ముందు ముందు... హైవేలపై నో మందు!
posted on Dec 15, 2016 1:48PM

డ్రంక్ అండ్ డ్రైవ్ వద్దంటూ సిటీల్లో మనకు బోలెడు బోర్డులు కనిపిస్తాయి. పోలీసులు కూడా అప్పుడప్పుడు నోట్లో డిటెక్టర్లు పెట్టి చెకింగ్ లు చేస్తుంటారు. కాని, నిజంగా వాహనాలు వేగంగా వెళ్లేది ఎక్కడా? హైవే పైన! కాని, అక్కడ పెద్దగా చెకింగ్ లు జరిగినట్టు మనకు కనిపించదు. అసలు హైవేపై ఎవరన్నా మందు తాగి వంద కిలో మీటర్ల కన్నా ఎక్కువ వేగంతో దూసుకుపోతే ఏంటి పరిస్థితి? తాగిన వాడు చావటమే కాదు.. మిగతా వార్ని కూడా ఢీకొట్టి ప్రాణ నష్టం చేసే అవకాశం వుంది. కాని, విచత్రంగా మన ప్రభుత్వాలు అదే హైవేలపై మద్యం దుకాణాలకు లైసెన్స్ లు ఇస్తాయి తెలుసా? లారీల్లాంటి భారీ వాహనాలు నడిపే వారు హైవేపైనే ఫుల్ గా మందు తాగి విచ్చలవిడిగా డ్రైవింగ్ చేస్తే ఎవరిది బాధ్యత? ఈ విషయం పై ఎట్టకేలకు సుప్రీమ్ కోర్టే స్పందించింది!
ఇక ముందు హైవేలపై మద్యం దుకాణాలకు లైసెన్స్ లు ఇవ్వరాదని సుప్రీమ్ కోర్టు తాజాగా తేల్చి చెప్పింది. ప్రస్తుతం నడుస్తోన్న లైసెన్స్ ల కాలం ముగిశాక కొత్తగా లైసెన్స్ లు ఇవ్వొద్దని చెప్పింది. జాతీయ, రాష్ట్ర రహదారులు రెండిటి మీదా ఎక్కడా మందు వాసన రావటానికి వీల్లేదని అత్యున్నత న్యాయస్థానం తన తీర్పు ద్వారా స్సష్టం చేసింది. దీంతో మార్చి 31 తరువాత హైవేలపై వైన్ షాపులు కనిపించవన్నమాట!
నిజానికి హైవేలపై మద్యం అమ్మకాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రజా ప్రభుత్వాలదే. కాని, మందునే తమ ఆర్దిక రాబడికి మందుగా భావించే గవర్నమెంట్లు ఎంతో కాలంగా బాధ్య రాహిత్యంతో ప్రధాన రహదార్లపై మద్యం అమ్ముకోనిస్తున్నాయి. అధికారికంగా లైసెన్స్ లు ఇచ్చి ప్రొత్సహిస్తున్నాయి. దీని వల్ల సంవత్సరానికి దాదాపు ఒకటిన్నర లక్షల మంది మరణిస్తున్నారని ఒక స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. ఆ సంస్ఖ వేసిన పిల్ పై స్పందిస్తూనే సుప్రీమ్ మద్యం దుకాణాల బందుకి తీర్పునిచ్చింది. ఏప్రెల్ ఒకటి నుంచి హైవేలపై వైన్ షాపులు వుండటానికి వీల్లేదని తేల్చేసింది. కేవలం హైవేలపైనే కాదు మన దేశంలో ఇంకా చాలా చోట్ల మందు అమ్మకాలు అరికట్టాల్సి వుంది. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు సాధ్యం కాదనుకున్నప్పుడు గుళ్లు, బళ్లు, హైవేలు, ఆసుపత్రులు... ఇలాంటి అనేక చోట్ల వైన్, ఆల్కహాల్, కల్లు లాంటివి లభించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు వ్యాపార సంస్థల్లా రాబడి మీదే దృష్టి పెట్టడం కాకుండా జన సంక్షేమం కూడా గుర్తు పెట్టుకోవాలి!