జై తెలుగుదేశం నినాదం.. కమలదళానికి బలం...!

ఆంధ్రప్రదేశ్ లో  బీజేపీకి సొంత బలం లేదు. ఆ విషయం ఇప్పటికే ఎన్నోసార్లు సందేహాలకు అతీతంగా రుజువైంది. ఆ పార్టీ తెలుగుదేశం పార్టీతో  కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపించుకోగలిగింది. జాతీయ పార్టీగా తన బలానికి మించిన సీట్లను కూడా బేరమాడి సాధించుకోగలిగింది. అలా పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్లిన ప్రతి సారీ ఆ పార్టీ స్కోర్ బిగ్ జీరోయే. అందుకే ఇప్పుడు బీజేపీ రాష్ట్రంలో తెలుగుదేశం బలమే తన బలం అనుకుని సర్దుకు పోతున్నట్లు కనిపిస్తోంది. అలవికాని చోట అధికులమనరాదన్న సూక్తిని అక్షరాలా పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక వర్గంలో రాష్ట్రం నుంచి బీజేపీ కోటా కింద ఒకే ఒక్కరినే నియమించినా బీజేపీ నుంచి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. సరికదా అదే మహాప్రసాదం అన్నట్లుగా ఆనందంతో తబ్బిబ్బు అవుతోంది. అసలు రాష్ట్రంలో బీజేపీ స్టేక్ కోరుకోవడం లేదు. తెలుగుదేశం మిత్రపక్షంగా సంసారపక్షంగా సర్దుకు పోవడమే మేలని భావిస్తోంది. దక్షిణాదిలో బలపడాలన్న తన ఆకాంక్ష నెరవేరాలంటే, కేంద్రంలో మోడీ సర్కార్ సజావుగా సాగాలంటే.. ఏపీలో వేలు పెట్టకపోవడమే మేలన్న నిర్ణయానికి వచ్చేసింది.  అయితే బీజేపీ ఈ నిర్ణయానికి రావడానికి వెనుక పదేళ్ల కథ, వ్యథ ఉన్నది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత 2014లో జరిగిన ఎన్నికలలో రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికలలో తెలుగుదేశం, బీజేపీ కలిసి పోటీ చేయగా, బయట నుంచి జనసేన మద్దతు ఇచ్చింది. ఆ ఎన్నికలలో తెలుగుదేశం, బీజేపీ కూటమి విజయం సాధించి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. అలాగే కేంద్రంలో కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ లో తెలుగుదేశం చేరింది.  

అయితే  విభజిత ఆంధ్రప్రదేశ్ ను బీజేపీ తన రాజకీయ ప్రయోగశాలగా మార్చుకుంది. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా ఉండి కూడా విపక్ష పార్టీతో చేతులు కలిపింది. రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి అన్ని విధాలుగా చేయూత నివ్వాల్సిన కేంద్రం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని దగా చేసింది. విభజన హామీలు నెరవేర్చడం అటుంచి.. రాష్ట్ర ప్రగతికి అడుగడుగునా అడ్డుపడుతూ వచ్చింది. అప్పటి  ప్రతిపక్ష  వైసీపీకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ.. 2019 ఎన్నికలలో ఆ పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు దోహదం చేసింది. మోడీ సర్కార్ పేరుకే ఎన్డీయే ప్రభుత్వమైనా.. మిత్రపక్షాలను ఏనాడూ లెక్క చేసిన పాపాన పోలేదు. అన్నిటికీ మించి తన చిరకాల మిత్రుడైన తెలుగుదేశం పార్టీ పట్ల ఒక విధమైన కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించింది. 

చిరకాల మిత్రుడని ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. వాజ్ పేయి హయాంలో తెలుగుదేశం బీజేపీకి అత్యంత విశ్వాస పాత్రమైన మిత్రపక్షం. ఆ పార్టీ అధినేత, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అత్యంత విశ్వాసపాత్రుడైన మిత్రుడు. వాజ్ పేయి హయాంలో తెలుగుదేశం, బీజేపీల మధ్య పరస్పర గౌరవం, విశ్వాసం మెండుగా ఉండేవి. మిత్ర ధర్మం పాటించే విషయంలో రెండు పార్టీలూ ఒకదానితో ఒకటి పోటీ పడేవి. అయితే అది వాజ్ పేయి హయాం. మోడీ హయాం వచ్చే సరికి ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.  మోడీ హయాంలో మిత్రపక్షాలను గౌరవం ఇవ్వడం అటుంచి ఏ మాత్రం అవకాశం చిక్కినా వాటిని కబలించడానికి లేదా బలహీన పరచ డానికి వెనుకాడని పరిస్థితి నెలకొంది. 

మరీ ముఖ్యంగా ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా లేని ఆంధ్రప్రదేశ్ లో బలమైన ప్రభుత్వం, దార్శనికత, ప్రజాభిమానం మెండుగా ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం బీజేపీకి రుచించలేదు. అందుకే  ఎన్డీయే కూటమి నుంచి తెలుగుదేశం బయటకు వెళ్లే వరకూ నానా రకాలుగా ఇబ్బందులు పెట్టింది. విభజన హామీల మాట అటుంచి రాష్ట్రానికి న్యాయంగా రావలసిన నిధులను కూడా విడుదల చేయకుండా వేధించింది. సరే చివరికి తెలుగుదేశం ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చేసింది.  సరే 2019 ఎన్నికలలో రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ నోటాతో పోటీ పడి ఓట్లు తెచ్చుకుంది.  అయినా  కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని, రాష్ట్రంలో చక్రం తిప్పేందుకు బీజేపీ ఢిల్లీ పెద్దలు రాష్ట్ర నేతలు పావులు కదిపింది. ఆ ఎన్నికలలో తెలుగుదేశం కూడా పరాజయం పాలై విపక్షానికి పరిమితమైంది. ఆర్థిక  కేసులలో నిండా మునిగి ఉన్న వైసీపీ అధినేత జగన్ పార్టీ వైసీపీ విజయం సాధించి అధికార పగ్గాలు అందుకుంది. దీంతో బీజేపీ జగన్ ను గుప్పిట ఉంచుకుని తెలుగుదేశం పార్టీని బలహీన పరచడమే ధ్యేయంగా పావులు కదిపింది.  అందులో  భాగంగానే, బీజేపీ జాతీయ నాయకత్వం  ఓ వంక ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని కేసుల నుంచి రక్షిస్తూ మరో వంక వైసేపీ సర్కార్  బుజం మీద తుపాకీ పెట్టి టీడీపీని బలహీనం చేసే కుట్రలు చేసింది. లేదా ఆ కుట్రలకు వత్తాసు పలికింది.  

అయితే 2024 ఎన్నికల నాటికి బీజేపీకి వాస్తవం బోధపడింది. వైసీపీ అరాచక అస్తవ్యస్థ పాలన పట్ల ప్రజాగ్రహాన్ని గ్రహించి తెలుగుదేశంతో జట్టు కట్టింది. ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు ఏకపక్షంగా తెలుగుదేశం కూటమికి పట్టం గట్టారు. దీంతో తత్వం బోధపడిన బీజేపీ రాష్ట్రంలో సొంతంగా బలోపేతం అన్న అంశాన్ని పక్కన పెట్టేసి, తెలుగుదేశం మద్దతుతో కేంద్రంలో అధికారాన్ని పదిలపరుచుకుంటే చాలన్నట్లు వ్యవహరిస్తున్నది.