జానా కూడా జంప్ జిలానీ అవుతారా?
posted on Nov 20, 2014 1:09PM
యుద్ధంలో సేనాధిపతి అందరికంటే ముందు వుండాలి. సైన్యం వీరోచితంగా యుద్ధం చేసేలా ఉత్సాహాన్నివ్వాలి. అయితే అలాంటి సేనాధిపతి శత్రువులకు లొంగిపోతే యుద్ధం ముగిసిపోయినట్టే. మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి పరిస్థితులే తలెత్తుతున్నాయా అనే సందేహాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వున్న టీఆర్ఎస్ రాజకీయ ప్రయోజనాల కోసం ఇతర పార్టీల ఎమ్మెల్యేల మీద ‘ఆకర్ష’ మంత్రాన్ని ప్రయోగిస్తోంది. ఆ మంత్రానికి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆమధ్య తెలుగుదేశం ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరితే ఎంటర్‌టైన్‌మెంట్ చూసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు తమ ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తూ వుండటంతో బిత్తరపోయారు. అర్జెంటుగా ఆందోళన కార్యక్రమాలు ప్రారంభించారు. అసెంబ్లీలో కూడా నానా లొల్లి చేశారు. ఇంతవరకూ ఓకే... ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నానా గందరగోళం చేస్తుంటే, శాసనసభా పక్షం నాయకుడు జానారెడ్డి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ వుండటం అనేక అనుమానాలు తలెత్తేలా చేస్తోందని పరిశీలకులు అంటున్నారు.
తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ నాయకులు ప్రతి అంశంలోనూ వాగ్ధాటితో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. వారి ధాటికి తట్టుకోలేకే ప్రభుత్వం వారిని వారం రోజులపాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయించిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ ప్రలోభపెట్టే అంశం మీద అసెంబ్లీలో గానీ, బయట గానీ సీఎల్పీ లీడర్ జానారెడ్డి మాట్లాడిన తీరు చప్పచప్పగా వుండటమే కాకుండా, ఆయన ప్రసంగం టీఆర్ఎస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదని అంటున్నారు. మాటలతో ప్రభుత్వాన్ని కడిగిపారేయాల్సిన జానారెడ్డి ఒక్కోమాట ఆచి తూచి మెల్లగా మాట్లాడుతూ, నీతిసూత్రాలు చెబుతున్నట్టుగా మాట్లాడుతూ వుండటం ఎంతమాత్రం బాగాలేదని కాంగ్రెస్ పార్టీవారే గొణుక్కున్నారు. ఆ తర్వాత ఒక రోజు జానారెడ్డి సభకు రాకపోవడంతో అసెంబ్లీలో కాంగ్రెస్ ఉప నాయకుడు జీవన్ రెడ్డి సభలో వాడిగా, వేడిగా మాట్లాడి ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడేశారు. అంతకుముందు రోజు జానారెడ్డి మాట్లాడిన తీరుకంటే జీవన్ రెడ్డి మాట్లాడిన తీరు బాగుందని, టీఆర్ఎస్‌కి వ్యతిరేకంగా పోరాడే విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఉత్సాహం పెంచిందన్న అభిప్రాయాలు వినిపించాయి.
ఇదిలా వుంటే మొన్న ఒకరోజున అసెంబ్లీ స్పీకర్ జానారెడ్డి మినహా కాంగ్రెస్ సభ్యులందరినీ ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. అందర్నీ సస్పెండ్ చేసి జానారెడ్డిని మాత్రం ఎందుకు వదిలేశారో ఎవరికీ అర్థం కాలేదు. సస్పెండ్ అయిన కాంగ్రెస్ సభ్యులందరూ సభ నుంచి బయటకి వెళ్ళిపోతే, వారికి నైతిక మద్దతు ఇస్తూ జానారెడ్డి కూడా బయటకి వెళ్ళిపోతే మర్యాదగా వుండేది. అయితే జానారెడ్డి మాత్రం తాను కూర్చున్న సీట్లోంచి అంగుళం కూడా కదలకుండా కూర్చున్నారు. జానారెడ్డి వ్యవహరించిన ఈ తీరు కాంగ్రెస్ సభ్యులకే అర్థం కాలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జానా గళం విప్పకపోవడం, కాంగ్రెస్ సభ్యులకు నైతిక మద్దతు ఇవ్వకపోవడం చూస్తుంటే టీఆర్ఎస్ ఆకర్ష మంత్రానికి జానారెడ్డి కూడా లొంగిపోయారా అనే అనుమానాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే జానారెడ్డి కూడా జంప్ జిలానీ అయ్యే ఛాన్స్ ఉందని ఊహిస్తున్నారు.