ఆ ఏడుగురిదీ ధిక్కారమే? జగన్ చేతులెత్తేశారా?
posted on Mar 21, 2025 2:37PM
.webp)
వైసీపీ లేని, రాని ప్రత్యేక హోదా కోసం ఆ పార్టీకి చెందిన జగన్ సహా 11 మంది ఎమ్మెల్యేలూ సమష్టిగా పోరాడుతున్నారని అంతా భావించారు. రాజ్యాంగ నిబంధన ప్రకారం ఆరు నెలల పాటు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే సభ్యత్వం కోల్పోయే ప్రమాదం ఉందని తెలిసినా వారు అందుకు సిద్ధపడే శాసన సభను బాయ్ కాట్ చేశారని అంతా భావిస్తూ వచ్చారు. అయితే ఎప్పుడైతే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే సెషన్ కు జగన్ సహా 11 మంది ఎమ్మెల్యేలూ హాజరయ్యారో.. అప్పుడే అందరికీ అనర్హత వేటుతో శాసన సభ సభ్యత్వాన్ని కోల్పోయి ఉప ఎన్నికను ఎదుర్కొనే ధైర్యం జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరికీ లేదని అర్ధమైపోయింది.
అందుకే కేవలం అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం పెట్టడానికే వారు ఆ ఒక్క రోజూ సభకు వచ్చారని స్పష్టమైపోయింది. అదలా ఉంచితే.. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం రోజు వచ్చి సంతకం పెట్టినా అది రెగ్యులర్ సెషన్ లోకి రాదని స్పీకర్ సభా నిబంధనలను ఉటంకిస్తూ స్పష్టత ఇవ్వడంతో వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి వ్రతమూ చెడింది. ఫలమూ దక్కలేదన్నట్లైంది. దీంతో ఇక చేయగలిగిందేముంది, రోట్లో తలపెట్టాం.. రోకలి పోటుకు ఎదురు చూడాల్సిందే అన్నట్లుగా జగన్ అండ్ కో చేతులెత్తేశారు. కానీ ఉన్న 11 మంది ఎమ్మెల్యేలలో ఏడుగురు ఇక్కడే తమ ధిక్కారాన్ని సున్నితంగానైనా పార్టీ అధినేత జగన్ కు తెలియజేయాలనుకున్నారు. జగన్ అభీష్ఠానికి విరుద్ధంగా, కనీసం ఆయనకు సమాచారం ఇవ్వకుండా అసెంబ్లీకి వెళ్లి హాజరు పట్టీలో సంతకం పెట్టి వచ్చేశారు. సభలో వారు ఏ కార్యక్రమంలోనూ పాల్గొన లేదు. కేవలం అసెంబ్లీకి వెళ్లి హాజరు పట్టీలో సంతకం పెట్టి వచ్చేశారంతే. దీని వల్ల పుణ్యమూ పురుషార్థమూ దక్కుతాయని వారు భావించారు.
అయితే అలా దొంగచాటుగా వచ్చి సంతకాలు పెట్టేసినంత మాత్రాన వారు సభకు హాజరైనట్టుగా తాను పరిగణిం చబోననీ, అయినా దొంగల్లా అసెంబ్లీకి రావాల్సిన ఖర్మ ఎందుకు దర్జాగా వచ్చి సభా కార్యక్రమాల్లో పాలు పంచుకోండి అంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వారికి హితవు పలికారు. అయితే జగన్ కు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా అసెంబ్లీలో అడుగుపెట్టి సంతకాలు పెట్టేసిన ఏడుగురు ఎమ్మెల్యేల విషయంలో జగన్ ఏం చర్య తీసుకుంటారన్న చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. చర్య అంటూ తీసుకుంటే జగన్ పార్టీ బలం అసెంబ్లీలో నాలుగుకు పడిపోతుంది. పోనీ చర్య తీసుకోకుండా వదిలేస్తే ఇక ఎమ్మెల్యేలెవరూ జగన్ ను లెక్క చేసే పరిస్థితి ఉండదు. దీంతో వీరి విషయంలో జగన్ పరిస్థితి కక్కలేక.. మింగలేక అన్నట్లు తయారైందని నెటిజనులు సెటైర్లు పేలుస్తున్నారు.