రొమాంటిక్ దర్శకుడితో 'బింబిసార-2' ప్రకటన!

2022 లో వచ్చిన 'బింబిసార' సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించిన ఈ ఫాంటసీ ఫిల్మ్.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని ఘన విజయం సాధించింది. విడుదలకు ముందే, ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. కానీ వశిష్ట అనూహ్యంగా మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర'తో బిజీ అయ్యాడు. దీంతో ఇక 'బింబిసార-2' ఉండదనే కామెంట్స్ వినిపించాయి. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి ముహూర్తం కుదిరింది.

'బింబిసార-2' ప్రాజెక్ట్ నుంచి వశిష్ట తప్పుకున్నాడని, దాంతో ఆయన స్థానంలో మరో దర్శకుడితో సినిమా చేయడానికి కళ్యాణ్ రామ్ ప్లాన్ చేస్తున్నాడని గతంలో వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలే నిజమవుతున్నాయి. 'బింబిసార'కి వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ గా వ్యవహరించిన అనిల్ పాడూరికి ఈ మూవీ సీక్వెల్ బాధ్యతలను కళ్యాణ్ రామ్ అప్పగించాడు. గతంలో అనిల్ దర్శకత్వంలో 'రొమాంటిక్' అనే మూవీ రాగా, అది పరాజయం పాలైంది. అయినప్పటికీ ఆయన ప్రతిభని, వీఎఫ్ఎక్స్ పట్ల ఆయనకున్న పట్టుని చూసి 'బింబిసార-2' కి దర్శకుడిగా అనిల్ ని ఎంపిక చేసినట్లు సమాచారం. కళ్యాణ్ రామ్ పుట్టినరోజు(జూలై 5) సందర్భంగా ఈ చిత్రాన్ని రేపు అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే 'బింబిసార-2' కి వశిష్టనే కథ అందించినట్లు టాక్. చిరంజీవి సినిమా ఆఫర్ రావడంతోనే.. సీక్వెల్ కి దర్శకత్వం చేయలేనని చెప్పాడని అంటున్నారు.