పవన్ వ్యాఖ్యలపై పరిణితితో స్పందించిన అనిత!.. వివాదమేమీ లేదని చాటిన మంత్రి నారాయణ

పిఠాపురం పర్యటనలో  ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూటమి పార్టీల్లోనూ, ప్రభుత్వంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. కేబినెట్ లో సహచర మంత్రిపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం కూటమి సర్కార్ కు ఇబ్బందికరంగా పరిణమించాయనడంలో సందేహం లేదు.  రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితికి రాష్ట్ర హోంమంత్రిగా అనిత బాధ్యత వహించాలంటూ చేసిన వ్యాఖ్యలు, రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే  మీరు ఏం చేస్తున్నారు?  అంటూ సంధించిన ప్రశ్నలూ ఒక అనితనే కాక మొత్తం తెలుగుదేశం కూటమి ప్రభుత్వ పని తీరును ప్రశ్నించడంగానే భావించాల్సి ఉంటుంది. ఆ ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ కూడా భాగమే.   అటువంటి పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో  అవసరమైతే తాను హోంమంత్రి బాధ్యతలు చేపడుతానని హెచ్చరించడం సీఎం చంద్రబాబు తీరును కూడా ఎత్తి చూపినట్లుగానే పరిశీలకులు భావిస్తున్నారు.  
పవన్ కల్యాణ్ వ్యాఖ్యల కారణంగా కూటమి ప్రభుత్వానికి ఏర్పడిన ఇబ్బందిని అధిగమించడానికి చంద్రబాబు రంగంలోనికి దిగుతారు. ఆయన పరిణితి, విభేదాల పరిష్కారం నేర్పు తెలియంది కాదు. 
అయితే ఇక్కడ చెప్పుకోవలసింది పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించిన తీరును. ఎంతో పరిణితితో, అంతకు మించిన హుందా తనంతో ఆమె పవన్ వ్యాఖ్యలను స్వీకరించారు.

వంగలపూడి అనిత ఎంత ఫైర్ బ్రాండ్ లీడరో అందరికీ తెలిసిందే. జగన్ అరాచక పాలనను వ్యతిరేకంగా ఆమె ఎంత గట్టిగా పోరాడారో తెలియంది కాదు. అటువంటి వంగలపూడి అనిత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఎంతో పాజిటివ్ గా తీసుకున్నారు. ఆయన మాట్లాడిన మాటలన్నీ వాస్తవాలేనని తనకు తెలుసునన్నారు. పవన్ కల్యాణ్ దేని గురించి మాట్లాడుతున్నారో తనకు తెలుసున్నారు. వాటిపై తాము చర్చించామన్నారు. ముఖ్యమంత్రితో రాష్ట్రంలో పరిస్థితుల గురించి తాను జరిపిన చర్చలలో పవన్ కల్యాణ్ కూడా ఉన్నారని చెప్పిన అనిత.. రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దడానికి అవసరమైన అన్ని చర్యలూ త్వరలోనే తీసుకుంటామని చెబుతూనే తప్పు  చేసిన ఎవరినీ వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ మాటల్లో రాజకీయాలు లేవని చెప్పడం ద్వారా అనిత తన పరిణితిని చాటుకున్నారు. పవన్ కల్యాణ్ అవేశంతో అనాలోచితంగా అంతర్గతంగా చర్చించుకోవలసిన అంశాలపై బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తే.. ఎంతో పరిణితితో అనిత వాటిని పాజిటివ్ గా తీసుకుని చర్యలు తీసుకుంటానని చెప్పారు. 

అయితే.. పవన్ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్నిలేపాయనడంలో సందేహం లేదు. ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. తెలుగుదేశం, జనసేన సఖ్యత చెడిందా అన్న అనుమానాలూ వ్యక్తమయ్యాయి. అయితే పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలలో తప్పేముందని మంత్రి నారాయణ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏదైనా శాఖ సరిగా పని చేయడం లేదని అనిపిస్తే  ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్పందిస్తారని అందులో తప్పేముందని ప్రశ్నించారు. వారి స్పందన వల్ల ఆ శాఖలు అలర్ట్ అవుతాయని అన్నారు.  రాష్ట్రంలో ఇటీవల మహిళలు, బాలికలపై జరిగిన అఘాయి త్యాలపై పవన్ కల్యాణ్ స్పందించారనీ, కొన్ని సంఘటనలలో పోలీసులు వేగంగా స్పందించలేదని ఆయన అన్నారు. ఆయన హెచ్చరికలతో పోలీసు శాఖ అప్రమత్తమౌతుందని నారాయణ వివరించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఎంత మాత్రం వివాదాస్పదం కావని స్పష్టం చేశారు. అలాగే కూటమి పార్టీలలో ఎలాంటి విభేదాలూ లేవని క్లారిటీ ఇచ్చారు.