బెజవాడ ఈస్ట్రన్ బైపాస్ రోడ్డుకు గడ్కరీ గ్రీన్ సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరితో భేటీ అయ్యారు. ఈ భేటీ సుహృద్భావ వాతావరణంలో జరిగింది. చంద్రబాబు ప్రతిపాదనల పట్ల గడ్కరీ సానుకూలంగా స్పందించారు. చంద్రబాబుతో భేటీ తరువాత గడ్కరీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ  చంద్రబాబుతో భేటీలో  ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారులపై సమీక్షించినట్లు పేర్కొన్నారు.

అలాగే చంద్రబాబు కూడా  ట్విట్టర్ వేదికగా గడ్కరీతో జాతీయ రహదారుల ప్రాజెక్టుపై చర్చించినట్లు పేర్కొన్నారు. కాగా ఈ భేటీలో గడ్కరీ బెజవాడ ఈస్ట్రన్ బైపాస్ రోడ్డుకు అనుమతి ఇచ్చారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు.

అలాగే రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నుంచి నిడమానూరు వరకూ ఫ్లై ఓవర్ నిర్మాణానికి కూడా అనుమతిచ్చారని వెల్లడించిన కేశినేని చిన్ని.. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో ఇస్తానని గడ్కరి చెప్పారన్నారు.  కాగా, గడ్కరీతో సమావేశంలో చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు.