అలీ భాయ్.. జగన్ పార్టీకి గుడ్ బాయ్!
posted on Jun 28, 2024 8:31PM
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కమెడియన్ అలీ రాజీనామా చేశారు. గత కొన్నేళ్ళుగా ఆయన వైసీపీలో వున్నారు. ఆ పార్టీ కోసం తన సన్నిహితుడు పవన్ కళ్యాణ్‌కి కూడా దూరమయ్యారు. నిన్నటి ఎన్నికలలో పెద్దగా ప్రచారంలో పాల్గొనకపోయినా, ఏదో తూతూమంత్రంగా ప్రచారం చేశారు. ఎంపీగానో, ఎమ్మెల్యేగానో అలీ పోటీ చేసే అవకాశం వుందని మొదట్లో వార్తలు వచ్చినా, అది జరగలేదు.
ఏపీలో వైసీపీ దుకాణం సర్దేసిన నేపథ్యంలో అలీ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఒక వీడియో ద్వారా తెలియజేశారు. తాను రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్టు ప్రకటించారు. ‘‘నిర్మాత డి.రామానాయుడు గారి కోసం తెలుగుదేశం హయాంలో 1999లో నేను రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. ఆ తర్వాత పార్టీ మారాను. నేను రాజకీయాల్లో ఎప్పుడూ ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదు. పదిమందికీ సాయపడటం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. ప్రస్తుతం నేను ఏ పార్టీకి చెందిన మనిషిని కాదు’’ అని ఆ వీడియోలో చెప్పారు.