మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు హైకోర్టులో చుక్కెదురు

వైసీపీ నేత, మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు హైకోర్టులో చుక్కెదురైంది. విలేకరి హత్య కేసులో ముందస్తు బెయిలు కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. తుని నియోజకవర్గం తొండంగి మండలంలో 2019 ఆగస్టులో జరిగిన విలేకరి హత్య కేసులో దాడిశెట్టి రాజా నిందితుడు. హతుడు సత్యనారాయణ 2019 ఆగస్టు 15న  అన్నవరంలోని తన నివాసానికి వెళుతుండగా లక్ష్మీదేవి చెరువుగట్టుపై దుండగులు అడ్డగించి, కత్తులతో నరికి చంపారు.

ఆ హత్య సూత్రధారి వైసీపీ నేత దాడిశెట్టి రాజా అంటూ మృతుడి కుటుంబీకులు ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు దాడిశెట్టి రాజాతో పాటు మరో ఆరుగురిపై చార్జిషీట్ నమోదు చేశారు. అయితే జగన్ అప్పట్లో తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఆ పునర్వ్యవస్థీకరణలో దాడిశెట్టి రాజాను కేబినెట్ లోకి తీసుకున్నారు. దాడిశెట్టి రాజీ మంత్రి అయిన తరువాత ఆయనపై ఉన్న కేసు ముందుకు సాగలేదు.  2023లో దాడిశెట్టి రాజా పేరును చార్జిషీట్ నుంచి తొలగించారు. 

దీంతో హతుడు సత్యనారాయణ సోదరుడు యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ను కలిసి న్యాయం చేయాల్సిందిగా కోరారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత తప్పకుండా న్యాయం చేస్తానని అప్పట్లో లోకేష్ హామీ ఇచ్చారు. అన్నట్లుగానే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన పేరును చార్జిషీట్ లో నమోదు చేశారు. దీంతో దాడిశెట్టి రాజీ ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. హై కోర్టు ఆయన పిటిషన్ ను తిరస్కరించింది. ఇక దాడిశెట్టి రాజా అరెస్టు లాంఛనమే.