ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్లకు.. ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు జమ!

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఒకటో తేదీనే వారి ఖాతాల్లో జమయ్యాయి. దాదాపు 90 శాతంపైగా ఉద్యోగులకు సోమవారం(జులై1)  జీతాలు జమయ్యాయి. అలాగే  పెన్షనర్లకు పింఛన్లు కూడా 50 శాతం అందాయి. మిగతా వారికి కూడా మంగళవారం నాటికి జీతాలు, పెన్షన్లు పూర్తిస్థాయిలో అందుతాయని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.

పోలీస్‌, రెవెన్యూ, హెల్త్‌, పంచాయతీరాజ్‌ ఉద్యోగులకు జీతాలందాయి. కొన్ని జిల్లాల్లో దాదాపు వంద శాతం జీతాలు జమయ్యాయి. టీచర్ల బిల్లులు చివర్లో పెట్టడం వలన వారిలో ఎక్కువ మందికి జీతాలు పడలేదు. మంగళవారం నాటికల్లా అందరికీ వంద శాతం అందుతాయని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని బిల్లులూ పూర్తిగా క్లియర్‌ అయినట్టు తెలిసింది. నాలుగున్నరేళ్లుగా జగన్‌ సర్కారు ఒకటో తేదీనే జీతాలిచ్చిన చరిత్ర లేదు.  జీతాలు, పెన్షన్లు పూర్తిస్థాయిలో పడాలంటే నెలలో మూడోవారం వచ్చేది. ఈఎంఐలు, బిల్లులు చెల్లించాల్సిన ఉద్యోగులు అప్పులు తెచ్చి తిప్పలు పడేవారు. పెన్షనర్లు కూడా ఆస్పత్రి ఖర్చులు, మందులు, ఇతర ఖర్చులకు సకాలంలో డబ్బులందక ఇబ్బందులు పడ్డారు.

కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక మొదటి నెలలోనే ఉద్యోగులకు జీతాలు దాదాపు పూర్తి స్థాయిలో, పెన్షన్లు సగానికి పైగా అందాయి. ప్రభుత్వోద్యోగులకు జీతాలు, పెన్షన్లు కలిపి నెలకు రూ.5,500 కోట్లు అవసరమవుతాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఖజానాకు నెలకు రూ.13,000 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. అవి గాక వారం వారం అందినకాడికి అప్పులు తెచ్చేవారు. అయినప్పటికీ ఒక్క నెలలో కూడా సకాలంలో జీతాలు, పెన్షన్లు చెల్లించలేదు. అలాగే... పీఆర్సీ బకాయిలు, డీఏ బకాయిలు, జీపీఎఫ్‌, అడ్వాన్సుల దరఖాస్తులు, ఈఎల్‌ ఎన్‌క్యా్‌షమెంట్‌, సరెండర్‌ లీవుల బిల్లులు కూడా భారీగా పెండింగ్‌లో ఉంచారు.

జగన్‌ ఇచ్చిన 11వ పీఆర్సీతో ఉద్యోగులకు జీతాలు పెరగకపోగా కొంతమేర తగ్గాయి. అధికారంలోకొచ్చిన వారంలోనే సీపీఎస్‌ రద్దుచేస్తానని హామీ ఇచ్చిన జగన్‌ ఐదేళ్లు పూర్తయినా ఆ పని చేయలేదు. పైగా జీపీఎ్‌సను తీసుకొచ్చి ఉద్యోగులను నట్టేట్లో ముంచారు. ఇన్ని సమస్యలతో పాటు ఉద్యోగులకు తమకు ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్లు అందించాలని కూడా వైసీపీ ప్రభుత్వంతో పోరాడారు. కూటమి ప్రభుత్వం వచ్చీరాగానే అటు సామాజిక పెన్షన్లు, ఇటు ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు ఏకకాలంలో ఇచ్చేసి సామర్థ్యాన్ని నిరూపించుకుంది.