కేసీఆర్ దెబ్బకి ప్రతిపక్షాలు ఠా!
posted on Feb 6, 2015 8:01PM
.jpg)
తెలంగాణాలో తెరాస పార్టీ అధికారం చేప్పట్టిననాటి నుండి నేటివరకు కూడా విద్యుత్ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు వంటి అనేక క్లిష్ట సమస్యలు, పొరుగు రాష్ట్రంతో వివాదాలు, కేసీఆర్ వివాదాస్పద నిర్ణయాలు ఆకారణంగా ప్రభుత్వానికి కోర్టుల చేత అక్షింతలు, ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది. అందువలన ఈ తొమ్మిది నెలల్లో ఒక్క రోజు కూడా పూర్తి సంతోషంగా, సంతృప్తికరంగా పాలన సాగిందని చెప్పుకోవడానికి లేకుండా పోయింది.
ఇప్పుడు సచివాలయాన్ని ఎర్రగడ్డకు తరలించి అక్కడ ఉన్న చాతి వ్యాధులు మరియు మానసిక వ్యాధుల ఆసుపత్రులను వేరే చోటికి తరలించాలనే కేసీఆర్ నిర్ణయంతో ఆందోళనలు, వాదోపవాదాలు మొదలయ్యాయి. పరిస్థితులు అనుకూలించే వరకు జి.హెచ్.యం.సి.ఎన్నికలను వాయిదా వేయాలనుకొంటే తక్షణమే షెడ్యుల్ ప్రకటించమని హైకోర్టు ఆదేశించడంతో అవీ వెంటనే నిర్వహించక తప్పడం లేదు.
ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన ఒకే ఒక ఎత్తుతో ప్రతిపక్షాలన్నీ చిత్తయిపోయాయి. ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచడంతో ఆయాన ఒకేసారి ఏకంగా కొన్ని లక్షలమంది ఉద్యోగులను, వారి కుటుంబాలను ప్రసన్నం చేసుకొని తనవైపు త్రిప్పుకోగలిగారు. ఇప్పుడు ప్రతిపక్షపార్టీలు ఎంత అరిచి గ్గీ పెట్టినా ఆయనకు పోయేదేమీ లేదు. ఇకపై ఉద్యోగులు ఆయనపై ఈగ వాలకుండా చూసుకోవచ్చును. కనుక ఆయన నిర్భయంగా తన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగవచ్చును. కాకపోతే వివాదాస్పద నిర్ణయాలు తీసుకొంటే కోర్టు భారి నుండి ఆయనను ఎవరూ కాపాడలేరు. ప్రస్తుతం సచివాలయం, ఛాతి మరియు మానసిక వ్యాధుల ఆసుపత్రుల తరలింపు వ్యవహారంలో మొండిగా ముందుకు వెళ్ళినట్లయితే ఆయనకు గవర్నరు నుండి అభ్యంతరాలు, కోర్టులో ఎదురు దెబ్బలు తప్పకపోవచ్చును.