అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. చివరి క్షణంలో సోషల్ మీడియా ద్వారా ట్రంప్, బైడెన్ ప్రచారం!
posted on Nov 5, 2024 9:53AM
అమెరికా అధ్యక్ష ఎన్నికలు మంగళవారం (నవంబర్ 5) జరుగుతున్న సంగతి తెలిసందే. ఈ ఎన్నికలలో 24.5 కోట్ల మంది అమెరికన్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారిలో ఇప్పటికే ముందస్తు ఓటింగ్ ద్వారా 7.5 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి హోరాహోరీగా సాగుతున్న సంగతి తెలిసిందే. సర్వేలు, ఒపీనియన్ పోల్స్ కూడా ఈ ఎన్నికలలో విజయం ఎవరిని వరిస్తుందన్న విషయంలో ఇతమిథ్ధంగా చెప్పలేకపోయాయి. ఎన్నికల ఫలితాలను నిర్దేశించే స్వింగ్ స్టేట్స్ లో కూడా స్వింగ్ కమలా హారిస్, ట్రంప్ లలో ఎవరివైపు ఉందన్నది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఈ క్రమంలో ఎన్నికల ప్రారంభానికి ముందు, అంటే చివరి క్షణంలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, అలాగే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లు ఓటర్లను ఉద్దేశించి వేర్వేరుగా పెట్టిన పోస్టులలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అభ్యర్థించారు.
డెమెక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ పై విజయం సాధించడం ఖాయమంటూ తన పోస్టులో పేర్కొన్న జోబైడెన్.. అందుకు మీరంతా ఓటు వేయాలని కోరారు. ముందుస్తు ఓటు వేయని ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
ఇక డోనాల్డ్ ట్రంప్ అయితే అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా తీర్చిదిద్దుకుందామని, అందు కోసం మీరంతా ముందుకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ అధికారంలోకి వస్తే పశ్చిమాసియా ఆక్రమణకు గురవుతుంది. ఆమె మూడో ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభిస్తారని ట్రంప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. శాంతిని పునరుద్ధరించడం కోసం తనకే ఓటు వేయాలని అభ్యర్థించారు.