డ్ర‌గ్స్, గంజాయి మాఫియా అంతం.. హోంమంత్రి అనిత పంతం

ఏపీలో గ‌డిచిన ఐదేళ్ల కాలంలో డ్ర‌గ్స్ మాఫియా రెచ్చిపోయింది. అంగ‌డిలో దొరికే వ‌స్తువులా డ్ర‌గ్స్, గంజాయిని మార్చేశారు. డ్ర‌గ్స్ మాఫియాకు ప్ర‌భుత్వం పెద్ద‌ల అండ‌దండ‌లు ఉండ‌టంతోపాటు.. మాఫియాలో భాగ‌స్వాములుగా కొంద‌రు వైసీపీ నేత‌లు ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీంతో గ‌డిచిన ఐదేళ్ల కాలంలో డ్ర‌గ్స్‌, గంజాయికి బానిస‌లై వేలాది మంది యువ‌తీయువ‌కులు, విద్యార్థులు త‌మ జీవితాల‌ను ఛిద్రం చేసుకున్నారు. దేశంలో ఎక్క‌డ డ్ర‌గ్స్ దొరికినా దాని మూలాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనే ఉంటూ వ‌చ్చాయి. స‌రిగ్గా ఎన్నిక‌ల స‌మ‌యంలో విశాఖ పోర్టులో భారీ డ్ర‌గ్స్ పట్టుబడటంతో  దేశం మొత్తం ఉలికిపాటుకు గురైంది. విశాఖ పోర్టులో 25 వేల కేజీల డ్రగ్స్‌ను సీబీఐ స్వాధీనం చేసుకుంది. దీని విలువ కొన్ని వేల కోట్లు ఉంటుంద‌ని అధికారులు అంచనా వేశారు. ముఖ్యంగా ప్ర‌శాంతంగా ఉండే విశాఖ ప‌ట్ట‌ణం కేంద్రంగా వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో డ్ర‌గ్స్, గంజాయి ర‌వాణా, విక్ర‌యాలు పెరిగాయి. ప్ర‌స్తుతం ఏపీలో ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలో రావ‌డం.. హోం మంత్రిగా వంగ‌ల‌పూడి అనిత బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంతో డ్ర‌గ్స్‌, గంజాయి మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ద‌మ‌య్యారు. అందుకు అనుగుణంగా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. డ్ర‌గ్స్‌, గంజాయి ర‌హిత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను దేశానికి ప‌రిచ‌యం చేసేందుకు ఆమె వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్నారు. 

హోంమంత్రి అనిత ఇటీవ‌ల విశాఖ సెంట్ర‌ల్ జైలును సంద‌ర్శించారు. గంజాయి కేసుల్లో జైలులో ఉన్న ఖైదీల‌ను ఆమె క‌లిశారు. అక్క‌డ ఖైదీలుగా ఉన్న‌వారిలో కొంద‌రినిచూసి ఆశ్చ‌ర్య‌పోయారు. అంతేకాదు.. రాష్ట్రంలో ఇంత దారుణ ప‌రిస్థితులు ఉన్నాయా అంటూ ఆవేద‌న‌ వ్య‌క్తం చేశారు. మైన‌ర్లు గంజాయి కేసుల్లో ఖైదీలుగా ఉన్నారు. వారిని మంద‌లించ‌గా.. డ్ర‌గ్స్‌, గంజాయిని స్మ‌గ్ల‌ర్లు చెప్పిన‌ చోటుకు చేర్చితే ఐదు, ప‌దివేలు ఇస్తార‌ని, అందుకే గంజాయిని త‌ర‌లించేందుకు ఒప్పుకునేవాళ్ల‌మ‌ని వారు చెప్పుకొచ్చారు. నిజంగానే వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో స్మ‌గ్ల‌ర్లు గంజాయి, డ్ర‌గ్స్ ప్యాకెట్ల‌ను ర‌వాణా చేసేందుకు మైన‌ర్ల‌ను ఉప‌యోగించారు. పేద కుటుంబాల్లోని మైన‌ర్ల‌ను టార్గెట్ గా చేసుకొని వారికి డ‌బ్బులు ఆశ‌జూపి డ్ర‌గ్స్‌, గంజాయిని స‌ర‌ఫ‌రా చేస్తూ వ‌చ్చారు. ప్ర‌భుత్వం, పోలీస్ యంత్రాంగానికి ఈ విష‌యం తెలిసినా.. స్మ‌గ్ల‌ర్ల‌ ఆగ‌డాల‌కు అడ్డ‌క‌ట్ట వేయ‌డానికి ఏ మాత్రం ప్రయత్నించలేదు. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం.. మాఫియాలో భాగ‌స్వాములుగా వైసీపీ ముఖ్య‌నేత‌లు ఉండ‌ట‌మేన‌ని గ‌తంలోనే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

వైసీపీ హ‌యాంలో రాష్ట్రంలో గంజాయి, డ్ర‌గ్స్ ర‌వాణా, విక్ర‌యాలు పెరిగాయ‌ని, వాటికి అడ్డుక‌ట్ట వేయాలంటూ అనేక‌ సార్లు పోలీసుల‌కు, ప్ర‌భుత్వానికి గ‌తంలో అనిత‌ విజ్ఞ‌ప్తులు చేశారు. ప్ర‌స్తుతం ఆమే హోం మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంతో డ్ర‌గ్స్‌, గంజాయి స్మ‌గ్లింగ్‌ను కూక‌టివేళ్ల‌తో పెకిలించేందుకు అధికార యంత్రాంగంతో క‌లిసి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల‌తో ఏపీలో గంజాయి లేకుండా చేసేందుకు పోలీస్‌శాఖ‌ న‌డుం బిగించింది. ఈ క్ర‌మంలో గంజాయికి సంబంధించిన స‌మాచారాన్ని పోలీసుల‌కు అందిస్తే వారికి న‌గ‌దు రివార్డు ఇస్తామ‌ని హోంమంత్రి అనిత బంప‌రాఫ‌ర్ ఇచ్చారు. అంతేకాదు, గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు టోల్ ఫ్రీ న‌వంబ‌ర్ ఏర్పాటు చేశారు. ఇటీవ‌ల విశాఖ సెంట్ర‌ల్ జైలును అనిత సంద‌ర్శించిన స‌మ‌యంలో జైలు సామ‌ర్థ్యం 800మంది ఖైదీలు అయితే.. దాదాపు రెండు వేల మంది ఖైదీలు ఉన్న‌ట్లు గుర్తించారు. అందులోనూ 1230 మంది గంజాయి కేసుల్లో ప‌ట్టుప‌డిన వారే కావ‌టంతో ఆమె ఆశ్చ‌ర్య‌పోయారు. అయితే, గంజాయి, డ్ర‌గ్స్ కేసుల్లో ప‌ట్టుబ‌డింది ఎక్కువ‌గా పేద కుటుంబాల‌కు చెందిన యువ‌కులే. వారిలోనూ అధికంగా మైన‌ర్లే ఉన్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం గ‌త ఐదేళ్ల కాలంలో ఏపీ ప్ర‌భుత్వ నిర్వాక‌మే.

జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎంగా ఉన్న ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో ఎక్క‌డా అభివృద్ధి జ‌ర‌గ‌లేదు. కేవ‌లం నెల‌నెలా పింఛ‌న్లు వేయ‌డానికే ఆయ‌న ప‌రిమితం అయ్యారు. వివిధ శాఖ‌ల‌కు సంబంధించి నిధుల‌ను సైతం పింఛ‌న్ల పంపిణీకి మ‌ళ్లించారు. దీంతో పేద వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ కోసం వివిధ శాఖ‌ల కింద ప్ర‌త్యేకంగా అందాల్సిన నిధులు వారి ద‌రికి చేర‌క‌పోవ‌టంతో పాటు.. వారు ప‌నులు చేసుకునేందుకు క‌నీసం ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించ‌డంలో జగన్ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంది. ముఖ్యంగా గిరిజ‌న గ్రామాల్లో యువకులు, మైన‌ర్ బాలురు కుటుంబాల పోష‌ణ కోసం ఐదు, ప‌దివేల‌కు గంజాయి, డ్ర‌గ్స్ ర‌వాణా చేయ‌డానికి సిద్ధ‌ప‌డ్డారు. వారి ఆర్థిక ప‌రిస్థితిని అవ‌కాశంగా తీసుకొని త‌మ వ్యాపారాన్ని స్మ‌గ్ల‌ర్లు ద‌ర్జాగా కొన‌సాగించారు. ఒక‌వేళ పోలీసులు దాడులు చేసినా ప‌ట్టుబ‌డిన వారిలో పేద కుటుంబాల‌ యువ‌కులు, మైన‌ర్లే ఉంటూ వ‌చ్చారు. ఆ విష‌యాన్ని ఆక‌ళింపు చేసుకున్న ప్ర‌భుత్వం.. డ్ర‌గ్స్, గంజాయి ర‌వాణా, త‌యారీ, విక్ర‌యాలు జ‌రిగే స‌మ‌యంలో త‌మ‌కు స‌మాచారం ఇస్తే న‌గ‌దు రివార్డు అందిస్తామ‌ని ప్ర‌క‌టించింది. దీనికితోడు.. గంజాయి త‌ర‌లించే స‌మ‌యంలో దొరికిన వారిపైనే కేసులు పెట్టి స‌రిపెట్ట‌కుండా.. వారి వెన‌క ఉన్న స్మ‌గ్ల‌ర్ల గుట్టును ర‌ట్టుచేసి, క‌ట‌క‌టాల పాలుచేసేందుకు హోం మంత్రి అనిత ఆధ్వ‌ర్యంలో పోలీస్ శాఖ చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు సిద్ధ‌మైంది. మొత్తానికి.. గత ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో ఏపీ డ్ర‌గ్స్‌, గంజాయికి కేంద్రంగా మార‌గా.. ప్ర‌స్తుత ప్ర‌భుత్వం గంజాయి, డ్ర‌గ్స్ ర‌హిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు వ‌డివ‌డిగా అడుగులు వేస్తుండ‌టంతో ఏపీ ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.