హైకోర్టు జడ్జి ఇంట్లో కట్టలకట్టల నోట్లు

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో నోట్ల కట్టలు కలకలం సృష్టించాయి. లెక్కల్లో చూపని సొమ్ము కట్టలు కట్టలుగా ఆయన నివాసంలో బయటపడింది. వివరాల్లోకి వెడితే.. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయితే మంటలను ఆర్పేందుకు వెళ్లిన ఫైర్ సిబ్బందికి ఆ ఇంట్లో భారీ ఎత్తున డబ్బులు కనిపించడంతో ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.

అయితే ప్రమాదం జరిగిన సమయంలో జస్టిస్ వర్మ నగరంలో లేరని తెలుస్తోంది. ఆయన కుటుంబసభ్యులే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు ఫోన్ చేసి పిలిపించినట్లు తెలుస్తోంది. అగ్నికీలలను ఆర్పేశాక.. అగ్నిమాపక సిబ్బందికి అక్కడ భారీఎత్తున నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. దీంతో ఈ విషయాన్ని వారు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే డబ్బును స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. పట్టుబడిన నగదు మొత్తం లెక్కల్లో చూపని నగదుగా ఐటీ అధికారులు గుర్తించారు.

మరోవైపు ఓ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో ఇంత భారీ ఎత్తున నగదు ప్రత్యక్షమవడం న్యాయవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై సుప్రీం కోర్టు సీజేఐ సంజీవ్ కన్నా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నేతృత్వంలోని కొలీజియం అత్యవసరంగా సమావేశమై జస్టిస్ యశ్వంత్ వర్మపై చర్యలు తీసుకుకుంది. ఆయనను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. అయితే న్యాయవ్యవస్థ విశ్వసనీయతను కాపాడేందుకు యశ్వంత్ వర్మను బదిలీ చేస్తే సరిపోదని.. ఆయన రాజీనామా చేయాలని కొందరు కొలీజియం సభ్యులు పట్టుబట్టినట్లు సమాచారం. ఓ న్యాయమూర్తి అయ్యిండి ఆయన ఇంట్లో ఇంతలా నోట్ల కట్టలు లభ్యమవడం చర్చనీయాంశంగా మారింది. ఇంత డబ్బును న్యాయమూర్తి ఎలా సంపాదించారనే దానిపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.