంలో ఇటువంటి సంఘటనలు అప్పుడప్పుడు జరగడం చూస్తూనే ఉన్నాము.

 

అందువల్ల ఈ సంఘటనను అంత తేలికగా తీసిపారేయలేము. హైదరాబాద్ నగరాన్ని ఉగ్రవాదులు, అసాంఘీక శక్తులు కన్నెత్తి చూడలేని విధంగా అత్యాధునికమయిన పోలీసింగ్ వ్యవస్థను, నగరమంతా సిసి. కెమెరాలతో కట్టుదిట్టం చేస్తానని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకు చాలా సార్లు ప్రకటించారు. ఆ ప్రయత్నంలోనే నగర పోలీసులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆయుధాలతో కూడిన ఇన్నోవా కార్లను కూడా కొని ఇచ్చారు. అయినా అసాంఘిక శక్తులు తరచూ నగరంలో ఎక్కడో అక్కడ తమ ప్రతాపం చూపిస్తూనే ఉన్నాయి. అయితే నగరంలో జరిగే ఇటువంటి ప్రతీ సంఘటనను నియత్రించడం ఎంతవారికయినా అసాధ్యం కనుక పోలీసులను నిందించడానికి ఏమీ లేదు.

 

కానీ ఈరోజు జరిగిన సంఘటన నగరంలో నిఘా వ్యవస్థ మరింత కట్టు దిట్టం కావలసిన అవసరం చాలా ఉందనే సంగతిని నొక్కి చెపుతోంది. అంతే కాదు ఇటువంటి సంఘటనలు కేవలం హైదరాబాద్ లో మాత్రమే జరుగుతుంటాయని మిగిలిన జిల్లాలు, రాష్ట్రాలు నిర్లిప్తత వహించకుండా ముందే ఇటువంటి వాటికి అవసరమయిన నివారణ చర్యలు చెప్పట్టడం మంచిది. ముఖ్యంగా కొత్తగా నిర్మించబోతున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరంలో, ఐటీ హబ్ గా తీర్చిదిద్దబోతున్న విశాఖలో ఇటువంటి సంఘటనలు జరగకుండా అత్యాదునికమయిన పరికరాలను పోలీసింగ్ వ్యవస్థను ముందు నుండే ఏర్పాటు చేసుకోవడం మంచిది.