జగన్ మీద అంత చిరాకు ఎందుకో?!

కర్నాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్‌కి ట్రబుల్ షూటర్‌గా పేరుంది. క్లిష్టమైన రాజకీయ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆయన రంగంలోకి దిగారంటే ఎదురుగా ఎవరూ నిలవలేరని అంటూ వుంటారు. రాజకీయాల్లో రాటుతేలడం కావచ్చు.. ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తి కావడం వల్ల కూడా ఆయనకి ఈ ‘టాలెంట్’ వచ్చి వుండొచ్చు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాన్నీ డీకే శివకుమార్ ఆధ్వర్యంలోనే జరిగాయి. ఎన్నికల సమయంలో ఆయన హైదరాబాద్‌లోనే వుండి, అన్ని విషయాలూ దగ్గరుండి ‘చక్కబెట్టి’, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తనవంతు సహకారం అందించారు. 

అలాంటి డీకే శివకుమార్‌ని వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి బెంగళూరులో కలిశారని, తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి శివకుమార్‌తో చర్చించారని ఈమధ్య వార్తలు వచ్చాయి. ఒక పత్రికలో అయితే శివకుమార్‌కి జగన్మోహన్ రెడ్డి పుష్పగుచ్ఛాన్ని ఇస్తున్నట్టు ఫొటో కూడా ప్రింట్ చేశారు. దాంతో ఈ వార్త దావానలంలా వ్యాపించింది. ఈ వార్తల విషయంలో వైసీపీ వర్గాల నుంచి ఎలాంటి ఖండనలు లేకపోవడంతో దావానలం లాంటి వార్త అలా వ్యాపిస్తూ వెళ్ళీ వెళ్ళీ.. కాంగ్రెస్ అధిష్ఠానానికి, చివరికి శివకుమార్‌కే అంటుకుని చుర్రుమనిపించింది. వెంటనే శివకుమార్ ఒక ఖండన విడుదల చేశారు. జగన్ నను కలవలేదు, ఆయన మా పార్టీలో చేరబోవడం లేదు అని సింపుల్‌గా ఒక ఖండన ఇస్తే సరిపోయేది. కానీ, ఆయన ఆగ్రహంతో రగిలిపోతూ ట్విట్లర్లో పోస్టు పెట్టారు. ‘‘ఎవరో స్కౌండ్రల్ జగన్‌ నన్ను కలిసినట్టు ఫొటో పెట్టాడు. ఇలాంటి వార్తలు నమ్మవద్దు’’ అని ఘాటుగా పోస్టు పెట్టారు. ఇంత చిన్న విషయాన్ని ఆయన అంత ఘాటుగా ఎందుకు స్పందించారో చాలామందికి అర్థం కాలేదు.

నిజానికి జగన్‌ని పార్టీలో చేర్చుకునే ఉద్దేశం సోనియాగాంధీకి గానీ, రాహుల్ గాంధీకి గానీ ఎంతమాత్రం లేదు. జగన్ ‘ప్రతిభ’ తెలుసు కాబట్టే, వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన వెంటనే జగన్ కుప్పిగంతులు వేస్తే కంట్రోల్ చేశారు. వాళ్ళకి జగన్ మీద మొదటి నుంచీ సదభిప్రాయం లేదు. లక్షల కోట్ల స్కాముల్లో ఇరుక్కుని, బీజేపీ సానుభూతిపరుడిగా వున్న జగన్ అలాంటి వ్యక్తిని డీకే శివకుమార్ ఎందుకు కలిశారంటూ కాంగ్రెస్ అధిష్ఠానం శివకుమార్ మీద సీరియస్ అయినట్టు సమాచారం. దాంతో శివకుమార్ నన్ను జగన్ కలవలేదు మొర్రో అని ప్రకటన చేయాల్సి వచ్చింది. ఈ మాయదారి జగన్ వల్ల అధిష్ఠానానికి నేను సంజాయిషీ ఇచ్చుకోవలసి వచ్చిందన్న చిరాకుతో డీకే శివకుమార్ అంత ఘాటుగా రియాక్ట్ అయినట్టున్నారు.