సవిత మృతిపై నిరసనల వెల్లువ
posted on Nov 17, 2012 1:11PM

డాక్టర్లు అబార్షన్ చేయడానికి నిరాకరించడంతో ఐర్లండ్‌లో మృతి చెందిన భారతీయ మహిళ సవితా హలప్పనవర్ విషయంపై ఢిల్లీలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఐర్లండ్ రాయబారిని వివరణ కోరింది. సవిత మృతిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విదేశాంగ వ్యవహరాల శాఖ కార్యదర్శి ఎమ్.గణపతి పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు.
తమది క్యాథలిక్ దేశమని.. అబార్షన్‌కు తమ చట్టాలు అనుమతించవని పేర్కొంటూ సవితకు అబార్షన్ చేయడానికి డాక్టర్లు అభ్యతరం చెప్పడంతో సవిత వైద్యుల కళ్లముందే ప్రాణాలు కోల్పోయింది. సవిత మృతి విషయాన్ని విదేశాంగ వ్యవహారాల శాఖతో చర్చిస్తామని జాతీయ మహిళా కమిషన్ తెలిపింది. సవిత తల్లిదండ్రులు కూడా ఐరిష్ అబార్షన్ చట్టాలను సవరించేలా ఆ దేశంపై భారత్ ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
ఐరిష్ డాక్టర్లు బిడ్డ ప్రాణాలు కాపాడలేకున్నా, కనీసం తల్లి ప్రాణాలైనా కాపాడాల్సిందని భారత విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. మరోవైపు ఐరిష్ గైనకాలజిస్టులు, ప్రజలు కూడా అబార్షన్ చట్టానికి సవరణలు చేయాలని తమ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. సవిత మృతికి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఐరిష్ పార్లమెంట్ ఎదుట వేలాదిమంది ప్రదర్శన నిర్వహించారు.