ప్రియమైన రేవంత్ రెడ్డి గారూ... ఇట్లు చంద్రబాబు నాయుడు!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాసిన అధికారిక లేఖ ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయాల్లో మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ లేఖ సృష్టించిన ప్రభావాన్ని చర్చించే ముందు ఈ లేఖలోని సారాంశాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం.

ఫ్రమ్: నారా చంద్రబాబు నాయుడు, చీఫ్ మినిస్టర్, అమరావతి, ఆంధ్రప్రదేశ్, తేదీ: 01-07-2024. ప్రియమైన శ్రీ రేవంత్‌రెడ్డి గారూ... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు చేస్తున్న ప్రశంసనీయమైన కృషికి నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అంకితభావం, నాయకత్వం తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథకంలో పయనించేలా చేస్తుందని భావిస్తున్నాను. 

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సుస్థిరమైన పురోగతి, శ్రేయస్సును మరింత పెంపొందించడానికి అవసరమైన సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యత మన ఇద్దరి మీద వుంది. మన రెండు రాష్ట్రాలు నిరంతరం పరస్పరం సహకరించుకోవడం వల్ల మన రాష్ట్రాలు పెట్టుకున లక్ష్యాలను సులభంగా చేరుకోగలవు.

ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగి పదేళ్ళు పూర్తయింది. పునర్వ్యవస్థీకరణ చట్టం నుండి ఉత్పన్నమైన సమస్యల గురించి అనేక చర్చలు జరిగాయి. ఈ చట్టం మన రాష్ట్రాల సంక్షేమం, పురోగతి మీద గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ సమస్యలను మనం చాలా సామరస్యంతో పరిష్కరించుకోవలసిన అవసరం వుంది. ఈ నేపథ్యంలో, జూలై 6వ తేదీ శనివారం మధ్యాహ్నం మీ దగ్గరే మిమ్మల్ని కలుసుకోవాలని నేను ప్రతిపాదిస్తున్నాను.

మన ముఖాముఖి సమావేశం రెండు రాష్ట్రాలు ఎదుర్కొంటున్న క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలు సాధించడంలో మనకు అవకాశాన్ని కల్పిస్తుందని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. మన మధ్య జరిగేచర్చలు సత్ఫలితాలను అందిస్తాయని నేను ఆశిస్తున్నాను. ఇట్లు
నారా చంద్రబాబు నాయుడు.

రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు రాసిన ఈ లేఖ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అటు తెలంగాణ రాష్ట్రంలో విస్తృత చర్చకు కారణమైంది. రాష్ట్ర విభజన జరిగిన మొదటి ఐదేళ్ళ కాలంలో తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులుగా వున్నారు. కేసీఆర్ అహంకార ధోరణి వల్ల అప్పట్లో చంద్రబాబు నాయుడు లేఖ రాసే అవకాశం లేదు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖాముఖి సమావేశమయ్యే అవకాశం అంతకన్నా లేదు. దాంతో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సంబంధ సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు వుండిపోయాయి.

2019లో తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఫెవీకాల్ బంధం బాగానే వుంది. ఇద్దరూ ఒకరి శ్రేయస్సును మరొకరు కోరుకునేవారు. ఇద్దరి గెలుపు కోసం మరొకరు తపస్సు చేసేవారు. అలాంటి వీరిద్దరూ రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అయినప్పటికీ, ఏనాడూ రెండు రాష్ట్రాల మధ్య వున్న సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకున్న పాపాన పోలేదు. ఏ ముఖ్యమంత్రీ మరో ముఖ్యమంత్రికి లేఖ రాసిన దాఖలాలు లేవు. అప్పుడప్పుడు రెండు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు జరగడం, అవి అసంపూర్తిగా పూర్తవడం. కృష్ణాజలాల విషయంలో కూడా ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు విచిత్రంగా వ్యవహరించి, పిలక తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి అందించారు. కేసీఆర్, జగన్మోహనరెడ్డి రెండు రాష్ట్రాల మధ్య సమస్య వున్న సమస్యల పరిష్కారం విషయంలో వ్యవహరించిన నిర్లక్ష్య ధోరణి గురించి చెప్పాలంటే పెద్ద గ్రంథం తయారవుతుంది కాబట్టి, ఆ గతాన్ని ఇక్కడితో కట్టిపెట్టి, వర్తమానంలోకి వద్దాం.

రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు రాసిన లేఖ రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో ఒక మంచి ముందడుగు అనే అభిప్రాయాన్ని రెండు రాష్ట్రాలకు చెందిన మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య జరిగే సమావేశంలో రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులతోపాటు, బాధ్యతాయుతమైన వ్యక్తులు కూడా పాల్గొని, కూలంకషంగా చర్చించి, పట్టువిడుపులు ప్రదర్శించి, రెండు రాష్ట్రాలకు సంబంధించిన వివాదాలకు చరమగీతం పాడతారని ఆశిస్తున్నారు.