గులాబీ పార్టీ సన్ స్ట్రోక్ .. ప్లీనరీ వేదిక మార్పు?
posted on Mar 27, 2025 12:18PM

లక్షల మందితో వరంగల్‌లో ప్లీనరీ నిర్వహించి క్యాడర్‌లో జోష్ నింపాలని ఫిక్స్ అయింది గులాబీ పార్టీ. అయితే వారికి వాతావరణం, పరిస్థితులు అనుకూలించడం లేదంట. దాంతో సభను వాయిదా వేస్తే మరింత పరువు పోగొట్టుకోవాల్సి వస్తుందనీ, అందుకే సభాస్థలి మార్చడానికి ఫిక్స్ అయ్యారంట. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27కి పాతికేళ్లు అవుతుండటంతో సిల్వర్ జూబ్లీ వేడుకలను వైభవంగా నిర్వహించాలని ప్రణాళికలు రూపొందించింది. వరంగల్ లో సభను నిర్వహించేందుకు సిద్ధమైంది. వరంగల్ శివారులోని దేవన్నపేట, కోమటిపల్లిలో సభ నిర్వహణ పరిసరాలను సైతం నాయకులు పరిశీలించారు. అయితే ఎండల తీవ్రత, వరి కోతల టైమ్ కావడంతో వరంగల్ సభ సభకు జనాన్ని సమీకరించడం అసాధ్యమని పార్టీ అధిష్టానం భయపడుతున్నట్లు సమాచారం.
అందుకే సభా స్థలిని మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ ప్రాంతానికి షిఫ్ట్ చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ ప్రాంతం అయితే అన్ని జిల్లాలకు చెందిన ప్రజలు తరలివచ్చేందుకు రోడ్డు మార్గం సైతం అనుకూలంగా ఉంటుందని సభా స్థలాన్ని ఎంపిక చేసినట్లు తెలిసింది. త్వరలోనే అధికారంగా సభా స్థలి మార్పును ప్రకటిస్తారంట.
ఏప్రిల్ నెలలో ఎండలు ఎక్కువ. దీనికి తోడు వరికోతలు సైతం ముమ్మరంగా సాగుతాయి. రైతు జనమంతా వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతారు. దాంతో వరంగల్ అనుకూలంగా ఉండదని సభకు జనాన్ని తరలించడం కష్టమవుతుందని నేతలు నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ప్లీనరీ సభకు 5 లక్షలకుపైగా జనాన్ని తరలించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వరుస ఓటములతో నైరాశ్యంలో ఉన్న కేడర్ లో జోష్ నింపాలంటే సభను గ్రాండ్ సక్సెస్ చేయాలి. ఒక వేళ సభను సక్సెస్ చేయకపోతే క్యాడర్ మరింత నైరాశ్యంలో పడటంతో పాటు ..రాబోయే స్థానిక, మున్సిపల్ , కార్పొరేషన్ ఎన్నికలపైనా ఎఫ్టెక్ పడే ప్రమాదం ఉంది.
గ్రేటర్‌లో బీఆర్ఎస్‌కు పట్టుంది. 24 అసెంబ్లీ స్థానాల్లో 16 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించగా కంటోన్మెంట్ కు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో బీఆర్ఎస్ బలం15 స్థానాలకు చేరింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను పక్కన పెట్టినా గ్రేటర్లో గులాబీ పార్టీకి మెజార్టీ ఎమ్మెల్యేలున్నారు. దాదాపు అన్ని సెగ్మెంట్లలోనూ పార్టీకి క్యాడర్ ఉంది. సిల్వర్ జూబ్లీ వేడుకలకు గ్రేటర్ నుంచి జనాన్ని తరలించడం సులభం అవుతుందని పార్టీ అధిష్టానం భావించినట్లు తెలిసింది. జిల్లాల నుంచి ఆశించిన మేర రాకున్నా గ్రేటర్ నుంచి జనం వస్తే సభ భారీ సక్సెస్ అవుతుందని అంచనాకు వచ్చిందంట.
గ్రేటర్ లోని ప్రతి సెగ్మెంట్ నుంచి 10 నుంచి 20వేల మందిని తరలించేందుకు ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్‌లకు టార్గెట్ విధించాలని పార్టీ అధిష్టానం నిర్ణయానికి వచ్చిందంట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన నియోజకవర్గాలకు 5 వేలు టార్గెట్ పెట్టినా సరిపోతుందని లెక్కలు వేసుకుంటున్నారంట.
వరంగల్ బీఆర్ఎస్‌కి సెంటిమెంట్. ఉద్యమ కాలం నుంచి సందర్భం ఏదైనా తొలిసభ అక్కడి నుంచే నిర్వహిస్తూ వస్తున్నారు. అందుకే మొదట్లో వరంగల్ లో సభ నిర్వహించాలని భావించారు. గత ఏడాది సైతం ప్లీనరీ నిర్వహిస్తామని, భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని లీకులు ఇచ్చారు. కానీ సభ నిర్వహించలేదు. ఈ సారి సైతం నిర్వహిస్తామని సభకు హరీష్‌రావు స్ధల పరిశీలన కూడా చేశారు.
కానీ పార్టీ నేతల నిర్ణయం మేరకు జన సమీకరణకు అనుగుణంగా లేకపోవడం, భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని పార్టీ సీనియర్ నేతల అభిప్రాయం మేరకు మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ కు మార్చినట్లు సమాచారం. ఏదీ ఏమైనా పార్టీ సభ స్థలి మార్పు చేస్తున్నారనే ప్రచారం ప్రస్తుతం కేడర్ లో హాట్ టాపిక్ గా మారింది.