మళ్లీ పాదయాత్రా జగన్.. జనం పారిపోతారు జాగ్రత్త!
posted on Nov 5, 2024 11:40AM
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారా.. వచ్చే నాలుగేళ్లు పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఉండేందుకు సిద్ధమవుతున్నారా..? అన్న ప్రశ్నలకు వైసీపీ వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. 2019 ఎన్నికలకు ముందు జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం తనను ఇబ్బందులకు గురిచేస్తున్నదని, కాంగ్రెస్ తో కుమ్మక్కై తనపై చంద్రబాబే కేసులు పెట్టించారంటూ ప్రజల ముందు జగన్ కన్నీరు పెట్టుకున్నంత పని చేశారు. తద్వారా ప్రజల్లో సానుభూతిని పొందారు. సాధారణంగా ఏ రాజకీయ నాయకుడు పాదయాత్ర చేసినా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, అండగా ఉంటానని ప్రజలకు భరోసా ఇస్తారు. కానీ, గతంలో జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర కేవలం ప్రజల్లో సానుభూతి పొందేందుకు మాత్రమే సాగింది. పాదయాత్రలో తనను కలిసిన వారి బుగ్గలపై ముద్దులు పెడుతూ, బుగ్గలు నిమురుతూ జగన్ పాదయాత్రను కొనసాగించారు. అంతేకాక.. వైసీపీ అధికారంలోకి వస్తే అద్భుత పాలన అందిస్తానని హామీలు గుప్పించారు. ఒక్క చాన్స్ ఒకే ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ ప్రజలను వేడుకున్నారు. జగన్ మాయమాటలను నమ్మిన ప్రజలు ఆ ఒక్క చాన్స్ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డికి పట్టం కట్టారు.
వైసీపీ అధికారంలోకి రావడంతో ఏపీ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని భావించిన ప్రజలకు సీఎం పీఠం అదిరోహించిన తరువాత జగన్ మోహన్ రెడ్డి తన విశ్వరూపాన్ని చూపించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులకే ప్రజావేదిక భవనాన్ని కూల్చేశారు. అక్కడి నుంచి రాష్ట్రంలో అరాచక పాలనను జగన్ మెదలు పెట్టారు. అమరావతి రాజధానిని పక్కన పెట్టేసి మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట మొదలెట్టారు. విశాఖ కేంద్రంగా పాలన సాగిస్తానని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. జగన్ హయాంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలపై దాడులు చేశారు. మరోవైపు.. పలువురు టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టించి జైళ్లకు పంపించారు. కొందరు పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరించారు. అలాగే జగన్ అరాచక పాలనను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం జైళ్లకు పంపించడం వైసీపీ ఐదేళ్ల పాలనలో నిత్యకృత్యంగా మారింది. రాష్ట్రంలో అభివృద్ధి మరిచి కేవలం దోపిడీ చేయడానికే అధికారంలోకి వచ్చామన్నట్లుగా జగన్ ఆయన పార్టీ నేతలు వ్యవహరించారు.
అధికారం కోసం పాదయాత్ర చేసి, ప్రజలకు ముద్దులు పెట్టి బుగ్గలు నిమిరిన జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత జనం మొహం చూడటానికి కూడా ఇష్టపడలేదు. తాడేపల్లి ప్యాలెస్ విడిచి బయటకు వచ్చిన ప్రతిసారీ దారి పోవవునా పరదాలు కట్టుకుని తిరిగారు. జనం సమస్యలు పట్టించుకోవడం, పరిష్కరించడం మాట అటుంచి సమస్యలు వినడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. నిలదీసిన వారిపై దాడులు, దౌర్జన్యాలతో వైసీపీయులు రెచ్చిపోయారు. జగన్ పాలనలో సమాజంలోని ఏ వర్గం సంతోషంగా, భద్రంగా లేని పరిస్థితి నెలకొంది. ఇదేళ్ల పాటు పంటి బిగువున జగన్ అరాచక, దుర్మార్గ పాలనను భరించిన జనం 2024 ఎన్నికలలో గట్టి షాకిచ్చారు. కసిగా ఓటేసి జగన్ పార్టీని ఘోరంగా ఓడించారు. కనీసం ప్రతిపక్ష హోదానుకూడా వైసీపీకి ఇవ్వలేదు.
ఇప్పుడు తెలుగుదేశం కూటమి అధికారంలో ఉంది. దీంతో జగన్ లో భయం మొదలైంది. ఐదేళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకొని అవినీతికి పాల్పడిన వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం వరుసగా కేసులు నమోదు చేస్తున్నది. తెలుగుదేశం ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే పలువురు వైసీపీ నేతలను పోలీసులు అరెస్టుచేయగా.. మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం హయాంలో చంద్రబాబు, పవన్, నారా లోకేశ్ పై ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేసిన వారిపైనా కూటమి ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. మరో వైపు ఎన్నికల్లో దారుణ ఓటమి తరువాత కూడా జగన్ మోహన్ రెడ్డి క్రూరమైన మైండ్ సెంట్ లో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం, జనసేన పార్టీల్లో చేరగా.. మరికొందరు వైసీపీ నేతలు రాజీనామాలు చేసి కూటమి పార్టీల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంకా చాలా మంది నేతలు కూడా పార్టీకి రాంరాం చెప్పేందుకు రెడీగా ఉన్నారన్న చర్చ వైసీపీలో జోరుగా సాగుతోంది. మరోవైపు చెల్లి షర్మిల, తల్లి విజయమ్మతో ఆస్తి విబేధాలు జగన్ కు పెద్ద తలనొప్పిగా మారాయి. దీనికితోడు జగన్ పై పాతకేసుల్లో బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం వైసీపీ హయాంలో అవినీతిపై జగన్ పై కేసులు నమోదు అయ్యే అవకాశాలూ పుష్కలంగా ఉన్నాయి.
దీంతో జగన్ ను జైలు భయం వెంటాడుతోంది. తన అరెస్టుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసే నాటికి పాదయాత్ర పేరుతో ప్రజల మధ్య ఉండాలని జగన్ భావిస్తున్నారన్న వైసీపీ వర్గాల్లో చర్చజరుగుతున్నది. పాదయాత్రలో ఉండగా అరెస్టు చేస్తే సానుభూతి వస్తుందని, తద్వారా వచ్చే ఎన్నికల నాటికి కాస్తో కూస్తో మేలు జరుగుతుందని జగన్ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి పాదయాత్ర ప్రారంభించి.. వీలున్నప్పుడల్లా పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లొచ్చని జగన్ భావిస్తున్నారట. మొత్తానికి మళ్లీ ప్రజల్లో సానుభూతి పొందేందుకు జగన్ పాదయాత్రను ఎంచుకున్నట్లు ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. అయితే, గతంలోలా ప్రజలు జగన్ ను ఆహ్వానించే పరిస్థితి కనిపించడం లేదు. వైసీపీ హయాంలో జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనను రుచి చూసిన ప్రజలు.. ఈ సారి పాదయాత్ర అంటూ తమ వద్దకు వస్తే ఆహ్వానించడం సంగతి అటుంచి అంటేనే ప్రజలు ఆమడదూరం పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.