విగ్రహాల తొలగింపుతో ప్రభుత్వానికి కొత్త సమస్యలు?
posted on Feb 6, 2015 8:38PM
.jpg)
హైకోర్టు, సుప్రీం కోర్టు రెండూ కూడా రాజకీయ పార్టీలు రోడ్లమీద ఎక్కడబడితే అక్కడ తమ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేయడాన్ని ఖండిస్తున్నాయి. అంతేకాక వాటిని తొలగించమని ఆదేశాలు కూడా జారీ చేసాయి. కానీ వాటి జోలికి వెళ్తే కొత్త సమస్యలు ఆహ్వానించినట్లవుతుందనే భయంతో ఏ ప్రభుత్వమూ కూడా ఈవిషయంలో దైర్యం చేయలేకపోయింది. అందువలన మన రాష్ట్రంలో వైకాపా పుణ్యమాని గత పదేళ్ళ కాలంలో వెలిసిన విగ్రహాలకు లేక్కేలేదు. ఇంకా కొత్తగా అనేకం వెలుస్తూనే ఉన్నాయి కూడా. అనుమతి లేకుండా పెడుతున్న విగ్రహాలన్నిటినీ తొలగించమని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. కానీ జాతీయ నాయకుల విగ్రహాల జోలికి మాత్రం పోవద్దని సూచించారు.
ఇక నేడో రేపో అధికారులు రాజశేఖర్ రెడ్డి విగ్రహాల తొలగింపు మొదలుపెడితే వైకాపా చూస్తూ ఊరుకొంటుందని భావించలేము. కనుక అది కక్ష సాధింపు చర్యలేనంటూ ధర్నాలు, నిరసనలు చెప్పట్టవచ్చును. రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి కూడా చెందినవారు కనుక ఆ పార్టీ నేతలు కూడా వైకాపాతో గొంతు కలుపుతారేమో? ఇక రాష్ట్రంలో యన్టీఆర్ విగ్రహాలు కూడా అనేక చోట్ల ఉన్నాయి. కానీ వాటిని తాకేందుకు అధికారులకు ప్రభుత్వం అనుమతిస్తుందో లేదో? ఇస్తే వాటిని తాకేందుకు అధికారులు సాహసిస్తారో లేదో? సాహసించకపోతే వైకాపా తమకో న్యాయం తెదేపాకొ న్యాయమా? అంటూ ప్రశ్నించక మానదు.
ఇది చాలా సున్నితమయిన అంశం గనుక అధికారులు చాలా జాగ్రత్తగా ఈ వ్యవహారాన్ని చక్కబెట్టాల్సి ఉంటుంది. లేకుంటే ప్రభుత్వానికి కొత్త సమస్యలు వస్తాయి. దాని వలన వారికి అక్షింతలు తప్పవు. ఇప్పుడు విగ్రహాలు తొలగించడమే కాకుండా మున్ముందు ఎవరూ ఎక్కడబడితే అక్కడ విగ్రహాలు ప్రతిష్టించకుండా కటినమయిన నిబంధనలు రూపొందిస్తే బాగుంటుంది.