తెదేపా సభ్యులను సభలోనే ఉండనిస్తే బాగుండేదేమో?

 

శాసనసభ నుండి వారం రోజుల పాటు బహిష్కరింపబడిన తెదేపా సభ్యులు, ఈరోజు ఇందిరా పార్క్ వద్ద చేసిన ధర్నాతో తెరాస ప్రభుత్వం తలపట్టుకోనేలా చేసినట్లు కనబడుతోంది. వారిని సభలో ఉండనిచ్చి ఉంటే, వారు కేవలం నినాదాలతో సరిబెట్టుకొనేవారు. కానీ వారిని ఏకంగా వారం రోజుల పాటు బహిష్కరించడంతో వారు మొదటి రోజు జిల్లాల వ్యాప్తంగా ధర్నాలు, రాస్తా రోకోలు నిర్వహించి, ప్రభుత్వ నిరంకుశ ధోరణిని ఎండగట్టారు. ఈరోజు ఇందిరా పార్క్ వద్ద వారు చేసిన ధర్నాకు ఆత్మహత్యలు చేసుకొన్న రైతు కుటుంబాలను కూడా రప్పించి వారి చేతనే ప్రభుత్వాన్ని నిలదీయించడంతో, తెరాస ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమయిన పరిస్థితి కల్పించారు.

 

ఎన్నికలకు ముందు కరెంటు ఇస్తాము, రైతులను ఆడుకొంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్, ఇప్పుడు మరో మూడేళ్ళ వరకు విద్యుత్ ఇవ్వలేనని తెగేసి చెప్పడమే కాకుండా ఆత్మహత్యలు చేసుకొంటున్న రైతులపట్ల కనీసం మానవతా దృక్పధంతో స్పందించలేకపోతున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. ఒకవైపు రైతులు ఆర్ధిక సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకొంటుంటే, ఇప్పుడు మంత్రులకు బుల్లెట్ ప్ర్రోఫ్ లగ్సరీ కార్లు కొనాలనుకోవడాన్ని ఆయన తప్పు పట్టారు. కార్లు కొనడం కాదు ఆ డబ్బుతో ముందు రైతులను ఆదుకొంటే బాగుంటుందని ఆయన అన్నారు.

 

ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ “ప్రభుత్వం తన అసమర్ధతను, వైఫల్యాలను కప్పి పుచ్చుకోనేందుకే గత ప్రభుత్వాలను నిందిస్తోందని, కానీ తెలంగాణా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు చేసుకొంటున్నారని ఆయన విమర్శించారు. తెదేపా నేతలు ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించడం వలన దానికి మీడియా కవరేజి కూడా బాగానే వచ్చింది.

 

శాసనసభ్యులను సస్పెండ్ చేసి బయటకు పంపించి వేస్తే హాయిగా సభ జరిపించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తే వారు బయటకు వెళ్లి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ప్రజలందరి దృష్టిని ఆకట్టుకొంటున్నారు. ఈరోజు 13 మంది కాంగ్రెస్ సభ్యులను కూడా సభ నుండి సస్పెండ్ చేయడంతో వారు కూడా గవర్నరు వద్దకు వెళ్లి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్న తీరుపై పిర్యాదు చేయబోతున్నారు. అంతకు ముందు అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ వద్ద సమావేశం పెట్టి పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒకవేళ నేడో రేపో బీజేపీ సభ్యులను కూడా సభ నుండి సస్పెండ్ చేసి బయటకు పంపినట్లయితే తెలంగాణా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాసి నిరంకుశ పోకడలు పోతోందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు మరింత బలం చేకూరుతుంది. కనుక సాధ్యమయినంత వరకు అటువంటి పరిస్థితి రాకుండా తెరాస జాగ్రత్త పడవచ్చును.