ముందుకు వస్తారా? ముఖం చాటేస్తారా?
posted on Nov 5, 2024 1:29PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయి అన్న విషయం బీఏసీ సమావేశం నిర్ణయిస్తుంది. అయితే ఓ పది రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏ పీ అసెంబ్లీ, మండలి సమావేశాల నోటిఫికేషన్ ను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ జారీ చేశారు. ఈ సమావేశాలలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. రాష్ట్ర విత్తమంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెడతారు. పలు కీలక బిల్లులను అసెంబ్లీలో ప్రవేశ పెట్టి సభ ఆమోదం పొందాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉంది. వీటిలో చట్ట సవరణలకు సంబంధించిన బిల్లులు కూడా ఉంటాయంటున్నారు.
అయితే వీటన్నిటికంటే ఏపీ అసెంబ్లీ సమావేశాలు అనగానే అందరి ఆసక్తీ ఆ 11 మంది ఎమ్మెల్యేలపైనే ఉంది. ఆ పదకొడు మంది ఎమ్మెల్యేలూ సభకు హాజరౌతారా? డుమ్మా కొడతారా? అన్న ఆసక్తి రాజకీయవర్గాలలోనే కాదు.. సామాన్య జనంలో కూడా ఉంది. ఇంతకీ ఆ 11 మంది ఎమ్మెల్యేలూ ఎవరనుకుంటున్నారా... వాళ్లే వైసీపీ ఎమ్మెల్యేలు.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మర్యాద ఇవ్వడమే కాదు.. తీసుకోవడమూ రాదని ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి అసెంబ్లీకి వచ్చిన రోజే తేలిపోయింది. గైర్హాజరైతే ఉన్న ఎమ్మెల్యే గిరీ కూడా పోతుందన్న ఒకే ఒక్క కారణంతో ఆయన ఆ రోజు అసెంబ్లీకి వచ్చారు. ఆయన విజ్ణప్తికి సానుకూలంగా స్పందించిన చంద్రబాబు ఆ నాడు జగన్ కు అర్హత లేకపోయినా, ఆయన కారును అసెంబ్లీ గేటు లోపలికి అనుమతించారు. అక్షర క్రమంతో సంబంధం లేకుండా ముందుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాన్ని కూడా కల్పించారు. అయినా ఆ మర్యాద, గౌరవం నిలబెట్టుకోవడం తెలియని జగన్ పులివెందుల ఎమ్మెల్యేగా ఇలా ప్రమాణ స్వీకారం చేసి.. అలా వెళ్లిపోయారు. కనీసం తన పార్టీ సభ్యుల ప్రమాణ స్వీకారం వరకూ కూడా కూర్చోలేదు. పోనీ అది పక్కన పెట్టినా.. మంత్రుల కంటే ముందు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వలేదంటూ.. బయటకు వెళ్లి విమర్శలు గుప్పించారు. దీనిని బట్టే ఆయనకు అసెంబ్లీలో కూర్చునే ఉద్దేశం లేదని అవగతమైపోతున్నది.
రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యపై హస్తిన వెళ్లి మరీ ధర్నా చేసి వచ్చిన జగన్.. అదే సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించే ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారన్న ప్రశ్నకు ఆయన వద్ద సమాధానం ఉందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి జగన్ రెడ్డికి అసెంబ్లీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ ఆయన పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరౌతారా, డుమ్మా కొడతారా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.