భ్రమల్లో బతుకుతున్న కేటీఆర్!

కొంతమంది ఇళ్లలో పవర్ పోయిందనుకోండి.. వాళ్ళు చుట్టుపక్కల చూస్తారు. చుట్టూ వున్న ఇళ్లలో పవర్ వుంటే హర్టయిపోతారు.. వాళ్ళకు పవర్ వుందిగానీ, మనకి పోయిందని బాధపడతారు. అదే చుట్టుపక్కల కూడా పవర్ పోయిందనుకోండి.. అందరికీ పవర్ పోయింది కాబట్టి హ్యాపీగా ఫీలవుతారు. అందరికీ పవర్ పోయింది కాబట్టి మనకీ పోయింది. ప్రత్యేకంగా మనకు మాత్రమే పోలేదు అని మనసుకి సర్దిచెప్పుకుంటారు.  బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా ప్రస్తుతం ఇదే మానసిక స్థితిలో వున్నారు. మొన్నీమధ్యే పవర్ పోగొట్టుకున్న కేటీఆర్ చుట్టుపక్కల చాలామందికి కూడా పవర్ పోవడం చూసి హమ్మయ్య అని ఆనందపడుతున్నారు. ఆ ఆనందాన్ని బయటికే వ్యక్తం చేస్తూ, ఆయన ఎంత భ్రమల్లో బతుకుతున్నారో బయటపెట్టుకుంటున్నారు.

అసెంబ్లీ ఎన్నికలలో దారుణంగా ఓడిపోయినప్పటికీ, పార్లమెంట్ ఎన్నికలలో సున్నా స్థానాలు సంపాదించుకున్నప్పటికీ బీఆర్ఎస్ నాయకులైన కేసీఆర్, కేటీఆర్ తమవైపు ఏయే తప్పులు వున్నాయో ఆత్మ పరిశీలన చేసుకోవడం మానేసి, తప్పంతా కాంగ్రెస్ పార్టీ మీదో, బీజేపీ మీదో వేయడం మీదే శ్రద్ధ చూపిస్తున్నారు. కేటీఆర్ లేటెస్ట్.గా ఒక మీటింగ్‌లో మాట్లాడుతూ తానెంత భ్రమల్లో బతుకుతున్నదీ వివరించారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఏ కూటమిలోనూ లేకుండా పోటీ చేసిన పార్టీలన్నీ ఓడిపోయాయట. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా పోటీ చేసినందువల్ల ఓడిపోయారట. అలాగే ఒరిస్సాలో ఐదుసార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నవీన్ పట్నాయక్ కూడా పొత్తులు పెట్టుకోకుండా పోటీ చేసినందుకు ఓడిపోయారట. ఉత్తర్ ప్రదేశ్‌లో కూడా బహుజన సమాజ్ పార్టీ ఏ కూటమితో పొత్తు పెట్టుకోకుండా పోటీ చేసినందువల్ల పార్లమెంట్ స్థానం ఒక్కటి కూడా రాలేదట. పంజాబ్‌లో అకాలీదళ్ కూడా ఏ కూటమితో పొత్తు పెట్టుకోకపోవడం వల్లే ఒక్క పార్లమెంట్ సీటు కూడా రాలేదట. అలాగే తెలంగాణలో తాము కూడా అసెంబ్లీ ఎన్నికలలోగానీ, పార్లమెంట్ ఎన్నికలలో గానీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకపోవడం వల్ల ఓటమి సంభవించిందట. చివరికి ఈయన తేల్చిన పాయింట్ ఏమిటంటే, పొత్తులు లేకపోవడం వల్లే ఓడిపోయాం తప్ప.. తమవైపు నుంచి ఏ తప్పూ లేదు.. చాలా పార్టీలకు ఎదురుదెబ్బలు తగిలాయి కాబట్టి.. తన పార్టీకి కూడా తగిలాయి. ఇదీ విషయం!

అప్పుడప్పుడు కేటీఆర్ మాటలు వింటుంటే, కేసీఆర్ కొడుకు కాబట్టి ఇంతకాలం అందలమెక్కి ఊరేగారుగానీ, మామూలుగా అయితే వార్డు మెంబర్ అవడానికి కూడా అర్హతలేని వ్యక్తి అనిపిస్తూ వుంటుంది. మాట్లాడ్డం ఎంతమాత్రం రాని వ్యక్తి అనిపిస్తూ వుంటుంది. అందుకే, స్వయానా కేటీఆర్ కుమార్తె ఈయనకి ఒక ఉపదేశం చేసిందట. అదేంటంటే, ‘‘డాడీ.. నువ్వు మీటింగ్‌లకి వెళ్ళినప్పుడు అస్సలు మాట్లాడకు. మీటింగ్ ప్రారంభంలో మాట్లాడమంటే, నా తర్వాత చాలామంది వున్నారు కాబట్టి నేనేమీ మాట్లాడను అని చెప్పి కూర్చో. మధ్యలో మాట్లాడమంటే, ముందు మాట్లాడినవాళ్ళు మాట్లాడారు... నా తర్వాత మాట్లాడాల్సిన వాళ్ళు చాలామంది వున్నారు కాబట్టి నేనేమీ మాట్లాడను అని చెప్పి కూర్చో. చివర్లో మాట్లాడమంటే, ముందు మాట్లాడివాళ్ళు అన్ని విషయాలూ మాట్లాడేశారు కాబట్టి, ఇక మాట్లాడాల్సింది ఏమీ లేదని చెప్పి కూర్చో’’ అని చెప్పిందట. ఈ విషయాన్ని ఓ సందర్భంలో కేటీఆరే గుర్తు చేసుకుని మురిసిపోయారు. ఆ బంగారు తల్లి చెప్పినట్టు ఈయన మీటింగ్స్.లో మాట్లాడ్డం మానుకుంటే, ఇంకా ఏమైనా పరువు మిగిలి వుంటే, అది కూడా పోకుండా వుంటుంది.