సంపాదనా స్వరం ఏమి చెబుతోంది??
posted on Oct 26, 2024 9:30AM
జీవితంలో రూపాయి కూడా ఎంతో విలువైనదే.ఆ రూపాయి విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే చేతులు, జేబులు ఖాళీగా ఉన్నపుడు. కానీ ఇప్పటి తరానికి ఆ రూపాయి విలువ పెద్దగా తెలియదు. ఏ కొందరికో తప్ప రూపాయి విశ్వరూపం కూడా తెలీదు.
విశ్వరూపం అంటే పుట్టుక పూర్వోత్తరాలు కాదు. కొందరి దృష్టిలో రూపాయి అంటే పెద్దగా లెక్కలేనిది. కారణం ఏమిటని చూస్తే ఇప్పటి కాలంలో డబ్బు సంపాదనకు ఎన్నో మార్గాలు వచ్చి పడ్డాయి. ఆ మార్గాల ద్వారా డబ్బు సంపాదన ఎంతో సులభం. కొన్ని దారులు సులభ పద్దతిలో నిజాయితీగా ఉన్నా ఎక్కువ భాగం వక్రమార్గంలో సంపాదిస్తుండటమే నేటి యువత పెడదారిలో వెళ్ళడానికి కూడా కారణం.
ఈజీ మని లేజీ యూత్
ఎందుకు కష్టపడాలి సులువైన మార్గాలు ఉండగా. హాయిగా మొబైల్ చేతిలో ఉంటేనో, లాప్టాప్ లేదా సిస్టం దగ్గర ఉంటేనో కాలు కదపకుండా, కండ కరగకుండా హాయిగా సంపాదించేయచ్చు. అది తప్పు దారి అని ఎవరైనా అంటే ప్రపంచంలో ఎన్నో తప్పులు జరుగుతుంటే మేము చేసేది తప్పు ఎలా అవుతుందనే సమర్థింపు కూడా చాలామందిలో కనబడుతుంది.
చూడటానికి జులయిగానూ, పని పాట లేక ఉండేవాళ్ళు చాలామంది ఇలాంటి ఈసీ మనికి జై కొడుతూ ఉంటారు. అయితే వీళ్ళలో సగం వరకు యువత సరైన ఉద్యోగ అవకాశాలు లేవనే ఆలోచనతో కూడా ఇలాంటి పనులు చేస్తుంటారు. పలితంగా ఒక సరైన దిశ లేక సాగుతుంది వీరి జీవితం. ఇలా ఈసీ మనీ సంపాదన తాత్కాలిక పరిష్కారమే తప్ప జీవితంలో సంపాదన అనే విషయంలో ఒక దీర్ఘకాలిక మార్గాన్ని చూపించదు అది. కానీ యువతకు ఇది అర్థం కాదు. తప్పేం కాదనే వాధన ఒకవైపు అయితే, ప్రస్తుతం హాయిగా గడిచిపోతోందనే మూర్ఖపు ఆలోచన మరొకవైపు. ఫ్యూచర్ గురించి ఒకప్పటి తరం ఆలోచించినట్టు ఇప్పుడు ఆలోచించడం లేదనేది ఒప్పుకోవలసిన వాస్తవం. ఫలితంగా కలుగుతున్నదే భారతదేశంలో నిరుద్యోగ వ్యవస్థ.
చాలా చోట్ల ఉద్యోగాలు లేవు, ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువ, పోటీ ఎక్కువ ఇంకా పలువిధాలైన కారణాలు చెబుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ మాటల్లో సమర్థింపే ఎక్కువ. కష్టపడి తత్వం గురించి అర్థం చేసుకుంటే దాని ద్వారా వచ్చే సంపాదన రుచి తెలిస్తే భారతదేశంలో యువత ఎంతో మెరుగవుతుంది.
లాటరీలు, క్రికెట్ బెట్టింగ్ లు, అకౌంట్స్ హాక్ చేసి అకౌంట్స్ లో డబ్బులు కాజేయడం, స్మగ్లింగ్ వంటి పనులలో పాల్గొనడం. దొంగతనాలు, బ్లాక్మైల్ చేసి డబ్బు గుంజడాలు. ఇలాంటివన్నీ చేస్తున్నది యువతే అంటే ఆశ్చర్యం వేస్తుంది అలాగే భారతదేశ యువత ఏ పరిస్థితిలోకి దిగజారిపోతోందో అని విచారం కలుగుతుంది.
పైగా ఇలాంటి పనులన్నీ చేయడం అవి బయటపడతాయేమో అని నేరాలు చేయడం, బెదిరించడం వంటివి ఇంకా ఉబిలోకి నెడుతూ జీవితాలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఎలా సంపాదిస్తున్నాం, అందులో నిజాయితీ ఎంత అనే విషయాలపైన ఆ వ్యక్తి జీవితం ఎంత బాగుంటుంది అనేది ఆధారపడి ఉంటుంది. దీనిగురించి జాగ్రత్తలు తీసుకోవలసింది ఖచ్చితంగా పెద్దలే. ఎందుకంటే పిల్లల అవసరాలు ఏమిటి?? వాళ్ళు వాటిని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, వాళ్లకు డబ్బు ఎక్కడినుండి వస్తోంది, వాళ్లెం చేస్తున్నారు వంటి విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. అంతేతప్ప పిల్లలు అవసరాల కోసం డబ్బు అడగడం లేదు మిగిలిపోతోందిలే అనుకుంటే వాళ్ళ జీవితంలో అన్ని కోల్పోయి ఏమి మిగలకుండా తయారవుతారు.
అందుకే సంపాదించే ప్రతి రూపాయి ఏదో ఒకటి చెబుతూనే ఉంటుంది. అది కష్టం విలువో, అవినీతి తాలూకూ గుణపాఠమో, చివరి పలితమో. అనుభవించాల్సింది దాన్ని సంపాదించే వాళ్లే కాబట్టి ఆ సంపాదనా స్వరాన్ని కాస్త వింటూ ఉండండి.
◆ వెంకటేష్ పువ్వాడ