ప్రజాశాంతి పార్టీలో వైఎస్సార్సీపీ విలీనం?

వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి తన బరువుని, తన నెత్తిన వున్న వైఎస్సార్సీపీ పార్టీ బరువుని ఏదైనా జాతీయ పార్టీ నెత్తిన పెట్టేసి, తన చుట్టూ వున్న కేసుల నుంచి తాత్కాలిక ఉపశమనం పొందాలన్న ఆలోచనలో తన ప్రయత్నాలు తాను చేశారు. భారతీయ జనతా పార్టీని చాలామంది ‘వాషింగ్ పౌడర్ నిర్మా’ అని వెటకారంగా అంటూ వుంటారు. ఎన్ని మరకలు వున్నప్పటికీ, బీజేపీలో చేరితే చాలు... ఆ మరకలన్నీ వాషింగ్ పౌడర్ నిర్మా వేసి ఉతికినట్టు మాయమైపోతాయి. మన జగనన్న అయితే మరకల మయం. ఆ మరకలన్నీ పోవాలంటే బీజేపీలో తన పార్టీని విలీనం చేయడమే సరైన మార్గం అని జగన్ భావించారు. అయితే చాలామంది విషయంలో ‘మరక మంచిదే’ అని తనలోకి ఆహ్వానించిన బీజేపీ జగన్ విషయంలో మాత్రం ‘మరక ముంచేదే’ అని ఎంతమాత్రం ఇంట్రస్ట్ చూపించలేదు. ఎందుకంటే, జగన్ మరకలు వాషింగ్ పౌడర్ వదిలించగలిగేవి కావు.. చివరికి వాషింగ్ పౌడర్‌నే బలంగా పట్టుకునే మరకలు. అందువల్ల జగన్‌ పార్టీ విలీనం విషయం బీజేపీ నుంచి రెడ్ సిగ్నల్ వచ్చింది. ఏపీలో తెలుగుదేశం, జనసేన పార్టీలతో స్నేహబంధం కూడా వుండటంతో వైసీపీని విలీనం చేసుకునే సాహసం బీజేపీ ఇప్పట్లో చేసే అవకాశం లేదు. దాంతో జగన్ పార్టీకి బీజేపీ వైపు ద్వారాలు మూసుకుపోయాయి.

ఇక మిగిలిన ఒకే ఒక పార్టీ... కాంగ్రెస్! బెంగళూరు ప్యాలెస్‌కి వెళ్ళిన జగన్, పనిలోపనిగా కర్నాటక కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్‌ని కలిశారన్న వార్తలు వచ్చాయి. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలన్న ప్రపోజల్‌తోనే శివకుమార్‌ని జగన్ కలిశారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే జగన్ నన్ను కలవలేదు అంటూ శివకుమార్ నాలుగు రోజుల తర్వాత ఖండించినప్పటికీ, రాజకీయ నాయకుల మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. జగన్ చెప్పిన ప్రపోజల్‌ని శివకుమార్ కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్ళారని, ఆ జగన్ కంప మనకి తగిలించుకోవడం మంచిది కాదని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం రిజెక్ట్ చేసిందని సమాచారం. దరిమిలా కాంగ్రెస్ పార్టీ వైపు కూడా ద్వారాలు మూసుకుపోయాయి.

జగన్ తన పార్టీని జాతీయ పార్టీలో విలీనం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో జనం రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అందులో చాలామంది బలంగా చేస్తున్న ఒక కామెంట్ అందరికీ నవ్వు పుట్టించేలా వుంది. జగన్ తన పార్టీని కేఏ పాల్ అధ్యక్షతన వున్న ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయడం ఒక్కటే మార్గమని పలువురు నెటిజన్లు సూచిస్తున్నారు. కేఏ పాల్ నాయకత్వంలోకి జగన్ వెళ్ళడం వల్ల అంతర్జాతీయంగా సంబంధ బాంధవ్యాలున్న కేఏ పాల్ జగన్‌ని కాపాడే అవకాశం వుందని అంటున్నారు. ఇప్పుడు జగన్ వున్న పరిస్థితుల్లో ప్రజాశాంతి పార్టీలో వైఎస్సార్సీపీని విలీనం చేయడం తప్ప మరో మార్గం లేదని సూచిస్తున్నారు. ఈ నెటిజన్ల వెటకారం మామూలుగా లేదు కదూ?!