ఛీ.. ఇదీ ఒక ప్యాకేజీనా? జనం కామెంట్లు...
posted on Feb 10, 2015 11:02AM

అడ్డగోలు విభజన కారణంగా ఆర్థికంగా అనేక ఇబ్బందుల్లో పడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం భారీ స్థాయిలో సహకారాన్ని అందించాల్సి వుంది. విభజన కారణంగా ఆర్థికంగా పాతాళంలోకి పడిపోయిన ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం చెయ్యి అందించి పైకి తీసుకురావలసి వుంది. ఈ మేరకు కేంద్రం నుంచి ఎన్నోసార్లు హామీలు వచ్చాయి. అయితే ఆ హామీలు కార్యరూపంలోకి మాత్రం రావడం లేదు. మొన్నీమధ్య మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 850 కోట్లు ప్యాకేజీ రూపంలో ప్రకటించింది. ఈ ప్యాకేజీని ప్రకటించిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ని తానేదో ఉద్ధరించేస్తున్నట్టు కేంద్రం పోజులు కొట్టింది. అయితే ఎంగిలి చేత్తో కాకిని విసిరినట్టు వున్న ఆ ప్యాకేజీ తెలుగువారి కడుపు మంటను మరింత పెంచేలా వుంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో వున్న తెలుగుదేశం పార్టీ బీజేపీతో తనకున్న మిత్రబంధాన్ని దృష్టిలో పెట్టుకుని తన వ్యతిరేకతను బాహాటంగా వ్యక్తం చేయలేదు. అయితే తెలుగు ప్రజలు మాత్రం కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని పోస్టుమార్టం చేస్తున్నారు. కేంద్రానికి చెప్పుదెబ్బలా తగిలే కామెంట్లు పెడుతున్నారు. ఆ కామెంట్లు మీరూ చూడండి...
1. సి.ఎమ్ రిలీఫ్ ఫండ్ కన్నా తక్కువ.
2. ప్రత్యేక ప్యాకేజీ గురించి ఏడాదిగా పత్రికలలో రాసిన పేపర్ ప్రింట్ ఖర్చు కన్నా తక్కువే.
3. సీఎం చంద్రబాబు తన గుంపును వెంట వేసుకుని ఢిల్లీ కి వెళ్ళిన ప్రయాణ ఖర్చులు కూడా రాలేదు.
4. దూకుడు , గబ్బర్ సింగ్ , అత్తారింటికి దారేది సినిమా వసూళ్ళ కన్నా తక్కువ.
5. ఏపీ ఎన్జీఓల ఒక్కరోజు జీతం కన్నా తక్కువ.
6. కేసీఆర్ వాస్తు మార్పుల ఖర్చు పెట్టే దానికన్నా తక్కువే.
7. ఈ పేకేజీ మొత్తం, ఒక్క సంవత్సరం మోడీ బట్టల ఖర్చు కు సరిపోతుంది.
8. జగన్ నెల ఓదార్పు యాత్రలో ఖర్చు పెట్టే దానికన్నా తక్కువ.
9. ఇందులో వింతేముంది, మోసపోవడం ఆంధ్ర ప్రజలకు అలవాటే.
10. అహ్మదాబాద్ కు 60 వేల కోట్ల బుల్లెట్ ట్రైన్ , ఆంధ్ర కు 350 కోట్లు. మోడీ నువ్వు దేవుడివి.
11. కాంగ్రెస్ గుడ్డలూడదీసింది ... బిజెపి గోచీ కూడా కొట్టేసింది ..
12. చాలా ఎక్కువ ఇచ్చేశారేమో.. ఒక్కసారి సరిచూసుకోండి.
13. ఆంధ్రకు ప్యాకేజీ అడిగితే తెలంగాణకు ప్యాకేజ్ ఇచ్చారు ఆంధ్రకు ఇవ్వకపోవడమే తెలంగాణకు పెద్ద ప్యాకేజీ.
14. దీనిని తీసుకోవడం కన్నా ఈ సొమ్మునే ఆంధ్ర తరఫున ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్‌కు, రక్షణ శాఖకు ఇచ్చేస్తే మంచిది.
15. ధోనీ, సచిన్ సంపాదన కన్నా తక్కువ.
16. ఆంధ్ర ప్రజలు ఒకరోజు ఉపవాసం చేస్తే దీనికి 10 రెట్లు వస్తుంది.
17. సంక్రాంతికి ఇచ్చిన చంద్రన్న కానుకే బెటర్.
18. ఈ మాత్రం పన్ను రాయితీని వ్యాట్‌లో రాష్ట్రమే ఇవ్వగలదు, ఇక కేంద్రంతో పనేమిటి.
19. ఒక జిల్లా ఎన్నికల ఖర్చు కన్నా చాలా తక్కువ.
20. తెలుగు సినీ పరిశ్రమ జోలె పడితే ఇంతకన్నా ఎక్కువ వస్తుంది.
21. ఆంధ్ర నుండి తెలంగాణ కొట్టేసే నెలసరి కరెంటు కన్నా తక్కువే.
22. ప్యాకేజీ వివరాలు తెలుసుకుని బ్రాహ్మీకి పిచ్చి పట్టింది, సుత్తి వీరభద్ర రావు బట్టలు చింపుకున్నాడు.
23. కేజీ బేసిన్ లో కేంద్రం ఒక్కరోజులో కొట్టేసే దానికన్నా చాలా తక్కువ.
ఏ ప్రభుత్వమైనా రాజకీయ పార్టీలతో ఆడుకోగలదు.. కానీ ప్రజలతో కాదు... ప్రజల గొంతు నొక్కడం ఎవరి తరమూ కాదనడానికి ఈ కామెంట్లే ఒక పెద్ద ఉదాహరణ.