అనంతలో ఆంగ్ సాన్ సూకీ పర్యటన
posted on Nov 17, 2012 3:21PM

అనంతపురం జిల్లా పాపసానిపల్లెని మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమకారిణి ఆంగ్ సాన్ సూకీ సందర్శించారు. ప్రభుత్వ పథకాల్ని సంపూర్ణంగా వినియోగించుకుంటూ అక్కడి మహిళా డ్వాక్రా సంఘాలు సాధించిన ప్రగతిని ఆమె కొనియాడారు.
మడకశిర మండలకేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాపసానిపల్లిలో 14 మహిళా సంఘాలతోపాటు రెండు వికలాంగుల సంఘాలుకూడా ఉనాయ్. ఈ సంఘాల్లో మొత్తం 170మంది సభ్యులున్నారు. ఈ గ్రామంలో 130మంది రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తూ శ్రీవరి, శ్రీరాగి, మొక్కజొన్న, కూరగాయల పంటల్ని సాగుచేస్తున్నారు.
ఇక్కడున్న పౌష్టికాహార కేంద్రం ద్వారా ఊళ్లో ఉన్న పిల్లలందరికీ రోజూ పౌష్టికాహారం అందుతోంది. మహిళా సంఘాలు కట్టుగా నిలబడకముందు ఊళ్లో అందరూ కూలీనాలీ చేసుకుని బతికేవాళ్లు. అందరూ కలసికట్టుగా ముందుకు సాగడంవల్ల, ప్రభుత్వ పథకాల్ని సంపూర్ణంగా వినియోగించుకోవడంవల్ల అభివృద్ధి సాధ్యమయ్యింది.
డ్వాక్రా సంఘాల్ని ఏర్పాటు చేసుకున్నాక ఈ గ్రామంలో ఉన్న మహిళల బతుకు చిత్రం మారిపోయింది. జీవనశైలిలో చాలా మార్చులొచ్చాయి. ప్రకృతి ప్రసాదించిన వనరుల్ని వినియోగించుకుంటూ ఆకులు అలమలు, ఆవుపేడ, గోమూత్రాన్ని కలిపి తయారుచేస్తున్న జీవామృతంతో పంటలను పండిస్తూ ఆర్థిక పరిపుష్టిని సాధించారు.
రసాయన ఎరువులతో పండించిన పంటలకూ సేంద్రియ ఎరువులతో పండించిన పంటలకూ ఎంత తేడా ఉంటుందో, తామంతా కలిసికట్టుగా పనిచేసి ఏ విధంగా ఆర్థిక స్వావలంబన సాధించారో తెలిపే విషయాల్ని ఇక్కడి మహిళలు ఆంగ్ సాన్ సూకీకి విశదంగా వివరించారు. సూకీ పర్యటన సందర్బంగా ముఖ్యమంత్రి పాపసానిపల్లెమీద వరాల జల్లు కురిపించారు.