జాతీయోద్యమ శక్తి లోకమాన్య తిలక్!

బాలగంగాధర తిలక్. భారతజాతీయ ఉద్యమ పితామహునిగా పేరు పొందిన ఈయనను అందరూ లోకమాన్య అనే బిరుదుతో పిలుస్తారు. భారత జాతీయోద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించడంలోనూ, సామాన్య ప్రజలను ఆ ఉద్యోమంలో చురుగ్గా పాల్గొనేలా చేయడంలోనూ గొప్ప పాత్ర పోషించినవాడు లోకమాన్య తిలక్. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా భారతదేశంలో నీకున్న అశాంతికి కారణం ఆయనేనని, ఆయన వల్లనే బ్రిటిష్ వారి మీద భారతీయుల మనసులో పోరాట స్థాయి ఏర్పడటం కానీ, అది పెరగడం కానీ జరిగిందని చెబుతారు.

బాలగంగాధర్ తిలక్ 1856 జులై 23 వ తేదీన జన్మించాడు. ఈయన తండ్రి సంస్కృత పండితుడు, ఉపాద్యాయుడు. అందువల్ల చిన్నతనం నుండి చదువు విషయంలో మంచి అవగాహన ఉండేది. గణితశాస్త్రంలో ఈయనకు మంచి ప్రతిభ ఉండేది. తిలక్ జీవితంలో ఒక గొప్ప మార్పు తన పదేళ్ల వయసులో జరిగింది. అది అతని తండ్రి రత్నగిరి నుండి పుణెకి బదిలీ కావడం. 

పూణేలో ఉండే ఆంగ్లో- వెర్నాక్యులర్ పాఠశాలలో ఎంతో గొప్ప ఉపాధ్యాయుల దగ్గర చదువుకునే అవకాశం తిలక్ కు లభించింది. అయితే పుణెకి వచ్చిన ఆరేళ్ళ వ్యవధిలోనే తల్లిదండ్రులను ఇద్దరిని కోల్పోయాడు ఈయన. మెట్రిక్యులేషన్ చదువుతున్నప్పుడే సత్యభామ అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. ఆ తరువాత దక్కన్ కాలేజీలో చేరాడు. కాలేజీకి వెళ్లి చదువుకున్న తొలితరం భారతీయుల యువకుల్లో తిలక్ ఉండటం గమనార్హం. 1877 లో గణితశాస్త్రంలో ప్రథమ శ్రేణిలో పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత L.L.B పట్టా పొందాడు.

రాజకీయ 

లోకమాన్య తిలక్ 1890 వ సంవత్సరంలో భారతజాతీయ కాంగ్రెస్ లో సభ్యుడిగా చేరాడు. అయితే అప్పటి కాలంలో జరుగుతున్న మితవాద రాజకీయాలపై ఆయనకు పెద్దగా నమ్మకం ఏర్పడలేదు. దేశానికి స్వాతంత్య్రం కావాలంటే పోరాటం చేయడమే సరైన మార్గమని ఆయన నమ్మారు. 

కాంగ్రెస్ పై విమర్శ!

కాంగ్రెస్ అప్పటికాలంలో సంవత్సరంలో డిసెంబర్ నెలలో కేవలం మూడురోజుల పాటు "pray, petition, protest" అనే  మూడు విఆహాయలు గురించి మాట్లాడటంతోనే సరిపెట్టుకుంది. దాని గురించి విమర్శిస్తూ "మీరు కేవలం మూడురోజుల పాటు కప్పల మాదిరి బెకబెకలాడితే  ప్రయోజనం ఉండదు" అని వ్యంగ్యంగా విమర్శించారు. అది మాత్రమే కాకుండా కాంగ్రెస్ అడ్డుకునే సంస్థ అయిపోయింది(బ్రిటిష్ ప్రభుత్వాన్ని అడుక్కోవడం కాదు వాళ్ళ మీద తిరగబడి పోరాటం చేసి మన దేశాన్ని మనం సొంతం చేసుకోవాలని తిలక్ అభిప్రాయం) అని అన్నారు. 

నినాద కర్త!

"స్వరాజ్యం నా జన్మ హక్కు" అని గొంతెత్తి నినదించిన వాడు తిలక్. ఈయన తన గళాన్ని గట్టిగా వినిపించడం వల్ల అతివాదుల వర్గంలోకి చేర్చబడ్డాడు. 1907లో సూరత్ లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ చీలిపోయింది. అతివాదులు, మితవాదులు రెండు వర్గాలుగా చీలిపోయారు. అప్పుడు చీలిపోయినా వాళ్ళు తిరిగి 1917 లో ముస్లిం లీగుకు, కాంగ్రెస్ కు జరిగిన ఒప్పందం సమయంలో మళ్ళీ కలిసిపోయారు.

సమాజంలో చురుకైన పాత్ర!

ఈయన సమాజంలో చాలా చురుకైన పాత్ర పోషించాడు. పాశ్చాత్య విద్యావిధానాన్ని వ్యతిరేకించాడు. అది భారతీయ వారసత్వాన్ని అగౌరవపరుస్తుందని చెప్పాడు. భారతదేశ ఔన్నత్యాన్ని భోధించాలనే ఉద్దేశ్యంతో అగర్కార్, విష్ణు శాస్త్రి చిప్లుంకర్ లతో కలసి "దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ"  స్థాపించాడు. ఇంకా బ్రిటిష్ వారి పట్ల భారతీయుల ధోరణి మారాలనే ఉద్దేశ్యంతో మరాఠా పత్రిక, కేసరి పత్రికలలో ఘాటుగా వ్యాసాలు రాసేవాడు. ఈయన బాల్యవివాహాలను నిరసించాడు, వితంతు వివాహాలను ప్రోత్సహించాడు.

ఉత్సవాల విస్ఫోటనం!

భారతదేశంలో పౌరులను భారతజాతీయోద్యమం వైపు నడిపేందుకు ప్రజలను ఒక్కచోటికి చేర్చేందుకు ఈయన చేసినది శివాజీ జయంతి ఉత్సవాలు, గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడం. వీటి ద్వారా భారతీయ హిందూధర్మ గొప్పదనాన్ని తెలియజేయడమే కాకుండా జాతీయోద్యమం వైపు నడిపించే అవకాశం సృష్టించుకున్నాడు. 

కారాగార శిక్ష!

ఈయన పత్రికల్లో రాసే తన రాతల ద్వారా ప్రజలను రెచ్చగొడుతున్నాడనే కారణంతో ఒకటిన్నర సంవత్సరాల కారాగార శిక్ష విధించారు. ఆ ఒకటిన్నర సంవత్సరం పూర్తవగానే స్వదేశీ ఉద్యమానికి సిద్ధమయ్యాడు. 1906 సంవత్సరంలో దేశద్రోహం కేసు మీద ఆరు సంవత్సరాలు ప్రవాస శిక్ష అనుభవించాడు.

గ్రంధకర్తగా!

ఈయన ప్రవాస శిక్ష అనుభవిస్తున్నప్పుడే గీతారహాస్యం అనే గ్రంధాన్ని రచించారు. అది మాత్రమే కాకుండా ఈయన మంచి చరిత్రకారుడు కూడా. ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుండి వచ్చారని ఈయన తను రచించిన గ్రంధంలో పేర్కొన్నారు. 

హోంరూల్!

1916 లో హోంరూల్ లీగ్ స్థాపించారు. దాని గురించి వివరిస్తూ పల్లెపల్లెకు తిరిగాడు. అనీబిసెంట్ అదే సంవత్సరంలో ఆ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేసింది. అయితే తిలక్ ఒక కేసులో లండన్ వెళ్లగా బ్రిటిష్ వారు తెలివిగా పథకం వేసి అనీబిసెంట్ ఆ ఉద్యమాన్ని విరమించుకునేలా చేసింది. తిలక్, అనీబిసెంట్ ఇద్దరూ చెరొక దారిలో ఉండటం వల్ల హోంరూల్ లీగ్ మెల్లిగా చల్లారిపోయింది. ఆ తరువాత 1920 సంవత్సరంలో తిలక్ మరణించారు. ఆయన చనిపోగానే జాతీయోద్యమం ఇక దిక్కులేనిదైపోయిందని అందరూ అభిప్రాయపడ్డారు.

ఈ విధంగా లోకమాన్య బలగంగాధర తిలక్ భారతజాతీయోద్యమ కర్తగా, ఒక గొప్ప సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా, బ్రిటిషు వారిని ఎదిరించిన శక్తిగా అన్నిటికంటే ముఖ్యంగా ఒక గొప్ప విద్యావంతుడిగా భారతీయ చరిత్రలో నిలిచిపోయాడు.

                                 ◆ వెంకటేష్ పువ్వాడ.