సుబ్రహ్మణ్యం మీద సుబ్రహ్మణ్యేశ్వరుడిది ప్రేమా.. పగా?
posted on Mar 21, 2025 12:18PM
.webp)
పదేళ్లలో 103 సార్లు పాము కాటు
ప్రతి సారీ చావు అంచుదాకా వెళ్లి బతికి బట్టకడుతున్న వైనం
హేతువుకు అందని వింత
నాగదేవుడి పేరు పెట్టుకున్న ఆ వ్యక్తిపై పాములు పగబట్టాయా? లేక భక్తి పారవశ్యంతో ఊగిపోతున్నాయా? తెలియదు కానీ సుబ్రహ్మణ్యం అన్న నామధేయం ఉన్న ఆ వ్యక్తిని గత పదేళ్లలో పాములు 103 సార్లు కాటు వేశాయి. అలా పాము కాటుకు గురైన ప్రతి సారీ అతడు బతికి బయటపడ్డారు. పాము కాటునుంచి తప్పించుకునేందుకు అతగాడు చేయని ప్రయత్నం లేదు. ఊర్లు మారాడు, రాష్ట్రాలు మారాడు. కానీ అదేమిటో అతడెక్కడ పని చేస్తే అక్కడ పాము కాటుకు గురౌతూ వస్తున్నాడు.
ఇది వింతా, మిస్టరీయా తెలియదు కానీ.. సుబ్రహ్మణంను వెతికి వెతికి మరీ పాములు కాటువేస్తున్నాయి.
విషయమేంటంటే.. చిత్తూరు జిల్లా బైరెడ్డి పల్లి మండలం చల్లారు గుంట వాసి వడ్డెర సుబ్రహ్మణ్యం (47) గత పదేళ్లలో 103 సార్లు పాము కాటుకు గురయ్యాడు. సుబ్రహ్మణ్యం అని నాగదేవత పేరు పెట్టు కున్నసుబ్రహ్మణం ఇలా తరచుగా పాము కాటుకు గురి కావడం టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారిపోయింది. పాము కాటుకు గురైన ప్రతి సారీ సుబ్రహ్మణ్యం చావు అంచుల దాకా వెళ్లి వస్తున్నాడు.
తాజాగా ఈ నెల 15న మరో సారి అంటే 103వ సారి సుబ్రహ్మణ్యంను పాము కాటేసింది. పెద్ద పంజాణి జేఎంజే అస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు. అయితే ఇన్ని సార్లు పాములు సుబ్రహ్మణ్యంనే ఎందుకు కరుస్తున్నాయి..అంటే సమాధానం దొరకదు. పాము కాటుకు గురైన ప్రతిసారీ వైద్య సహాయంతో బతికి బట్టకడుతున్నాడు కానీ, ఆ వైద్యం కోసం సుబ్రహ్మణ్యం తనకున్న మూడెకరాల పొలాన్నీ అమ్మేసుకోవలసి వచ్చింది. ఇప్పుడు భార్యా బిడ్డలతో ఒక పూరి గుడిసెలో కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. సర్పదోషనివారణ పూజలు,రాహుకేతు పూజలు చేశాడు. అయినా పాములు మాత్రం అతడిని వదల డం లేదు. మొత్తం మీద ఇన్ని సార్లు పాముకాటుకు గురైన వ్యక్తిగా సుబ్రహ్మణ్యం గిన్నిస్ రికార్డులకు ఎక్కే అవకాశం లేకపోలేదని నెటిజనులు అంటున్నారు. సుబ్రహ్మణ్యం వెర్సెస్ పాములు వెనుక కారణాలు కనుగొనడానికి పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.