కేసీఆర్‌కి మరో రెండు షాకులు!

శుక్రవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కి డబుల్ షాకులు తగిలాయి. మొన్నటి వరకు కంఠంలో ప్రాణం వున్నంత వరకు కేసీఆర్‌తోనే వుంటానని కన్నీళ్ళు పెట్టుకుని మరీ చెప్పిన చేవెళ్ళ ఎమ్మెల్యే కాలె యాదయ్య ఇప్పుడు బీఆర్‌ఎస్‌ని ఖాళీ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీ వెళ్ళి, కాంగ్రెస్ పెద్దల ఆశీస్సులు తీసుకున్న యాదయ్య సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. యాదయ్య పార్టీ మారడమే పెద్ద షాక్ అనుకుంటే, ఇంతలోనే మరో షాక్ తగిలింది. బతికితే బీఆర్ఎస్‌లోనే.. చస్తే బిఆర్‌ఎస్‌లోనే అని పెద్దపెద్దగా చెప్పే పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కూడా ఢిల్లీ వెళ్ళి, కాంగ్రెస్ పెద్దల ఆశీస్సులు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. మహిపాల్ రెడ్డి మీద మూడురోజుల క్రితం ఈడీ దాడులు చేసిన సంగతి తెలిసిందే.