ఎలా బతకాలని అనుకుంటున్నారు!
posted on Oct 24, 2024 9:30AM
పూర్వం ఓ రైతు ఉండేవాడు. అతనికి వంశపారంపర్యంగా ఎకరా పొలం మాత్రమే దక్కింది. అది కూడా రాళ్లూరప్పలతో నిండి ఉంది. దాంతో రైతు తెగ నిరాశపడిపోయాడు. పని చేయాలన్న కోరిక అతనిలో అడుగంటిపోయింది. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. నాకెలాగూ పనికిమాలిన పొలం చేతికొచ్చింది. కాబట్టి, ఇకమీదట నన్ను పోషించాల్సిన బాధ్యత ఆ దేవుడిదే అనుకున్నాడు. అలా అనుకున్న రైతు పనీపాటా మానేసి ఊరికనే ఓ చోట కూర్చుండిపోయాడు. కానీ అదేం చిత్రమో కానీ... దేవుడు ఆ రైతుకి పిడికెడు ఆహారం కూడా పంపలేదయ్యే!
దేవుడు తనకి ఆహారం పంపకపోవడం చూసి రైతు చాలా నిరాశపడిపోయాడు. ‘బహుశా నేను నడుస్తూ ఉంటే, దేవుడు ఏదో ఒక రూపంలో ఎదురుపడి ఆహారాన్ని అందిస్తాడేమో!’ అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా నడుస్తూ, సాయం కోసం అటూఇటూ చూడసాగాడు. కానీ రహదారి మీద ఉన్న ప్రతి ఒక్కరూ తమ దారిన తాము వెళ్లిపోతున్నారే కానీ... రైతు దగ్గరకి వచ్చి ఓ రెండు ముద్దలు పెట్టనేలేదయ్యే!
‘ఇలా కాదు! ఇలాంటి జనసంచారం మధ్య దేవుడు కనిపించకపోవచ్చు. అందుకే మునులంతా అడవిలోకి వెళ్లి తపస్సు చేస్తారేమో! నేను కూడా అడవిలోకి వెళ్లి దేవుడి కోసం ప్రార్థిస్తాను!’ అనుకున్నాడు రైతు. అలా అనుకుంటూ సమీపంలోని అడవికి చేరుకున్నాడు.
అడవిలోకి అడుగుపెట్టిన రైతు ఓ మంచి నున్నటి రాయి చూసుకుని, దాని మీద కూర్చుని... దేవుడి కోసం ప్రార్ధించడం మొదలుపెట్టాడు. ఆకలి మీద ఉన్న రైతుకి మరింత నీరసం వచ్చిందే కానీ దేవుడు అతనికి ఆహారం పంపలేదు. కంటి ముందున్న పళ్లు రైతు ఆకలిని తీర్చలేకపోయాయి. ఈలోగా అతనికి ఓ చిత్రమైన సంఘటన కనిపించింది.
రైతుకి అల్లంత దూరంలో ఓ వేటకుక్క కనిపించింది. దాని రెండు కాళ్లూ విరిగిపోవడంతో, ఎవరో దాన్ని అడవిలోనే వదిలేసి వెళ్లినట్లున్నారు. విరిగిన రెండుకాళ్లతో దేకుతూ ఆ వేటకుక్క అక్కడక్కడే తిరుగుతోంది. ‘అసలే చిన్నప్రాణి! పైగా రెండుకాళ్లూ పోగొట్టుకుని తప్పించుకునే పరిస్థితులో కూడా లేదు. ఈ కుక్కకి ఆహారం ఎలా అందుతోందబ్బా!’ అనుకున్నాడు రైతు.
ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ సింహం అటుగా వచ్చింది- ‘హా! ఇక ఈ కుక్క పని అయిపోయింది. సింహం ఆ కుక్కని నమిలిపారేస్తుంది,’ అనుకున్నాడు రైతు.
రైతు అలా గమనిస్తుండగానే సింహం కుక్క దగ్గరకు వచ్చేసింది. వేటకుక్కని అటూఇటూ కదిపి దాని పరిస్థితిని గమనించింది. ఆశ్చర్యంగా తన నోట్లో ఉన్న మాంసం ముక్కని తీసి ఆ కుక్క ముందు వదిలేసి వెళ్లిపోయింది. ఆ మాంసంతో ఆ పూటకి వేటకుక్క ఆకలి తీరింది.
ఇదంతా చూసిన రైతుకి మతి చెడిపోయింది. ఆపై దేవుడి మీద విపరీతంగా కోపమూ వచ్చేసింది. ‘ఎందుకూ పనికిరాని కుక్కకేమో దాని శత్రువైన సింహం కూడా సాయపడిందా! నాకేమో సాటి మనిషి ఎవ్వడూ రెండు మెతుకులు కూడా ఇవ్వడం లేదా! నా మీద దేవుడికి ఇంత పక్షపాతమా!’ అనుకున్నాడు. ఆ కోపంలోనే అడవిని వీడి వడివడిగా తన ఊరికి తిరుగుప్రయాణమయ్యాడు. చీకటిపడేసరికి అతను దారిమధ్యలో ఉన్న ఓ ఆశ్రమంలో సేదతీరాడు. అక్కడ కనిపించిన స్వామీజీకి తన అనుభవాలన్నీ ఏకరవు పెట్టాడు. ‘దేవుడు మహా కఠినుడు. నాలాంటి వారి కష్టాలను అతను ఆలకించడు,’ అంటూ నిష్టూరాలాడాడు.
రైతు మాటలు విన్న స్వామీజీ చిరునవ్వుతో- ‘ఇంతకీ నువ్వు ఆ కుక్క గురించే ఆలోచిస్తున్నావు. ఆ జీవితోనే నిన్ను పోల్చుకుంటున్నావు. నీ బతుకు కూడా దానిలాగా కావాలని అనుకుంటున్నవా ఏం! దేవుడు బహుశా నిన్ను సింహంలాగా బతకాలనుకుంటున్నాడేమో! నీ బలంతోనూ, తెలివితోనూ, కష్టంతోనూ ఆహారం సంపాదించుకోవాలనీ... ఆ ఆహారాన్ని నిస్సహాయులతో పంచుకోవాలని కోరుకుంటున్నాడేమో. ఇంతకాలం నువ్వు దేవుడు నీకేదో చేస్తాడని ఆశపడ్డావు. కానీ ఆయన ఆశకి అనుగుణంగా జీవించే ప్రయత్నం చేశావా! నీ ఇంట్లో కూర్చుంటేనో, నడుచుకుంటూ వెళ్తేనో, అడవిలో తపస్సు చేసుకుంటేనో దక్కని దేవుని కరుణ... నువ్వు కష్టపడి జీవిస్తే దక్కుతుందేమో చూడరాదా!’ అని సూచించాడు.
స్వామీజీ మాటలు విన్న రైతుకి అతని మాటలు నిజమే కదా అనిపించాయి. నిజమే కదా!